ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబంలో 8 మంది మృతి

ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబంలో 8 మంది మృతి
దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్‌లోగల ఓ రెస్టారెంట్‌లో బుధవారం ఉదయం భారీ స్థాయిలో మంటలు చెలరేగి 21 మంది మరణించిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. గురుగ్రామ్‌లోని సెక్టార్ 46కు చెందిన వివేక్ అగర్వాల్ అనే చార్టర్డ్ అకౌంటెంట్ ఢిల్లీలోని మాక్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న తన తండ్రిని పరామర్శించడానికి ఢిల్లీకి వచ్చారు. 
 
అతనితో పాటు అతని భార్య తర్జనీ అగర్వాల్, ఇద్దరు కుమార్తెలు జివిషా, వర్య మరో నలుగురు బంధువులు కూడా వచ్చారు. అగ్నిప్రమాదం జరిగిన ఫ్లోరిష్ స్టే బెడ్-అండ్-బ్రేక్‌ఫాస్ట్‌లోనే వివేక్ రెండు గదులను బుక్ చేసుకున్నారు. అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఆ బృందం హోటల్ రెస్టారెంట్‌లో అల్పాహారం తీసుకుంటోంది. ఈ అగ్నిప్రమాదంలో మొత్తం ఎనిమిది మంది మరణించారు. 
 
వివేక్ కుటుంబంలో ప్రాణాలతో మిగిలిన ఏకైక వ్యక్తి వివేక్ అగర్వాల్ తండ్రి రాధే శ్యామ్ అగర్వాల్(80). కుటుంబంలోని ఎనిమిది మంది మరణించడంతో గురుగ్రామ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.   కాగా, షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ విషాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ప్రాంగణంలో ఎల్పీజీ సిలిండర్లు ఉన్నప్పటికీ, ఈ ఘటనలో వాటిలో ఏదీ పేలిందనడానికి అధికారులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. హోటల్‌లో కొన్ని ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు ఉన్నాయని, అయితే అవి ఏమాత్రం ఉపయోగపడలేదని తెలిపారు. 
 
బుధవారం రాత్రి పోలీసులు ఆస్తి యజమాని లవ్‌కేష్ బజాజ్‌ను అరెస్టు చేశారు. విచారణలో, తాను సుమారు మూడేళ్ల క్రితం అహ్లువాలియా అనే వ్యక్తి నుంచి ఫ్లోరిష్ స్టేస్ ఆస్తిని కొనుగోలు చేసినట్లు అతను చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఒక పోలీసు అధికారి ఫిర్యాదు మేరకు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం, యజమాని భవనంలో తగిన భద్రతా చర్యలు చేపట్టడంలో విఫలమవ్వడంతో, అగ్నిప్రమాదం జరిగి పలువురు మరణించారు. హత్యగా పరిగణించబడని నేరపూరిత నరహత్య ఆరోపణలపై ఈ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 
 
మరోవంక, ఢిల్లీ ప్రభుత్వం తన బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని, దాని కింద లైసెన్స్ పొందిన అన్ని సంస్థలను సమీక్షించాలని నిర్ణయించిందని పర్యాటక శాఖ మంత్రి కపిల్ మిశ్రా తెలిపారు. “మేము బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అధికారికంగా ఉపసంహరించుకోబోతున్నాము.  దాని కింద లైసెన్స్ పొందిన అన్ని సంస్థలను తనిఖీ చేస్తాము,” అని మిశ్రా  తెలిపారు. 
 
“లైసెన్స్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలిన ఆపరేటర్లపై చర్యలు తీసుకుంటాము. ఈ పథకం కింద నమోదైన ఏదైనా సంస్థ ఆరు గదుల కంటే ఎక్కువగా నడుపుతున్నట్లు తేలితే, దాని లైసెన్స్ రద్దు చేస్తాం,” అని చెప్పారు.