పురాతన వ్యవసాయ పద్దతులను అశాస్త్రీయంగా తిరస్కరించడం తగదు

వ్యవసాయంలో సేంద్రియ, భారతీయ ప్రాచీన సంప్రదాయ విధానం ఎంతో అవసరమని, వాటిని పరిశీలించకుండా ఈ స్థానిక పరిజ్ఞానాన్ని తిరస్కరించడం పొరపాటు అవుతుందనిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ హితవు చెప్పారు.

న్యూఢిల్లీకి చెందిన నేషనల్ అకాడమీ ఆఫ్ వెటరినరీ సైన్సు, మహారాష్ట్ర యానిమల్, ఫిషరీ సైన్సెస్ యూనివర్శిటీ సంయుక్తంగా నాగపూర్‌లో నిర్వహించిన వార్షిక స్నాతకోత్సవం శాస్త్రీయ సదస్సులో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. గౌరవ అతిథిగా విచ్చేసిన కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా, డా. భగవత్‌తో పాటు రాష్ట్ర మంత్రి సునీల్ కేదార్‌లకు గౌరవ ఫెలోషిప్‌ను అందజేశారు.

 భారత వ్యవసాయం, పశుసంరక్షణ విధానాలు చాలా ప్రాచీనమైనవని, ఆధునిక సైన్సులో దుష్ప్రభావాలు ఎదురవుతుంటాయి కానీ మన ప్రాచీన పరిజ్ఞానం, విధానాల్లో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని డా. భగవత్ స్పష్టం చేశారు. స్థానిక పరిజ్ఞానం ఉపయోగించి పరిశోధనలో సానుకూలతమై దృష్టి కేంద్రీకరించాలని ఆయన సూచించారు.
యాంత్రిక వ్యవసాయ విధానం ఎక్కువ కాలం సాగదని హెచ్చరిస్తూ  ఇప్పటికి కూడా దేశంలో 65 శాతం రైతులు చిన్న కమతాలలో వ్యవసాయం చేస్తున్నారని, వీరికి యాంత్రిక వ్యవసాయ విధానం ప్రయోజనకరం కాదని ఆయన వివరించారు.
“పరిశోధన, స్థానిక జ్ఞానాన్ని ఉపయోగించడంలో సరళతపై దృష్టి పెట్టాలి. స్థానిక పరిజ్ఞానాన్ని అశాస్త్రీయంగా పేర్కొనడం తప్పు, మీరు దానిని పరిశీలించిన తర్వాత అది సరైనది కాకపోతే తిరస్కరించవచ్చు” అని ఆయన సూచించారు.

“రెండవది, యాంత్రిక వ్యవసాయం ఎక్కువ కాలం కొనసాగదు. నేటికీ 65 శాతం మంది రైతులు చిన్న భూమిలో సాగు చేస్తున్నారు.  యాంత్రిక వ్యవసాయం వారికి పెద్దగా లాభదాయకం కాదు. ఎరువులు తదితరాల కారణంగా అతను (రైతు) అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటున్నాడు. అతను అర్థం చేసుకోగలిగే సుస్థిర వ్యవసాయాన్ని నేర్పించాలి” అని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత వివరించారు.

1700 సంవత్సరం వరకు మన దేశం ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్థిక వ్యవస్థగా ఉందని పేర్కొంటూ “భారత్ కేంద్రీకృత” వ్యవసాయ పద్ధతి ద్వారా మాత్రమే మన జీడీపీని పెంచగలమని ఆయన స్పష్టం చేశారు.
“మనం వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నాము. సమయం, పరిశ్రమ, వాణిజ్యం కూడా వ్యవసాయానికి సంబంధించినవి. దీనిని సాధించడానికి (పెరుగుతున్న జిడిపి) భారత్ కేంద్రీకృత విధానాన్ని కలిగి ఉండాలి” అని డా. భగవత్ చెప్పారు.

ప్రభుత్వం అన్ని శాఖలకు నిధులు సమకూర్చేంత గొప్పగా లేనందున సుస్థిరత కోసం ప్రజా భాగస్వామ్యం అవసరమని ఆయన తెలిపారు.
రైతులు ఎదుర్కొంటున్న భాషాపర గురించి అవరోధాల గురించి ప్రస్తావిస్తూ పశుపోషణపై చాలా సమాచారం ఆంగ్లంలో ఉందని పేర్కొన్నారు. “కొత్త విద్యా విధానంలో సాంకేతిక అంశాలలో స్థానిక భాష వినియోగాన్ని చేర్చారు. ఈ పరిజ్ఞానాన్ని మనం స్థానిక భాషలలో వ్యాప్తి చేయాలి” అని భగవత్ సూచించారు.

సహకార రంగం ద్వారా, నేలను కాపాడుకొనే పద్ధతులలో స్వయంగా  ఆధారపడటం గురించి కేంద్ర మంత్రి రూపాలా  ప్రస్తావిస్తూ దేశవాళీ ఆవుల పేడతో మట్టిని సరిచేసే మన పాత పద్ధతికి మనం తిరిగి రావాలని సూచించారు. ఆవుకు, పశుసంవర్ధక శాఖలకు రాబోయే రోజులలో తిరిగి మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ పశుసంవర్ధక శాఖ ఇవి మన ఆర్థిక వృద్ధిలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తాయని భరోసా వ్యక్తం చేశారు.