సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రూ. 7 కోట్లకు పైగా ఆస్తి నష్టం

 
ఆర్మీ ఉద్యోగార్థులు చేపట్టిన ఆందోళనలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రూ. 7 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందని సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ గుప్తా స్పష్టం చేశారు. ఐదు రైలింజన్లకు నిప్పు పెట్టడంతో పాటు 30 బోగీలను ఆందోళనకారులు ధ్వంసం చేశారని ఆయన పేర్కొన్నారు. స్టేషన్‌లోని పార్సిల్ ఆఫీసును పూర్తిగా ధ్వంసం చేశారని తెలిపారు.
ఆందోళనకారుల నిరసనల నేపథ్యంలో 18 ఎక్స్‌ప్రెస్, 9 ప్యాసింజర్ రైళ్లు, 65 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేశామని తెలిపారు. ఇవికాక 15 రైళ్లను పాక్షికంగా రద్దు చేయడం జరిగిందని తెలిపారు. 8 రైళ్లను డైవర్ట్ చేశామని,  ఒక రైలును రీషెడ్యూల్ చేశామని చెప్పారు.
 
రైలు కోచ్‌లకు అధికంగా డ్యామేజ్ జరిగిందని, ఆ తర్వాత ప్లాట్‌ఫాంలపై ఉండే స్టాల్స్‌, వాటర్ కూలర్స్‌ వంటి వస్తువులను చాలా వరకు ధ్వంసం చేశారని గుప్తా పేర్కొన్నారు. ముఖ్యంగా ప్లాట్ ఫాం నెంబర్ 2 నుంచి 7 వరకు ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు. దీని వల్ల ఎంత నష్టం జరిగింది అనే అంచనా కూడా దాదాపు పూర్తయింది. 
 
ప్రస్తుతానికి సిగ్నలింగ్, ట్రాక్‌లు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్లకు ఎలాంటి నష్టం జరగలేదు. రైలు ట్రాక్‌కు ఏమైనా జరిగిందేమో చెక్ చేస్తే రైలు సేవలు ప్రారంభించడానికి వీలవుతుంది. అన్నీ సరిగ్గా ఉంటే ఒక గంటలో రైలు సేవలు ప్రారంభిస్తామని గుప్తా పేర్కొన్నారు.
 
కనీసం నాలుగు రైలు బోగీలను తగలబెట్టేశారు. అలాగే 30 పైగా బోగీల అద్దాలు పగల గొట్టేశారు. కొన్ని సీట్లను ధ్వంసం చేశారు. 8 రైలు ఇంజిన్లలో కూడా డ్యామేజ్ జరిగింది. ఎస్కిలేటర్, లైట్లు, ఫ్యాన్లు కూడా చాలా వరకు ధ్వంసం అయ్యాయి. మొత్తం రూ. 6 నుంచి 7 కోట్ల నష్టం జరిగి ఉండొచ్చని అంచనా వేశారు. 
 
పార్శిల్స్‌లో కూడా రెండింటిని నాశనం చేశారు. వాటిలో ఉన్న వస్తువుల విలువ ఏంటో కచ్చితంగా చెప్పలేమని గుప్తా తెలిపారు. పార్శిల్స్‌లో ఉన్న చేపలు, గుడ్లు వంటి పదార్థాలు డ్యామేజ్ అయ్యాయి. అయితే ప్రయాణికులు, సిబ్బంది ఎవరికీ ఎలాంటి హానీ జరగ లేదు. 
 
“ఆర్పీఎఫ్, రాష్ట్ర పోలీసులతో పాటు మేమంతా ఇక్కడే ఉండి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించాం. ఇప్పటి వరకు ఇంత హింసాత్మక ఘటనలు ఇక్కడ జరగడం చూడలేదు. అందుకే దాదాపు వేల మంది రైల్వే స్టేషన్‌లోకి వచ్చి ఇలా చేయడంతో షాక్ కు గురయ్యాము” అని  డీఆర్ఎం గుప్తా వివరించారు. 
 
ఆందోళనకారులు ఒక ఇంజిన్‌కు నిప్పు పెట్టినట్లు గమనించామని చెబుతూ,  దాని పక్కనే ఒక పవర్ కార్ ఉందని,  దానిలో 2 వేల లీటర్ల డీజిల్ నింపి ఉందని తెలిపారు. దానికి ఆ మంటలు చేరుకుంటే చాలా ఘోరం జరిగి ఉండేదని పేర్కొన్నారు. 
 
ఆ సమయంలోనే అప్పుడే పరిస్థితిని కంట్రోల్ చేయక తప్పదని భావించి, అంతా కలిసి కాల్పులపై ఒక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ ఘటన తర్వాత హైదరాబాద్, వరంగల్, కాజీపేట వంటి స్టేషన్లలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని డీఆర్ఎం గుప్తా స్పష్టం చేశారు.
 
సికింద్రాబాద్ స్టేష‌న్‌లో శుక్రవారం ఉద‌యం 9:15 గంట‌ల‌కు అన్ని రైళ్లు ఆగిపోయాయి. దాదాపు 10 గంట‌ల త‌ర్వాత రైళ్లు పున‌రుద్ధించారు. మొదటగా, ఉద్రిక్త ప‌రిస్థితులు స‌ద్దుమ‌ణ‌గ‌డంతో సికింద్రాబాద్‌లోని ఒక‌టో నంబ‌ర్ ప్లాట్ ఫాం నుంచి లింగంప‌ల్లి – కాకినాడ గౌత‌మి ఎక్స్‌ప్రెస్ బ‌య‌లుదేరింది.ర‌ద్దు అయిన రైళ్ల‌కు సంబంధించిన ప్ర‌యాణికుల‌కు టికెట్ డ‌బ్బుల‌ను రిఫండ్ చేస్తామ‌ని తెలిపారు.