రామాయణ సర్క్యూట్ యాత్ర రైలు ప్రారంభం

రామాయణ సర్క్యూట్ ను కనెక్ట్ చేసే తొలి పర్యాటక రైలు ప్రారంభమైంది. న్యూఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్ నుండి భారత్ గౌరవ్ రైలును కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. రామాయణ గాధతో ముడిపడిన ఎన్నో విఖ్యాత ఆలయాలను ఈ రైలు అనుసంధానిస్తుంది. ఇది భారత్, నేపాల్‌లను కలుపుతున్న మొదటి భారత్ గౌరవ్ రైలు. 
 
ఈ  రైలు ద్వారా రాముడు నడయాడిన అన్ని ప్రాంతాలను కలుపుతున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ రైలు ఉత్తర-దక్షిణ భారతదేశాన్నిమాత్రమే కాదు, భారత్-నేపాల్ దేశాలను కూడా కలుపుతుందని వెల్లడించారు.  ఢిల్లీ నుంచి బయలుదేరి అయోధ్య, నేపాల్, రామేశ్వరం వరకు అనేక ప్రాంతాలను చుట్టి వచ్చి చివర్లో  తెలంగాణకు వెళ్తుందని చెప్పారు.
దక్షిణ అయోధ్యగా పేరున్న భద్రాచలం పర్యటించడంతో యాత్ర ముగిసి, తిరిగి ఢిల్లీకి చేరుకుంటుందని చెప్పారు.  మొత్తం 18 రోజుల పాటు సాగే ప్రయాణంలో భోజన, వసతి, స్థానిక రవాణా సదుపాయాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ రైలులో మొత్తం 14 కోచ్ లు ఉంటాయి. 600 మంది సామర్థ్యం కలిగిన ఈ రైలు మొదటి ప్రయాణం 500 మంది యాత్రికులతో మొదలైంది. కోచ్‌లన్నీ కూడా 3 టైర్ ఏసీ సౌకర్యంతో యాత్రకు అనుగుణంగా ప్రత్యేక మార్పులతో రూపొందాయి. అవసరమైన చోట సమీప హోటళ్లలోని ఏసీ గదుల్లో బస ఏర్పాటు చేశారు.
బుద్ధిస్ట్ సర్క్యూట్ రైలు మార్గం తాను మంత్రి కాకముందే ఖరారైందని, తెలుగు రాష్ట్రాల్లోని బౌద్ధ క్షేత్రాలను కూడా ఇందులో కలపాలన్న ప్రతిపాదన ఉందని చెప్పారు. త్వరలోనే దానిపై కూడా నిర్ణయం తీసుకుంటామని పేర్కొ న్నారు.
 
ఇది ఢిల్లీ  నుంచి బయలుదేరి 8వేల  కిలోమీటర్లు ప్రయాణించి నేపాల్ లోని జనక్ పూర్ కు చేరుకుంటుంది. మొత్తం 18 రోజుల టూర్ ప్యాకేజీ విలువ రూ. 62 వేలు (ఒకరికి).  ఈ టికెట్ ను బుక్ చేసుకొని ఈఎంఐ పై టికెట్ చార్జీని చెల్లించే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు.  
 
ఈ ట్రైను లో మొత్తం 600  సీట్లు, 11 ఏసీ త్రీ టైర్ కోచ్ లు ఉన్నాయి. ‘భారత్ గౌరవ్’ రైలు మొదటి స్టాప్ అయోధ్య.  అక్కడ పర్యాటకులు దిగి రామ జన్మభూమి ఆలయాన్ని దర్శించుకోవచ్చు.  
 
అంతకంటే ముందు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కలిసి కిషన్ రెడ్డి పచ్చ జెండా ఊపి ఈ రైలు యాత్రను ప్రారంభించారు. భారత్ – నేపాల్ మధ్యన నడిచే మొట్టమొదటి పర్యాటక రైలుగా ఇది రికార్డుల్లోకి ఎక్కనుంది. భారత్ గౌరవ్ రైళ్ల పేరుతో దేశవ్యాప్తంగా 3,500 కోచ్‌లతో పర్యాటక రైళ్లను భారత ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని కిషన్ రెడ్డి తెలిపారు. 
 
ఈ నెల 14 వ తేదీన “షిర్డీ యాత్ర” పేరిట మొట్టమొదటి భారత్ గౌరవ్ పర్యాటక రైలు ప్రారంభమైంది. తాజాగా శ్రీరాముడు జన్మించిన నేలను మొదలుకొని ఆయన జీవితానికి సంబంధించిన అనేక ముఖ్యమైన ప్రాంతాలను కలుపుతూ ‘శ్రీ రామాయణ యాత్ర’ పేరిట భారత్ గౌరవ్ పర్యాటక రైలు ప్రారంభమైంది.
కాగా, తెలంగాణలోని భద్రాచలం, తమిళనాడులోని రామేశ్వరం, హంపి, పంచవటి (నాసిక్), చిత్రకూట్, ప్రయాగ్ రాజ్, వారణాసి, సీతామడి, నందిగ్రామ్, అయోధ్యలను అనుసంధానిస్తూ మరో ప్రత్యేక రూట్ లోనూ ‘భారత్ గౌరవ్’ రైలును నడపనున్నారు.