కొన్ని నిమిషాలపాటు చేసే ధ్యానం ఉత్తేజితుల్ని చేస్తుంది 

కొన్ని నిమిషాలపాటు చేసే ధ్యానం ఉత్తేజితుల్ని చేస్తుందని  ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్నాటకలోని మైసూర్ ప్యాలెస్ గ్రౌండ్ తో జనంతో కలిసి  నిర్వహించిన కార్యక్రమంలో మోదీ పాల్గొని యోగాసనాలు వేశారు.
 
యోగా ఏ ఒక్కరికో చెందినది కాదనీ… అందరిదని చెబుతూ యోగాతో క్రమశిక్షణ, ఏకాగ్రత అలవడుతుందని ప్రధాని చెప్పారు. యోగాను గుర్తించిన ఐక్యరాజ్యసమితి (ఐరాస) సహా ప్రపంచ దేశాలకు మోడీ  ధన్యవాదాలు చెప్పారు. భారత ప్రత్యేకతను, వైవిధ్యాన్ని యోగా ప్రతిబింబిస్తుందని తెలిపారు. 
 
75 చారిత్రక ప్రాంతాల్లో యోగా ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పారు. యోగా డే ప్రపంచవ్యాప్తంగా పండుగలా మారిందని గుర్తు చేశారు. ఆరోగ్యం, శాంతి, సంతోషానికి సూచిక యోగా అని అన్నారు.  కొన్నేళ్ల క్రితం అయితే ఆధ్యాత్మిక కేంద్రాల్లోనే యోగా కనిపించేదని, కానీ ప్రస్తుతం ప్రపంచం నలుమూలలా విస్తరించిందన్నారు. 
 
యోగా దినోత్సవం.. ఆరోగ్యం, సంతోషం, శాంతికి సూచిక అని ప్రధాని చెప్పారు. ప్రస్తుతం యోగా ప్రపంచం నలుమూలలా విస్తరించిందని, కరోనా విపత్తు సమయంలోనూ దీన్ని నిర్వహించామని ప్రధాని తెలిపారు.
 
సమాజంలో శాంతిని నెలకొల్పి సమస్యల పరిష్కారానికి యోగా దోహదం చేస్తుందని, జీవన విధానానికి మార్గంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇది వ్యక్తికే పరిమితం కాదనీ.. సకల మానవాళికి ఉపయుక్తమైనదని చెప్పారు. యోగా సందేశాన్ని సకల మానవాళికి చేరవేయాలని ప్రధాని మోడి ఆకాంక్షించారు.
 
ప్రధానితో పాటుగా  కేంద్ర ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్, కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, ముఖ్యమంత్రి బసవరాజ్  బొమ్మై కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

భారతీయ సంస్కృతికి ప్రతీక

యోగం అంటే సాధన చేయడమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొంటూ యోగా అంటే ఏకాగ్రతను సాధించడమని చెప్పారు. యోగా ప్రాచీనమైనదనీ ఎప్పటికీ కాలదోషం పట్టనిది అని స్పష్టం చేశారు.
యోగా ఆత్మవిశ్వాసం కల్పిస్తుందని చెబుతూ కుల మతాలకు అతీతమైనది యోగా అని, యోగా భారతీయ సంస్కృతికి ప్రతీక అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. యోగా ప్రపంచ దేశాల్లో శాంతికి దోహదం చేస్తుందని చెబుతూ దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాలని పిలుపునిచ్చారు.
ఏ స్థాయిలో ఉన్న యోగా తప్పనిసరి అని తెలిపుతూ కొంత సమయం యోగా చేస్తే ఆరోగ్యానికి మంచిదని, పెద్దలు అందించిన యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.  యోగా దినోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నటుడు అడవి శేషు, బాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ… యోగా దినోత్సవానికి తనను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతి రోజూ యోగాను ప్రాక్టీసు చేస్తేనే ఫలితం ఉంటోందని  చెబుతూ యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని చెప్పారు. ఎంత బిజీలో ఉన్నా రోజూ 30 నిమిషాలు యోగా చేయటం అలవాటు చేసుకోవాలని పీవీ సింధు సూచించారు.