శివసేన మాదే.. గవర్నర్ కు 34 మంది ఎమ్మెల్యేల లేఖ

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై తిరుగుబాటు చేసిన శివసేన సీనియర్ నాయకుడు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి 
 ఏక్ నాథ్ షిండేనే తమ నేతగా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. 34 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన ఒక లేఖను మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీకి పంపారు. 
 
ఏక్ నాథ్ షిండేను తమ నేతగా గుర్తించాలని వారు కోరారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి విప్ జారీ చేసే అధికారం లేదంటూ ఏక్ నాథ్ షిండే ట్వీట్ చేశారు. సీఎం ఉద్ధవ్ నివాసంలో జరిగే ఎమ్మెల్యేల భేటీ రాజ్యాంగ విరుద్ధమని వారు స్పష్టం చేశారు. 
 
శివసేన చీఫ్ విప్ గా  ఏక్ నాథ్ షిండేను మార్చి థాకరే చీఫ్ విప్ గా భారత్ గోగ్ వాలేను నియమించారు. కాగా, తన తిరుగుబాటు వెనుక బీజేపీ ప్రమేయం ఉందని వస్తున్న వార్తలో ఎలాంటి నిజం లేదని షిండే స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తాము బీజేపీ నేతలతో చర్చలు జరపలేదని వెల్లడించాయిరు. తామే నిజమైన శివసైనికులమని చెప్పారు. 
 
నేను చేసిన తప్పేమిటో చెప్పండి!
 
మరోవంక, ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ తాను చేసిన తప్పేమిటో చెప్పమని తిరుగుబాటు ఎమ్యెల్యేలను కోరారు. ఒకవేళ ప్రభుత్వం పడిపోయినా ఎన్నికలకు వెళ్లి మళ్లీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని భరోసా వ్యక్తం చేశారు. పార్టీ ఎమ్యెల్యేలు కోరితే తాను పార్టీ అధ్యక్ష పదవికి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
 
“సీఎం నివాస గృహం వర్షను ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. చర్చలకు రావాలని రెబల్‌ ఎమ్మెల్యేలను‌, ఏక్‌నాథ్‌ షిండేను ఆహ్వానిస్తున్నా. నేను నమ్మకద్రోహానికి గురయ్యాను. నాతో ఏక్‌నాథ్‌ షిండే నేరుగా మాట్లాడాలి. శివసేన సైనికుడు ఎవరైనా సీఎం కావొచ్చు. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేను. శివసేన పార్టీని నడిపేందుకు నేను పనికిరానని చెప్పండి.. పార్టీ నుంచి తప్పుకుంటా. పదవులు వస్తాయి.. పోతాయి. అధికారం కోసం నేను పాకులాడటం లేదు” అని ఉద్ధవ్‌ ఠాక్రే స్పష్టం చేశారు.
 
ఇలా ఉండగా, మహారాష్ట్రలోని మహా వికాస్‌ అఘాఢ ప్రభుత్వం సంక్షోభంలో చిక్కుకున్న సమయంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీతో పాటు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే బుధవారం కరోనా బారిన పడ్డారు. గవర్నర్‌ను రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. 
 
అయితే ఆయన్ను కలవాలనుకుంటున్నవారు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడవచ్చంటూ రాజభవన్‌ నుంచి ప్రకటన వెలువడింది. ఇటు ఉద్ధవ్‌కు కరోనా వచ్చినట్లు కాంగ్రెస్‌ నేత కమల్‌నాథ్‌ కూడా ధ్రువీకరించారు.  మరోవైపు మహారాష్ట్ర కేబినెట్‌ వర్చువల్‌గా భేటీ అయ్యింది. కేబినెట్‌ సమావేశానికి 8 మంది మంత్రులు హాజరు కాలేదు.