అగ్నిపథ్‌ పథకంపై యువతను తప్పుదోవ పట్టించే కుట్రలు

అగ్నిపథ్‌ పథకంపై కుట్రలు చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. యువతను తప్పుదోవ పట్టించేందుకు కొందరు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.  న్యూఢిల్లీలోని తన నివాసంలో ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావుతో కలిసి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పథకం ప్రకారమే కుట్ర చేసి విధ్వంసం సృష్టించారని అనుమానం వ్యక్తం చేశారు.

విధ్వంసం సృష్టించాలనే అలజడులు సృష్టించారని మండిపడ్డారు. దేశభక్తి, జాతీయ భావం పెంచే క్రమంలోనే అగ్నిపథ్‌ తెచ్చామని ఆయన స్పష్టం చేశారు. అనేక దేశాల్లో అగ్నిపథ్‌ లాంటి పథకాలు ఉన్నాయని కేంద్ర మంత్రి గుర్తుచేశారు. నాలుగేళ్ల తర్వాత విధిగా దేశ సేవ చేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు.

దేశ సేవ చేయాలనుకున్నవారే అగ్నిపథ్‌లో చేరవచ్చని పేర్కొన్నారు. ఇది కంపల్సరీ స్కీమ్‌ కాదని, అగ్నిపథ్‌ అనేది వాలంటరీ స్కీమ్ అని కిషన్‌రెడ్డి తెలిపారు.  అగ్నిపథ్ కింద సైన్యంలో పని చేసిన వారు కేంద్ర, రాష్ట్ర ఉద్యోగాల్లో చేరవచ్చని, అగ్నిపథ్ వీరులకు నాలుగేళ్ళ పాటు వృత్తి నైపుణ్యం అందిస్తారని వెల్లడించారు.

అనేకమందికి ఉద్యోగవకాశాలు కల్పించేలా పథకాన్ని భారత ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. కొందరు దురుద్దేశంతో అగ్నిపథ్ పథకంపై అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. మోదీ ప్రధాని కాకముందు నుంచే అగ్నిపథ్‌పై దేశంలో చర్చ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. అనేక దేశాల విధానాన్ని పరిశీలించాకే అగ్నిపథ్‌ తీసుకొచ్చామని కిషన్‌రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ దుర్ఘటన దురదృష్టకరం అని పేర్కొన్నారు.

ఉదయం నుంచి విధ్వంసం సృష్టిస్తుంటే.. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. రైల్వేస్టేషన్‌ ఘటన ఉద్దేశపూర్వంగా జరిగిందే. ఘటనలో వ్యక్తి మృతి చెందడం బాధాకరం అని తెలిపారు. శాంతిభద్రతలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అని స్పష్టం చేశారు.

ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.  హింస జరుగుతుంటే రెచ్చగొట్టేలా ఓ మంత్రి వ్యాఖ్యలు చేశారని  ఆగ్రహం వ్యక్తం చేశారు.  అగ్నిపథ్ స్కీమ్‌పై అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని హితవు చెప్పారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వచ్చినవారంతా ఏమైనా సైన్యంలో చేరేవారా? వన్‌ ర్యాంక్.. వన్‌ పెన్షన్ అమలు చేస్తున్నాం’’ అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.

 నిఘా వ్యవస్థ నిద్రపోతోందా?

కాగా, తెలంగాణలో నిఘా వ్యవస్థ నిద్రపోతోందా? అని ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు.  టీఆర్ఎస్‌, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి పోటీ చేయడానికి రంగం సిద్ధమైన్నట్లు ఆయన ఆరోపించారు. ప్రభుత్వ కుట్రలో భాగంగానే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పై దాడి చేశారని స్పష్టం చేశారు.

అభ్యర్థుల ముసుగులో ఎంఐఎం, టీఆర్ఎస్‌, కాంగ్రెస్ గూండాలు విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. ఘటనపై సీఎం కేసీఆర్, హోమ్‌ మంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అగ్నిపథ్‌పై చర్చకు సిద్ధం.. ట్విటర్ పక్షి వస్తారా? అని రఘునందన్‌రావు ప్రశ్నించారు.