అగ్నివీరుల భ‌విష్య‌త్ పూర్తిగా భ‌ద్ర‌మే

అగ్నివీరుల భ‌విష్య‌త్ పూర్తిగా భ‌ద్ర‌మేన‌ని, అగ్నిప‌థ్ రిక్రూట్‌మెంట్ స్కీంపై ఎలాంటి అపోహ‌లు వ‌ద్ద‌ని జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ భ‌రోసా ఇచ్చారు. రెగ్యుల‌ర్ స‌ర్వీసులోకి తీసుకునే అగ్నివీరుల‌కు క‌ఠోర శిక్ష‌ణ ల‌భిస్తుంద‌ని, నిర్ధిష్ట కాలంలో మెరుగైన అనుభ‌వం సాధిస్తార‌ని చెప్పారు. 
 
అగ్నిప‌థ్ స్కీంను స‌మ‌ర్ధించిన అజిత్ దోవ‌ల్ యువ‌, సుశిక్షిత సేన‌లు సైన్యానికి అవ‌స‌ర‌మ‌ని తెలిపారు. రెజిమెంట‌ల్ వ్య‌వ‌స్ధ య‌ధావిధిగా కొన‌సాగుతుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అగ్నిపథ్‌ను వ్య‌తిరేకిస్తూ జ‌రుగుతున్న హింసాత్మ‌క నిర‌స‌న‌ల‌పై అజిత్ దోవ‌ల్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. విధ్వంసం, హింసాకాండ‌ను ఎట్టిప‌రిస్ధితుల్లో ఉపేక్షించేది లేద‌ని హెచ్చ‌రించారు. 
 ఈ పథకం ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ దేశాన్ని అత్యంత సురక్షితంగా, పటిష్టంగా ఉంచేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మోదీ ప్రదర్శిస్తున్న రాజకీయ ధైర్యం ప్రశంసనీయమని కొనియాడారు.  ”మనకు యువకులు, శారీరకదారుఢ్యం ఉన్నవారు, చురుకైన సైన్యం అవసరం. యువ జనాభా ఉన్న దేశం మనది. ఆ యువశక్తి ప్రభావం మన సాయుధ బలగాల్లోనూ ప్రతిబింబించాలి” అని ఆయన తెలిపారు. 
 
అగ్నిప‌థ్ నిర‌స‌న‌ల వెనుక కొంద‌రి స్వార్ధ ప్ర‌యోజనాలు దాగున్నాయ‌ని, స‌మాజంలో చిచ్చు పెట్టాల‌నే ఉద్దేశంతోనే కొంద‌రు అగ్నిప‌థ్‌ను వ్య‌తిరేకిస్తున్నార‌ని మండిప‌డ్డారు. హింసాకాండ‌ను ఎవ‌రూ స‌మ‌ర్ధించుకోలేర‌ని పేర్కొన్నారు. అగ్నిప‌థ్ నిర‌స‌న‌ల‌పై స్పందిస్తూ హింసాత్మ‌క నిర‌స‌న‌ల విష‌యంలో నిందితుల‌ను గుర్తించార‌ని, విచార‌ణ జ‌రుగుతుంద‌ని తెలిపారు. 
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా చెలరేగిన హింసాకాండంలో కొన్ని కోచింగ్ సెంటర్ల ప్రమేయం ఉందంటూ వస్తున్న ఆరోపణలపై ప్రశ్నించినప్పుడు, ఎఫ్ఐఆర్‌ఆర్‌లు నమోదయ్యాయని, నిందితులను గుర్తించడం జరిగిందని చెప్పారు. తగిన దర్యాప్తు అనంతరమే ఈ హింస వెనుక ఎవరున్నారనేది చెప్పగలుగుతామని అజిత్ డోవల్ సమాధానమిచ్చారు.
 
75 శాతం మందికి హర్యానా ఉద్యోగాల హామీ 
కాగా, నాలుగేళ్ల‌పాటు అగ్నివీర్ లుగా ప‌ని చేసి తిరిగి వ‌చ్చిన వారిలో 75శాతం మందికి తమ రాష్ట్ర ప్ర‌భుత్వం గ్యారెంటీగా ఉద్యోగాలు ఇస్తుంద‌ని హ‌ర్యానా ముఖ్యమంత్రి  మ‌నోహ‌ర్ లాల్ క‌ట్ట‌ర్ హామీ ఇచ్చారు. అగ్ని వీర్ లు గ్రూప్ సి ఉద్యోగాల కోసం ఏదైనా కేడర్‌లో చేరవచ్చని, లేకుంటే తమ వద్ద పోలీసు ఉద్యోగాలున్నాయని, వాళ్లకు అవి ఇస్తాం అని తెలిపారు.
‘‘హర్యానా ప్రభుత్వంలో అగ్నివీరులకు గ్యారంటీగా ఉద్యోగాలు ఇస్తాం…ఉద్యోగాలు కావాల్సిన అగ్నివీరులు గ్రూప్ సీ ఉద్యోగాల  కేడర్‌లో చేరవచ్చు. లేకపోతే వారికి పోలీసు ఉద్యోగాలు ఇస్తాం’’ అని ఖట్టర్ పేర్కొన్నారు.