గత నెలలో పశ్చిమ బెంగాల్లో అధికారం చేపట్టిన సువేందు అధికారి ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం సరిగ్గా మూడు వారాల తర్వాత తాజాగా మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. 35 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సోమవారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కోల్‌కతాలోని లోక్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆర్ఎన్ రవి మంత్రులతో ప్రమాణం చేయించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(1ఏ) ప్రకారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో 44 మంది మంత్రులకు అవకాశం ఉంది. తాజాగా 35 మందికి చోటు దక్కడంతో, సీఎంతో కలిసి మొత్తం 41 మంది మంత్రివర్గంలో ఉన్నారు. దీంతో ఇంకో ముగ్గురికి చోటుంది. గత నెల 9న సువేందు అధికారి సీఎంగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఆయనతోపాటు దిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పాల్, నిశిత్ ప్రణామిక్, అశోక్ కీర్తనియా, క్షుదిరామ్ టూడు మంత్రులుగా ప్రమాణం చేశారు.
స్వపన్ దాస్‌గుప్తా, తపస్ రాయ్, శంకర్ ఘోష్, దూద్ కుమార్ మండల్, దీపక్ బర్మన్, మనోజ్ ఓరాన్, గౌరీ శంకర్ ఘోష్, అర్జున్ సింగ్, శరద్వత్ ముఖర్జీ, జగన్నాథ్ ఛటోపాధ్యాయ వంటి సీనియర్ నేతలు ఇప్పుడు క్యాబినెట్ హోదా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
అలాగే రాజేష్ మహాతా, ఇంద్రనీల్ ఖాన్, మాలతీ రవా రాయ్, శాంతను ప్రామాణిక్, పూర్ణిమ చక్రవర్తి, ఉమేష్ రాయ్, జోయెల్ ముర్ము, అశోక్ దిండా, ఆనందమోయ్ బర్మన్, కౌశిక్ చౌదరి, గార్గి దాస్ ఘోష్, భాస్కర్ భట్టాచార్య, దిబాకర్ ఘరామి, సుమనా సర్కార్లు సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పూర్తిస్థాయి మంత్రివర్గ ఏర్పాటుతో బెంగాల్లో సరికొత్త పాలనను వేగవంతం చేయాలని బీజేపీ భావిస్తోంది.

More Stories
సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త జడ్జీల నియామకం
పహల్గమ్ దాడిలోని ఫోన్ కు పాక్ బ్యాంకుతో సంబంధం!
మమతా బెనర్జీ సమావేశానికి 60 మంది ఎమ్మెల్యేల డుమ్మా