రాష్ట్రపతి బిజెపి అభ్యర్థిగా తొలిసారి ఆదివాసి ద్రౌపది ముర్ము

అనేక ఊహాగానాలకు తెరదించుతూ ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును భారతీయ జనతా పార్టీ ఎంపిక చేసింది. మంగళవారం రాత్రి ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఆమె పేరును ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికైతే పలు ఘనతలు ఆమె ఖాతాలో చేరనున్నాయి. తొలి గిరిజన, తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగానే కాక  స్వాతంత్య్రం తర్వాత జన్మించిన తొలి రాష్ట్రపతి ఈమెనే కానున్నారు. ఇప్పటివరకు భారత రాష్ట్రపతిగా ఎన్నికైన వారంతా 1947కు ముందు జన్మించినవారే.
ముర్ము పేరును ఖరారు చేయడానికంటే ముందు బీజేపీ అగ్రనాయకత్వం అటు మిత్రపక్షాలు, ఇటు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో చర్చించారు. 20 మంది పేర్లు పరిశీలించిన తర్వాత ముర్మును ఖరారు చేసినట్లు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేడీ నడ్డా వెల్లడించారు.
 
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచిన ఇప్పటి వరకు గిరిజన-ఆదివాసీ వర్గాలకు రాష్ట్రపతి పదవిలో కూర్చునే అవకాశం లభించలేదు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ముర్మును ఎంపిక చేసినట్లు నడ్డా తెలిపారు. ద్రౌపది ముర్ము విశేష ప్రతిభాశాలి అని, రాష్ట్ర మంత్రిగా, గవర్నర్గా మెరుగైన సేవలు అందించారని కొనియాడారు. 
 
వెనుకబడిన ఒడిస్సా రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన మయూర్‌భంజ్‌ జిల్లా బైడపోసి గ్రామంలో 1958 జూన్‌ 20న గిరిజన కుటుంబంలో జన్మించారు ద్రౌపది ముర్ము. వీరిది గిరిజన వర్గంలోని సంథాల్‌ తెగ. పేదరికపు అడ్డంకులను అధిగమిస్తూ విద్యాభ్యాసం సాగించారు. భువనేశ్వర్‌లోని రమాదేవి మహిళా కళాశాలలో డిగ్రీ చదివారు. 
 
ఆర్ట్స్‌ విద్యార్థి అయిన ముర్ము.. సాగునీటి-విద్యుత్తు శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేశారు. రాయ్‌రంగాపూర్‌లోని శ్రీ అరబిందో సమీకృత విద్యా కేంద్రంలో స్వచ్ఛందంగా ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. రాజకీయ రంగప్రవేశం తర్వాత ద్రౌపది ముర్ము బీజేపీ తరఫున 1997లో రాయ్‌రంగ్‌పూర్‌ నగర పంచాయతీ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు.
2000 సంవత్సరంలో రాయ్‌రంగ్‌పూర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బిజూ జనతాదళ్‌ (బీజేడీ), బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో 2000-2004 మధ్య వాణిజ్య, రవాణా, మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఒడిస్సాలో ఉత్తమ పనితీరు కనబరిచే ఎమ్మెల్యేలకు అందించే నీలకంఠ అవార్డును 2007లో అందుకున్నారు. 2004లో రెండోసారి ఎన్నికయ్యారు.
పార్టీపరంగా బీజేపీ ఒడిస్సా ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షురాలు, అధ్యక్షురాలిగా వ్యవహరించారు. 2010, 2013లో రెండుసార్లు మయూర్‌భంజ్‌ పశ్చిమ జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2013లో ముర్మును బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా నియమించారు.
మయూర్‌భంజ్‌ పశ్చిమ జిల్లా అధ్యక్షురాలిగా ఉన్నప్పుడే.. 2015 మే 18న జార్ఖండ్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. 2021 జూన్‌ 12 వరకు ఆ పదవిలో కొనసాగారు. జార్ఖండ్‌ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్‌గా ద్రౌపది ముర్ము చరిత్రకెక్కారు.
ద్రౌపది ముర్మురాజకీయ జీవితం ఉజ్జ్వలంగానే సాగినా.. వ్యక్తిగత జీవితం మాత్రం విషాదభరితం. ముర్ము భర్త శ్యాంచరణ్‌ ముర్ము. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అయితే, భర్త, ఇద్దరు కుమారులు గతంలోనే చనిపోయారు. కుమార్తె ఇతిశ్రీ. కూతురుకు వివాహమైంది.  Dకాగా, జూన్‌ 20 ద్రౌపది ముర్ము జన్మదినం. 64వ జన్మదినోత్సవం మరుసటి రోజే ఆమెను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేస్తూ బీజేపీ అధిష్ఠానం తీపి కబురు చెప్పింది.