బలహీనంగా ఉన్న 144 నియోజకవర్గాలపై బిజెపి దృష్టి 

2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దేశంలో పార్టీ బలహీనంగా ఉన్న 144 నియోజకవర్గాలపై బిజెపి దృష్టి సారిస్తున్నది. అదే విధంగా గత రెండు లోక్‌సభ, 2022 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పనితీరు బలహీనంగా ఉన్న పోలింగ్ బూత్‌లపై దృష్టి సారిస్తుంది. వచ్చే రెండేళ్లపాటు ఈ నియోజకవర్గాలు, బూత్ లలో విస్తృతంగా ప్రత్యేక కృషి చేస్తారు.

గత ఎన్నికలలో రెండో స్థానంలో ఉన్న 144 నియోజకవర్గాలపై పార్టీ సీనియర్  నాయకులు, కేంద్ర మంత్రులు దృష్టి సారించి, స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై అక్కడ పార్టీని బలోపేతం చేయడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేయనున్నారు.

2019లో బీజేపీ 303 సీట్లు గెలుచుకుంది. 2014 సార్వత్రిక ఎన్నికలలో గెలుపొందిన దానికంటే 21 సీట్లు ఎక్కువ. ప్రజలు అత్యధికంగా మోదీకి అనుకూలంగా ఓటు వేయడంతో 543 మంది సభ్యుల లోక్‌సభలో తన పార్టీకి స్పష్టమైన మెజారిటీని సాధించడంలో సహాయపడింది.  గత 30 ఏళ్లలో మరే  ఇతర రాజకీయ పార్టీ కూడా సొంతంగా లోక్ సభలో మెజారిటీ స్థానాలు గెలుపొంద లేదు.

ఈ నియోజకవర్గాలకు సంబంధించి సామజిక, ఆర్ధిక, రాజకీయ సమాచారాన్ని సేకరించుకుని, మూడు స్థాయిలలో పార్టీని బలోపేతం చేసే కృషి చేయనున్నారు. సంస్థాగత ఇన్ ఛార్జ్ ప్రతి పక్షం రోజులకు ఒకసారి ఓ రాత్రి ఈ నియోజకవర్గంలో గడుపుతారు. ప్రతి లోక్ సభ నియోజకవర్గానికి ఓ ప్రత్యేక మీడియా ఇన్ ఛార్జ్ ఉంటారు.

వివిధ కేంద్ర ప్రభుత్వం పధకాల లబ్ధిదారులతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేస్తుంటారు. లబ్ధిదారులతో కలసి కేంద్ర మంత్రులు సెల్ఫీలు దిగుతారు. బిజెపి అనుబంధ విభాగాలు వివిధ వర్గాల ప్రజలతో మిళితం కావడం కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి.

అదే విధంగా పార్టీ బలహీనంగా ఉన్న పోలింగ్ బూత్ లను కూడా  దేశంలో పార్టీ గుర్తించిందని, ఒక్కో లోక్‌సభ ఎంపీ, రాజ్యసభ సభ్యుడికి 100 బూత్‌లను కేటాయించామని బీజేపీ నేతలు తెలిపారు.

‘‘గత ఎన్నికల్లో పార్టీకి తక్కువ ఓట్లు వచ్చిన బూత్‌లపై ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఎంపీలు ఈ బూత్‌లను సందర్శించి, క్యాడర్‌తో సమావేశమై ఓటర్లలో ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రచారం చేస్తారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ఇంకా దాదాపు ఏడాదిన్నర సమయం ఉన్నందున, ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ ఉనికిని బలోపేతం చేసేందుకు ఈ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు’’ అని బీజేపీ ఉత్తర ప్రదేశ్ అధికార ప్రతినిధి అవనీష్ త్యాగి పేర్కొన్నారు.

ఎమ్మెల్యేలకు కూడా తమ తమ నియోజకవర్గాల్లో కనీసం 25 బూత్‌లను కేటాయించారు. అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఓడిపోయిన స్థానాల్లో, ఓడిపోయిన పార్టీ అభ్యర్థికి బలహీనమైన బూత్‌లలో పని చేసే పనిని అప్పగించారు.  ప్రత్యర్థి నామినీలచే ఓడిపోయిన అభ్యర్థులు పార్టీ బలహీనమైన పనితీరుకు కారణాలను, కుల సమీకరణాలు, స్థానిక సమస్యలు, పార్టీ యూనిట్‌లోని అంతర్గత సమస్యలు వంటి ఇతర కారణాలను పరిశీలించడం ద్వారా  పనితీరును ప్రభావితం చేసే కారణాలను తెలుసుకోవాలని కోరారు.

సవాళ్లను పరిష్కరించడానికి అభ్యర్థులు కూడా చర్యలు తీసుకుంటారని పార్టీ నాయకులు ఒకరు తెలిపారు. “పార్టీకి అనుకూలంగా ఓటర్లను పొందే ప్రయత్నంలో వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు బూత్‌ల వద్ద గరిష్ట లబ్ధిదారులకు చేరేలా వారు కృషి చేస్తారు” అని ఆయన చెప్పారు.

2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా యుపిలో పోలింగ్ నిర్వహించిన 1.63 లక్షల బూత్‌లలో అత్యధికంగా 1.24 లక్షల బూత్‌లలో బీజేపీకి ఓట్లు పోలయ్యాయని పార్టీ నేత ఒకరు తెలిపారు. ప్రతిపక్ష పార్టీల కంటే బీజేపీ పనితీరు బలహీనంగా ఉన్న దాదాపు 39,000 బూత్‌లు ఉన్నాయి. ఆ పార్టీ పోలైన ఓట్ల సంఖ్యను బట్టి ఈ బూత్‌లను వివిధ కేటగిరీలుగా విభజించింది.

ఉదాహరణకు, ఒక వర్గం బూత్‌లలో తక్కువ తేడాతో  బిజెపి  ఓడిపోయి గెలుస్తుందని ఆశిస్తున్నారు. ముస్లిం, జాతవ్-దళిత్ జనాభా అధికంగా ఉన్న బూత్‌లలో మరొక వర్గం ఉంది.  అంతేకాకుండా 2019లో ఎస్పీతో పొత్తు పెట్టుకుని బీఎస్పీ గెలిచిన 10 స్థానాలపై కూడా  బీజేపీ దృష్టి పెట్టాలని యోచిస్తోంది.

“ఇప్పుడు పొత్తు లేదు. 2022 రాష్ట్ర ఎన్నికలలో, బీఎస్పీకేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకుంది. 2019లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ గెలిచిన ఏకైక సీటు రాయ్‌బరేలీలో కూడా బిజెపి ఇదే విధమైన వ్యూహాన్ని అనుసరించింది.  కాబట్టి బీఎస్పీ సంప్రదాయ ఓటర్లను చేరుకోవడానికి ఇదే సరైన సమయం’’ అని బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.

కేంద్ర మంత్రి స్మ్రితి ఇరానీ 2014లో రాహుల్ గాంధీ చేతిలో ఓటమి చెందిన తర్వాత ఆ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి, అక్కడ తరచూ పర్యటనలు జరుపుతూ 2019 నాటికి విజయం సాధించ గలిగారు. ఇప్పుడు అదే విధంగా మొత్తం 144 `బలహీన’ నియోజకవర్గాలలో వ్యూహం అమలు పరచాలని నిర్ణయించారు.