తదుపరి రాష్ట్రపతిగా ముర్ము.. వనవాసి కళ్యాణ్ ఆశ్రమం హర్షం

భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే  రాష్ట్రపతి ఎన్నికలకు అభ్యర్థిగా జార్ఖండ్ మాజీ గవర్నర్  ద్రౌపది ముర్మును ఎంపిక చేయడం పట్ల భారతదేశపు అతిపెద్ద గిరిజన సంక్షేమ సంస్థ అయిన అఖిల భారతీయ వనవాసి కళ్యాణ్ ఆశ్రమం (ఎబివికెఎ) హర్షం ప్రకటించింది.
 
 స్వాతంత్ర్య కా అమృత్ మహోత్సవ్ పేరుతో దేశం మొత్తం 75 ఏళ్ల స్వాతంత్ర్య మహోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో సంతాలీ జనజాతి మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదిస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మద్దతుగల సంస్థ ఈ సంస్థ విశ్వసిస్తోంది. భారతదేశంలోని 12 కోట్ల మంది జన జాతి ప్రజలకు సంబంధించిన సుదూర ముద్రల చారిత్రాత్మక క్షణంగా దీనిని పరిగణిస్తున్నట్లు ప్రకటించింది. 
 
 జనజాతీయులు ఘనమైన  భారత దేశపు సంప్రదాయంలో అంతర్భాగం, గౌరవనీయమైన సంస్కృతికి వారసులు. అయినప్పటికీ, అనేక శతాబ్దాలుగా నిర్లక్ష్యంకు గురయ విస్మరింపబడుతున్నారని తెలిపింది.  
 
దేశంలోనే అత్యున్నత రాజ్యాంగబద్ధమైన పదవికి జన జాతి ప్రతినిధిని నామినేట్ చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, ఎన్డీయేలోని అన్ని రాజకీయ పార్టీలకు ఎబివికెఎ  అభినందనలు తెలియజేస్తున్నట్లు  ఎబివికెఎ అధ్యక్షుకీ రామచంద్ర ఖరాడి అరుణాచల్ ప్రదేశ్ లోని నంసాయిలో జరిగిన కేంద్రీయ కార్యకారి మండల సమావేశం నుండి ఒక ప్రకటనలో తెలిపారు. 
 
ద్రౌపది ముర్ము జీవిత ప్రయాణం మొత్తం కలహాలతో సాగిందని,  ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాకు చెందిన ద్రౌపది ముర్ము తన జీవితాన్ని సమాజానికి సేవ చేయడానికి, పేద, అణగారిన, అట్టడుగు వర్గాలకు సాధికారత కల్పించడానికి అంకితం చేసిందని ఆయన కొనియాడారు.  రాజకీయ జీవితాన్ని పెంపొందించుకోవడం కోసం ఎదురైన ప్రతి కష్టాన్ని,  బాధను  ఓడించిందని ఆయన పేర్కొన్నారు. 
 
పైగా, ఆమెకు గొప్ప పరిపాలనా అనుభవం ఉందని,  మధ్య భారతదేశంలో జార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్ గా సేవలు అందించిన  అత్యుత్తమ పదవీకాలం ఉందని తెలిపారు. తన అనుభవం, విధానపరమైన విషయాలపై గల అవగాహన, దయగల స్వభావం భారత్‌కు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని ఎబివికెఎ విశ్వాసం వ్యక్తం చేసింది. 
 
ద్రౌపది ముర్ము నామినేషన్‌కు మద్దతు ఇవ్వాలని, ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు సంస్థ విజ్ఞప్తి చేసింది. ఎన్‌డిఎ ప్రభుత్వం సామాజిక ఐక్యతకు మార్గనిర్దేశం చేసినందుకు ప్రశంసనీయమైన నిర్ణయాన్ని అభినందిస్తూ, గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకు జన జాతి సమగ్ర అభివృద్ధి పట్ల తమ నిబద్ధతను ప్రకటించడానికి ఇది అరుదైన అవకాశాన్ని కల్పించిందని ఎబివికెఎ తెలిపింది.  

ఢిల్లీ చేరుకున్న ద్రౌపదీ ముర్మూ

ఇలా ఉండగా, ఎన్‌డిఎ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్మూ ఢిల్లీ చేరుకున్నారు. ముర్మూకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, గజేంద్ర సింగ్ షెకావత్, ఇతర నేతలు స్వాగతం పలికారు. ఢిల్లీలోని ఒడిశా సదన్‌లో ద్రౌపదీ బస చేస్తున్నారు. నామినేషన్ వేసే వరకు ముర్మూకు సహాయకారిగా కిషన్ రెడ్డి ఉండనున్నారు.
 
 ముర్మూ నామినేషన్‌కు ప్రహ్లాద్ జోషి నివాసంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ముర్మూ నామినేషన్‌పై ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఉత్తరాఖండ్, యుపి ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు సంతకాలు చేయనున్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపదీ ముర్మూ నామినేషన్ వేయనున్నారు.