డా౹౹ హెడ్గేవార్ వ్యక్తిత్వ వైశిష్ట్యం

డా. వడ్డీ విజయ సారధి
 ప్రముఖ రచయిత, జాగృతి మాజీ సంపాదకులు 
 
* డాక్టర్జీ 82వ వర్ధంతి నివాళి

 
1940లో డాక్టర్జీ మరణించేనాటికి ఆయన ద్వారా స్థాపింపబడిన సంఘటన – రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ నేడు దేశ మంతటా వ్యాపించింది. భారత దేశంలోని దాదాపుగా అన్ని ప్రాంతాలలోనూ, పెద్ద నగరాలలోనూ సంఘ శాఖలు వ్యాపించినవి. 
 
మధ్య ప్రాంతాల నాయకులకే గాక, దానికి అవతల ఉండే నాయకులకు కూడా సంఘ్ యొక్క అనుశాసనబద్ధులైన, సుశిక్షితులైన స్వయంసేవకులు ఆకర్షణ కేంద్రమైనారు. స్వయంగా మహాత్మ గాంధీ, విఠల్ భాయి పటేల్, ఎం.ఆర్.జయకర్, వీర్ సావర్కర్, సుభాస్ చంద్ర బోస్ వంటి శిఖరసమానులైన నాయకుల మనస్సులపై సంఘ్ ముద్ర గాఢంగా హత్తుకొంది. 
అయితే ఈ సంఘటనకు సంచాలకుడు, సంస్థాపకుడూ అయిన వ్యక్తి యొక్క స్వీయ ప్రవర్తన, సంపూర్ణ జీవనమూ ఒక విశిష్టమైన ఉదాహరణ. ప్రకృతి పరమేశ్వరుడూ ఈ ఇరువురి విశిష్ట యోజన వల్ల కొన్ని శతాబ్దాలకు ఎప్పడో ఒకసారి అరుదుగా మాత్రమే ఇటువంటి వ్యక్తులు జన్మిస్తారని ఆయనను గమనించి వారికి అనిపించక మానదు.
 
1937లో వీర్ సావర్కర్ విదర్భ ప్రాంతాన్ని పర్యటించారు. డా.హెడ్గేవార్ వారివెంట ఉన్నారు. తన పర్యటన చివరి మజిలీలో జరిగిన బహిరంగ సభలో సావర్కర్ సంఘాన్ని బహిరంగంగా ప్రశంసించటమే గాక, సభ నుండి నివాసానికి చేరుకొన్న తర్వాత “నేనుకూడా సంఘ స్వయంసేవక్ గా చేరేదా?” అని డా.హెడ్గేవార్ ని అడిగారు.
 
 “మీరు సభలో సంఘాన్ని ఏమేరకు మెచ్చుకున్నారో అది చాలు. ఈ స్నేహాన్ని ఇలాగే ఉండనీయండి” అని డా.హెడ్గేవార్ జవాబిచ్చారు. 1938లో సావర్కర్ గారి నాగపూర్ పర్యటన విజయవంతమైంది. దాని గురించి వార్తాపత్రికలు ఇలా ప్రకటించాయి. He came, he saw and he conquered.( ఆయన వచ్చాడు, కలయజూశాడు, అందరినీ వశపరచుకున్నాడు). 
 
కాగా శిబిరంలో స్వయంసేవకుల నుద్దేశించి మాట్లాడే సమయంలో వీర్ సావర్కర్ సంఘాన్ని విమర్శించడానికి వెనుకాడలేదు. “లాఠీ వాఠీ త్రిప్పుతూ,పెరేడ్ చేస్తూ కూర్చుంటే ఏమవుతుంది? సమాజంలోకి వెళ్లి మేల్కొలుపు తీసుకొని రావాలి” అని సూచించారు. 
 
అది వింటున్న స్వయంసేవకులకు మంచిగా అనిపించలేదు. కోపావేశాలు రగులుతున్నాయి. కాని డాక్టర్జీ ఏవిధమైన ప్రతిక్రియనూ వ్యక్తం చేయలేదు. వార్తాపత్రికలకు కూడా సావర్కర్ చెప్పిన భావాత్మకమైన అంశాలు మాత్రమే పంపబడినవి.
 
శిబిరంలో స్వయం సేవకులలో స్వాతంత్ర్య వీర్ సావర్కర్ ఉపన్యాసం వల్ల ఉత్పన్నమైన ప్రతిక్రియను వదిలించుకొని వారి దృష్టిని మళ్ళీ మూలకార్యం వైపు కేంద్రీకరింపజేయడానికి డా.హెడ్గేవార్ ‘పదమూడవ వార్షిక సింహావలోకనం’ అని పేరుపొందిన ఉపన్యాసాలను ఇచ్చారు.
 
వాటిలో సంఘ స్థాపన నాటినుండి ఇప్పటివరకు జరిగిన కార్యప్రగతి గురించిన వివరాలను తెలియజేశారు. స్వాతంత్ర్య వీర్ సావర్కర్ సంఘం గురించి చేసిన విపరీత వ్యాఖ్యలేవైతే ఉన్నవో వాటి విషయంలో ఆయన మౌనంగానే ఉన్నారు. ఈ విషయమంతా సావర్కర్ కి తెలియకుండా ఉండిపోయిన దనుకోలేము.
 
ఆ తర్వాత సంవత్సరం పూనా సంఘ శిక్షావర్గలో డా.హెడ్గేవార్ మాట్లాడవలసి ఉండగా, సావర్కర్ ముంబై నుంచి పూనా వచ్చారు. వర్గ జరుగుతున్న చోటకు నేరుగా వచ్చారు. ఈ విషయం తెలిసి డాక్టర్జీ ఎంతో సంతోషించారు. 
 
స్వయంసేవకులతో ఇలా అన్నారు – “నేడు మనందరి అదృష్టం- తాత్యారావ్ సావర్కర్ మనమధ్యలో ఉండడానికి వచ్చారు. వారు మనకు మార్గదర్శనం చేయాలని ప్రార్థిస్తున్నాను.” సావర్కర్ గారు తమ ఉపన్యాసంలో చెప్పిన విషయాలను డాక్టర్జీ తన సౌమ్య స్వభావం ద్వారా ఇతరుల హృదయాలను ఎలా జయిస్తుండేవారో, దానికి తార్కాణంగా పేర్కొనవచ్చు.
 
 “మా వంటివారు చేసే పని కుంభవృష్టి లాంటిది. కొద్దిసేపు మాత్రమే ధారాపాతంగా వర్షం కురుస్తుంది. పరిసరాలన్నీ జలమయం అవుతాయి. ఆ నీరు కూడా వేగంగా ప్రవహించుకొంటూ వెళ్ళిపోతుంది. కాని డాక్టర్జీ పని తెలివైన రైతు చేసే పని. ఆ నీటిని వెళ్ళిపోనీయ కుండా కట్ట వేసి ఆపి అవసరమైన పనికి మళ్లించుతారు. మీరందరూ డా.హెడ్గేవార్ గారి మార్గాన్నే అనుసరించాలి” అని సావర్కర్ సూచించారు. 
 
 డాక్టర్జీ వ్యక్తిత్వ వైశిష్ట్యాన్ని గుర్తించడానికి ఈ ఉదంతం ఉపయోగపడగలదని నేను ఆశిస్తున్నాను.