దేశ సంపదను ధ్వంసం చేయవద్దని రైల్వే మంత్రి విజ్ఞప్తి

అగ్నిపథ్‌ నిరసనల్లో భారత రైల్వే వ్యవస్థ దెబ్బ తింటున్న పరిస్థితుల పట్ల కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ఆందోళన వ్యక్తం చేశారు.  ‘‘యువతకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను. నిరసనలను హింసాత్మక మార్గంలో వెళ్లనివ్వకండి. రైల్వే ఆస్తుల్ని ధ్వంసం చేయకండి. రైల్వేస్‌ దేశానికి ఆస్తి’’ అని జాతీయ మీడియా ద్వారా ఆయన  విజ్ఞప్తిచేశారు.
కాగా, `అగ్నిపథ్‌’ పథకంతో దేశవ్యాప్తంగా పలుచోట్లు హింసాత్మక నిరసనలు చోటుచేసుకోవడాన్ని తాము ఊహించలేదని నావికాదళాధిపతి అడ్మిరల్ ఆర్ హరి కుమార్ తెలిపారు. అగ్నివీర్ రిక్రూట్ మెంట్ స్కీమ్  భారతదేశ మిలటరీలో ఏకైక అతిపెద్ద హ్యూహన్ రిసోర్సెస్ మేనేజిమెంట్ ట్రాన్స్‌ఫర్‌మేషన్ అని, సరైన సమాచార లోపం, అవగాహనా రాహిత్యం కారణంగానే నిరసనలు తలెత్తాయని ఆయన పేర్కొన్నారు.
”ఇలాంటి నిరసనలు వస్తాయని నేను ఊహించలేదు. అగ్నిపథ్ పథకాన్ని మేము ఏడాదిన్నర పాటు కష్టపడి రూపొందించాం” అని అడ్మిరల్ ఆర్ హరి కుమార్ తెలిపారు. ఇది ”భారత్ లో తయారైన,భారతీయుల కోసం తయారైన పథకం”  అని ఆయన  చెప్పారు.
ఈ స్కీమ్‌ను వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌పై ఆయన మాట్లాడుతూ, ప్రజలు నిరసనలు, హింసకు పాల్పడవద్దని తాను విజ్ఞప్తి చేస్తున్నానని, పథకాన్ని పూర్తిగా అర్ధం చేసుకుని ప్రశాంతంగా ఉండాలని కోరుతున్నానని పేర్కొన్నారు. దేశానికి సేవ చేయాలనుకునే యువతకు ఇదో గొప్ప అవకాశమని చెప్పారు.

ఇదిలా ఉంటే.. ఇప్పటిదాకా జరిగిన అగ్నిపథ్‌ నిరసనల్లో పలు రైళ్లకు నిరసనకారులు నిప్పుపెట్టారు. అలాగే పదుల సంఖ్యలో రైళ్లను ధ్వంసం చేశారు. కోట్ల విలువైన రైల్వే ఆస్తులను నాశనం చేయడంతో పాటు ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించారు.

నిరసనల ప్రభావం దేశవ్యాప్తంగా రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపింది.  200కు పైగా రైళ్ల రాకపోకల షెడ్యూల్‌లో మార్పులు చేశారు. హింసా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి 35 రైళ్లను రద్దు చేశారు. రైళ్లపై పెను ప్రభావం వివరాలను రైల్వే శాఖ అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 13 రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు. పలు రైళ్ల దారి మళ్లించారు.

హైదరాబాద్ ఇతర ప్రధాన నగరాలలో ఎంఎంటిఎస్, మెట్రోరైళ్లను  అధికారులు ముందు జాగ్రత్త చర్యగా శుక్రవారం ఉదయం తరువాత నిలిపివేశారు. దీనితో రోడ్డు మార్గాలు కిక్కిరిసిపోయాయి. దేశంలో ప్రత్యేకించి తూర్పు మధ్య రైల్వే నిర్వహణలోని మార్గాలలో రైళ్ల రాకపోకలు అతలాకుతలం అయ్యాయి.

బీహార్, జార్ఖండ్ , ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో హింసాత్మక ఘటనలు ఎక్కువగా జరగడంతో అక్కడ ఎక్కువగా రైళ్లు రద్దు లేదా దారి మళ్లింపు జరిగాయి.రిజర్వ్ చేసుకున్న రైళ్లు రద్దు కావడ ంతో ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవడం ప్రధాన సమస్యగా మారింది. బీహార్, జార్ఖండ్, యుపిల్లో ఎనిమిది రైళ్ల నిర్వహణపై ఉన్నతాధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షణ జరిపారు.

శుక్రవారం సికింద్రాబాద్ ఇతర ప్రాంతాలలో రైల్వే స్టేషన్లలో ఘర్షణలు, బోగీలకు నిప్పంటించడం వంటి ఘటనల తరువాత దక్షిణ మధ్య రైల్వేపై కూడా ప్రభావం పడింది. సుదూర ప్రయాణాల రైళ్ల విషయంలో పరిస్థితిని బట్టి కీలక నిర్ణయం తీసుకుంటారని, ప్రస్తుతానికి వీటిని నిలిపివేశామని అధికారులు తెలిపారు.

హౌరా న్యూఢిల్లీ పూర్వా ఎక్స్‌ప్రెస్, హౌరా లల్కూనా ఎక్స్‌ప్రెస్, రాంచీ పాట్నా పత్లిపుత్ర ఎక్స్‌ప్రెస్, ధానాపూ టాటా ఎక్స్‌ప్రెస్, జయ్‌నగర్ హౌరా ఎక్స్‌ప్రెస్, హౌరా ధన్‌బాద్ డైమండ్ ఎక్స్‌ప్రెస్, అసన్‌సోల్ కియుల్ ఎక్స్‌ప్రెస్ వంటివి ప్రస్తుతానికి నిలిచిపోయిన రైళ్లు.

రద్దు అయిన రైళ్లలో హైదరాబాద్ షాలిమార్ ఎక్స్‌ప్రెస్, అహ్మద్‌నగర్ సికింద్రాబాద్ , సికింద్రాబాద్ అహ్మద్‌నగర్ ఉన్నాయి. తూర్పు మధ్య రైల్వే మార్గంలో వెళ్లే నార్త్ ఫ్రాంటియర్ రైల్వే పరిధిలోని పలు రైళ్లపై కూడా ప్రభావం పడింది.