ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా!

ప్రతిపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి యశ్వంత్‌ సిన్హాను ఎంపిక చేశారు. ఈ మేరకు జైరాం రమేష్‌ అధికారికంగా ప్రకటించారు. పార్లమెంట్‌ ఎన్‌ఎక్స్‌ భవన్‌లో సమావేశమైన 18 విపక్ష పార్టీలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం ప్రతిపక్షాల సమావేశానికి ముందే కాంగ్రెస్‌, వామపక్షాల డిమాండ్‌ మేరకు తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి యశ్వంత్‌ సిన్హా రాజీనామా చేసినట్లు ఆ వర్గాలు తెలిపాయి.  ఈనెల 27వ తేదీన యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌ వేసే అవకాశం ఉంది.

మాజీ ప్రధాని వాజ్‌పేయికి సన్నిహితుడైన సిన్హాకు వివిధ పార్టీల నేతలతో సత్సంబంధాలున్నాయి. 1990లో చంద్రశేఖర్ మంత్రివర్గంలో ఆర్ధిక మంత్రిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన మాజీ ఐఏఎస్ అధికారి, ఆ తర్వాత బీజేపీలో చేరారు. వాజపేయి మంత్రివర్గంలో ఆర్ధిక, విదేశాంగ శాఖల మంత్రిగా పనిచేశారు.

 2018లో బిజెపిని వీడిన ఆయన గతేడాది తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆయన టిఎంసి ఉపాధ్యక్షునిగా ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఉండేందుకు యశ్వంత్‌ సిన్హా కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ మేరకు సిన్హా ట్వీట్‌ చేశారు.

టిఎంసికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ఉదయం  ఓ ట్వీట్ లో ప్రకటించారు. దేశ ప్రయోజనాల కోసం, ప్రతిపక్షాల ఐక్యత కోసం పార్టీకి దూరంగా పని చేయాల్సిన సమయం వచ్చిందని, పార్టీలో తనకు ఇచ్చిన గౌరవం, హోదాకు మమతాకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ట్వీటర్‌లో పేర్కొన్నారు.

ఇప్పటికే ప్రతిపక్షాలు ప్రతిపాదించిన ముగ్గురు అభ్యర్థులు రాష్ట్రపతి పోటీకి విముఖత చూపారు.  ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్‌పవార్‌, జమ్ముకాశ్మీర్‌ మాజీ సిఎం ఫరూక్‌ అబ్దుల్లా, పశ్చిమబెంగాల్‌ మాజీ గవర్నర్‌, గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీలు ఈ పోటీకి ఆసక్తి చూపలేదు.