సైన్యాన్ని యువకులతో నింపాలన్నదే అగ్నిపథ్ లక్ష్యం

సైన్యాన్ని యువకులతో నింపాలన్నదే అగ్నిపథ్ లక్ష్యం అని సైనిక వ్యవహారాల విభాగం (డిఎంఎ) అదనపు కార్యదర్శి లెఫ్టనెంట్ జనరల్  అనిల్‌పురి స్పష్టం చేశారు. అగ్నిపథ్‌పై  త్రివిధ దళాధిపతులు రెండేళ్లుగా సమగ్ర అధ్యయనం చేశారని చెప్పారు. 1989 నుంచి అగ్నిపథ్‌ పెండింగ్‌లో ఉంది. సగటు వయస్సును తగ్గించేందుకు సంస్కరణలు తీసుకువచ్చామని తెలిపారు.
ప్రస్తుతం సైన్యంలో ఎక్కువగా 30 ఏళ్లకు పైబడిన వారే  ఉన్నారని, కమాండర్ స్థాయికి వచ్చేసరికి ఇదివరకన్నా వయస్సు ఎక్కువగా ఉంటున్నదని ఆయన గుర్తు చేశారు.
ఆర్మీలోకి వచ్చి వెళ్లేందుకు చాలా అవకాశాలు కల్పించామని చెబుతూ తమ కంటే ఇప్పడున్న యువత చాలా శక్తివంతమైనదని, సెల్‌ఫోన్లు, డ్రోన్లతో యువత అద్భుతాలు చేస్తున్నారని అనిల్ పురి పేర్కొన్నారు. రానున్న కాలంలో టెక్నాలజీదే ప్రముఖ పాత్ర వహిస్తుందని, నేటి యువతకు టెక్నాలజీపై మంచి పట్టుందని ఆయన వివరించారు.
భవిష్యత్​లో అంతా డ్రోన్లు, టెక్నాలజీతోనే యుద్ధాలు జరుగుతాయని.. అందులో భాగంగానే తక్కువ వయస్సు వారిని ఆర్మీలోకి తీసుకుని దానికి తగ్గట్టు ట్రైనింగ్​ ఇస్తామని ఆయన తెలిపారు. యంగ్ బ్లడ్, అనుభవజ్ఞులైనవారి మిశ్రమంగా ఉండాలని ఈ  రిక్రూట్‌మెంట్ వయస్సును తగ్గించినట్టు ఆయన తెలిపారు.
“మేము అనేక అంశాలను పరిగణించాలి. అనేక ఇతర మార్పులను మొదట అమలు చేయాలి. వయస్సు అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. సాయుధ దళాలలో చేరే వయస్సును ముందుగా తగ్గించాలి. కమాండింగ్ ఆఫీసర్ల వయసు కూడా తగ్గాలి’ అని అనిల్ పూరి వివరించారు.
సాయుధ దళాలకు యువ చైతన్యవంతులు, అనుభవజ్ఞులైన వ్యక్తుల కలయిక అవసరమని చెప్పారు. ఇక.. 2030 నాటికి దేశ జనాభాలో సగం మంది 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉంటారని చెబుతూ అనుభవజ్ఞులైన సైనికులతో పాటు ఉత్సాహం, శక్తితో నిండిన యువకుల కలయికను తాము సృష్టించాలనుకుంటున్నాం అని అనిల్​ పూరి స్పష్టం చేశారు.
భవిష్యత్తులో జరిగే యుద్ధాలు సాంకేతికతపై ఆధారపడి ఉంటాయని చెబుతూ సాయుధ వాహనాలు, ట్యాంకులను ధ్వంసం చేయడానికి డ్రోన్లను ఉపయోగిస్తారని తెలిపారు. ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో నిష్ణాతులైన టెక్ యువకులు కావాలని పేర్కొన్నారు.  దేశంలోని ప్రతి యువకుడు స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించడంలో నిపుణుడని పేర్కొంటూ, 70 శాతం రిక్రూట్‌మెంట్‌లు గ్రామాలు, గ్రామీణ ప్రాంతాల నుండి ఉంటాయని సీనియర్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారి వివరించారు.
ప్రస్తుతం 46 వేల మందితో ఎంపిక ప్రారంభించడం గురించి ప్రస్తావిస్తూ “మేము ముందు దీన్ని చిన్నగా ప్రారంభించాలి అనుకుంటున్నాం.. ఇది ఎలా సాగుతుంది, ఇంకా ఏమి అవసరమో అంచనా వేయడానికి దాన్ని అధ్యయనం చేయాలనుకుంటున్నాం. రాబోయే 4-5 సంవత్సరాల్లో ఈ రిక్రూట్​మెంట్​ కాస్త 50వేల నుంచి 60 వేల మంది దాకా చేరుతుంది. దీని తర్వాత 1.25 లక్షలకు పెరుగుతుంది” అని అనిల్ పూరి తెలిపారు.
ఈసారి ఎక్కువ మందిని నియమించాలని భావించామని చెబుతూ  అగ్నివీర్‌లు సైన‍్యంలో కొనసాగే వీలుందని తెలిపారు. ‘అగ్నివీర్స్’ దేశ సేవలో తన జీవితాన్ని త్యాగం చేస్తే కోటి రూపాయల పరిహారం అందుతుందని చెప్పారు.  ప్రస్తుతం 46వేల మంది అగ్నివీర్‌ల నియామకం చేపడుతున్నామని, భవిష్యత్తులో ఈ సంఖ్య 1.25 లక్షలకు చేరుతుందని ఆయన వెల్లడించారు.
అగ్నివీర్‌లకు వివిధ మంత్రిత్వ శాఖలు ప్రత్యేక రిజర్వేషన్లను కల్పించాయని పేర్కొంటూ ఆందోళనలకు ముందే ఈ నిర‍్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ నెల 24 నుంచి తొలి బ్యాచ్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయని చెప్పారు. జూలై 24 వరకూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, ఫేజ్‌-1 ఆన్‌లైన్‌ టెస్టు ఉంటుందని, డిసెంబర్‌ 30 నాటికి తొలిబ్యాచ్‌ ట్రైనింగ్‌కు వెళ్తారని స్పష్టం చేశారు.