కూటమి నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధం… సంజయ్ రౌత్

ముఖ్యమంత్రి పదవికి రాజీనామాకు సిద్ధం అంటూ ఉద్ధవ్ థాకరే అధికార నివాసాన్ని ఖాళీ చేయడంపై స్పందిస్తూ ఆయన పదవికి రాజీనామా అవసరం లేదని, ఎన్‌సిపి, కాంగ్రెస్‌లతో కూటమి రద్దు చేసుకుంటే చాలని  ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని రెబల్‌ ఎమ్మెల్యేలు ప్రకటించడంతో మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం కొత్త మలుపు తిరిగింది. 
 
అందుకు ప్రతిగా,  రెబల్ ఎమ్మెల్యేలు కోరుకుంటే మహా వికాస్ అఘాడీ  కూటమి నుంచి బయటకు వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రకటించారు. అయితే, ఇందుకాయన ఓ షరతు కూడా విధించారు. రెబల్ ఎమ్మెల్యేలు 24 గంటల్లో గౌహతి నుంచి ముంబై వచ్చి సీఎం ఉద్ధవ్‌ థాకరేను, కలిసి ఆయన ముందు ఆ ప్రతిపాదన చేసి చర్చించాలని సూచించారు.
 
ఉద్ధవ్‌ థాకరే రాజీనామాను తాము కోరుకోవడం లేదని, బిజెపి భాగస్వామ్యంతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నట్లు గౌహతిలో రెబెల్ ఎమ్యెల్యే దీపక్‌ కేస్కర్‌ తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుంటే మహారాష్ట్రకు ప్రయోజనాలు ఉంటాయని, 41 మంది ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్‌ షిండే వైపే ఉన్నారని స్పష్టం చేశారు. 
 
ఉద్దవ్‌ థాకరేతో ఇప్పటికే పలుమార్లు చర్చించామని, కానీ ఆయన రాజీనామా చేస్తానంటున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో కీలకమైన మంత్రి పదవులన్ని కాంగ్రెస్‌, ఎన్‌సిపిలకే దక్కాయని, శివసేనకు కేవలం పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖలు మాత్రమే ఉన్నాయని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బిజెపితో జట్టుకట్టాలని ఇక్కడున్న ఎమ్మెల్యేలు భావిస్తున్నారని దీపక్‌ కేస్కర్‌ వెల్లడించారు.
 
ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే భావోగ్వేదంతో ఎమ్మెల్యేలకు చేసిన విజ్ఞప్తి విఫలమైంది. వర్షాలో ఆయన నిర్వహించిన భేటీ కేవలం 12 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చినట్లు  సమాచారం. ఉద్ధవ్‌తో కలిసి ఆ పార్టీకి ప్రస్తుతం 13 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు.
 
పైగా, ఉద్ధవ్‌ థాకరే సొంత పార్టీ ఎమ్మెల్యేల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని రెబల్‌ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేవారు. రెండున్నరేళ్లుగా తమను థాకరే అధికారిక నివాసం ‘వర్షా’కు రానీయకుండా తలుపులు మూసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిత్రపక్షాలైన ఎన్‌సిపి, కాంగ్రెస్‌ నేతలకు వర్షాలోకి ఎలాంటి అడ్డంకులు లేకుండా వెళ్లేవారని, కానీ తమను మాత్రం థాకరే నివాసంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు.
 
థాకరే భావోద్వేగ ప్రసంగంపై  ప్రసంగంపై స్పందిస్తూ రెబల్‌ ఎమ్మెల్యేల్లో ఒకరైన సంజరు షిర్సాత్‌ ఒక లేఖను విడుదల చేస్తూ తమని రెండున్నర ఏళ్లుగా సిఎం ఇంటికి రానివ్వలేదని, వారి నివాసం గేటు వద్ద ఎదురుచూస్తూ నిలుచున్నామని పేర్కొన్నారు. కానీ సంజరు రౌత్‌ చాణుక్యుడిలా అడ్డగించేవారని మండిపడ్డారు. 
 
ఆదిత్య థాకరే అయోధ్యకు వెళ్లిన సమయంలో తమను ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. ముంబయి విమానాశ్రయానికి చేరుకున్న తమను వెనక్కి రప్పించారని, రామ్‌ లల్లా దర్శించుకునేందుకు ఎందుకు అనుమతించలేదని నిలదీశారు. 
 
మరోవైపు శివసేన పార్టీపై  ఏక్‌నాథ్‌ షిండే పూర్తి పట్టు సాధించారు. గౌహతి హోటల్‌ నుంచి మొత్తం 42 మంది ఎమ్మెల్యేలతో వీడియో విడుదల చేశారు. 42 మందిలో 35 మంది శివసేన, ఏడుగురు స్వతంత్రులు ఉన్నారు. విల్లు బాణం గుర్తు కోసం ఈసీకీ లేఖ రాసే యోచనలో షిండే ఉన్నారు. శివసేన పార్టీ గుర్తు తమకే కేటాయించాలని కోరుతున్నారు. ఇప్పటికే తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఏక్‌ నాథ్‌ షిండే సీఎం ఉద్దవ్‌ ఠాక్రేకు గురువారం మూడు పేజీల లేఖ రాశారు.
 
ఇలా ఉండగా, కూటమి నుంచి తాము బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నసంజయ్ రౌత్ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్.. తమ పార్టీ నేతలతో సహ్యాద్రి గెస్ట్‌హౌస్‌లో సమావేశమైంది. ఆ పార్టీ సీనియర్ నేతలైన హెచ్‌కే పాటిల్, బాలాసాహెబ్ థోరట్, నానా పటోలే, అశోక్ చవాన్ తదితరులు హాజరయ్యారు. 
 
 రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలన్న లక్ష్యంతోనే తాము శివసేనతో ఉన్నామని తెలిపింది. ఈ సంక్షోభం మొత్తానికి ఈడీనే కారణమని నిందించింది. సభలో బలపరీక్షకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. తాము ఎంవీయేతోనే ఉన్నామని, ఇకపైనా ఉంటామని తేల్చి చెప్పింది.  వారు (శివసేన) కావాలనుకుంటే ఎవరితోనైనా జట్టుకట్టొచ్చని, తమకు ఎలాంటి సమస్య లేదని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు  నానా పటోలే తెలిపారు.