50 మంది ఎమ్యెల్యేల మద్దతు అంటున్న షిండే.. బిజెపితో పొత్తుకు పట్టు!

మహారాష్ట్ర ముఖ్యమంత్రి,  శివసేన అధినేత ఉద్ధవ్  థాకరేపై తిరుగుబాటు   చేసి, పలువురు ఎమ్యెల్యేలతో గుజరాత్  లోని ఓ హోటల్  లో మకాం వేసి రాజకీయ సంక్షోభం సృష్టించిన  శివసేన సీనియర్ నేత, మంత్రి ఏక్‌నాథ్ షిండే తనకు 50 మంది శివసేన ఎమ్యెల్యేల మద్దతు ఉన్నట్లు ప్రకటించారు. కాగా, తన మకాంను బుధవారం ఉదయం గౌహతికి మార్చారు.
ఓ ప్రత్యేక విమానంలో ఉదయం 6.30 గంటలకు గౌహతికి చేరుకున్న ఆయన తనతో పాటు 40 మంది ఎమ్యెల్యేలు ఉన్నారని, మరో 10 మంది మద్దతు తనకు ఉన్నదని వెల్లడించారు. అయితే తాను `బాబాసాహెబ్ (బాలథాకరే) శివసేన’లోనే కొనసాగాలి అనుకుంటున్నట్లు  స్పష్టం చేశారు.
మంగళవారం నేరుగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో ఫోన్లో మాట్లాడిన ఆయన తాను ముఖ్యమంత్రి కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. శివసేన ఎమ్యెల్యేలు ఎన్సీపీ, కాంగ్రెస్ లతో పొత్తుకు విముఖంగా ఉన్నారని, ఆ పార్టీలతో తెగతెంపులు చేసుకొని బిజెపితో తిరిగి చేరాలని కోరుకొంటున్నట్లు స్పష్టం చేశారు.
తమ డిమాండ్లు ఆమోదించని పక్షంలో శివసేనతో చీలిక తప్పదని పేర్కొంటూ ఉద్ధవ్ పదవిలో కొనసాగాలి అంటే తిరిగి బిజెపితో చేతులు కలపవలసిందే అని తేల్చి చెప్పారని తెలిసింది. లేని పక్షంలో  థాకరే  ప్రభుత్వం కూలిపోవడం  తధ్యమనే సంకేతం ఇచ్చారు.
ఎంతమంది ఎమ్యెల్యేలు షిండేతో కలసి ఉన్నారనే అంశంపై స్పష్టత లేకపోయినప్పటికీ, మంగళవారం ముఖ్యమంత్రి థాకరే జరిపిన పార్టీ ఎమ్యెల్యేల సమావేశంపై 16 మంది పార్టీ ఎమ్యెల్యేలు మాత్రమే హాజరైనట్లు చెబుతున్నారు.
 రాజకీయ సంక్షోభం పరిష్కారం కోసం సేన నేత మిలింద్ నర్వేకర్ సూరత్ వెళ్లి హోటల్‌లో ఉన్న ఏక్‌నాథ్‌ను మంగళవారం కలిశారు. దాదాపు రెండు గంటల పాటు వీరి మధ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం ఉద్ధవ్ థాకరేకు ఫోన్ కలిపిన మిలింద్ నర్వేకర్ షిండేతో మాట్లాడించినట్టు తెలుస్తోంది.
 
ఈ సందర్భంగా షిండే తన వద్ద 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, బీజేపీతో ఉద్ధవ్ థాకరే పొత్తు పెట్టుకునేందుకు ముందుకొస్తే ఎలాంటి సమస్య ఉండబోదని, లేదంటే పార్టీలో చీలిక తప్పదని తెగేసి చెప్పినట్లు చెబుతున్నారు.   కాగా, షిండే తిరుగుబాటు తర్వాత ఆయనను సేన సీఎల్పీ నేత పదవి నుంచి పార్టీ తప్పించింది.
 
ఏక్‌నాథ్ డిమాండ్‌పై ఉద్ధవ్ మాట్లాడుతూ బిజెపి గతంలో శివసేన నేతలను ఇబ్బందులకు గురిచేసిందని చెప్పగా ఎన్సీపీ, కాంగ్రెత్‌తో పొత్తు పెట్టుకోవడాన్ని తనతోపాటు ఉన్న ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు షిండే స్పష్టం చేశారు. అంతకు ముందు, ఏక్‌నాథ్ షిండే ట్విట్టర్ వేదకగా స్పందిస్తూ  బాలాసాహెబ్ ( బాలథాకరే) బోధనలను తాము ఆదర్శంగా తీసుకున్నామే కానీ ఏరోజూ అధికారం కోసం మోసానికి పాల్పడలేదని తెలిపారు.
 
”మేము బాలాసాహెబ్ థాకరేకు బలమైన సైనికులం. బాలాసాహెబ్ మాకు హిందుత్వ పాఠాలు నేర్చించారు. బాలాసాహెబ్, ఆనంద్ దిఘే బోధనలను పాటిస్తున్న మేము అధికారం కోసం ఎన్నటికీ మోసానికి పాల్పడేది లేదు” అని ట్వీట్ చేశారు. దివంగత ఆనంద్ ధిఘే శివసేనకు చెందిన దివంగత దిగ్గజనేత. షిండేకు రాజకీయ గురువు.