అగ్నిపథ్ జ్వాలలతో రణరంగంగా సికింద్రాబాద్ స్టేషన్

శుక్రవారం ఉదయం నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అగ్నిపథ్ ఆందోళనలు మిన్నంటాయి. నిరసన కారులు రైళ్లకు నిప్పు పెట్టి, బైక్ లను దగ్ధం చేశారు. అంతేగాక పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు నిరసనకారులపై కాల్పులు జరిపారు. దానితో  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఓ ముందస్తు పధకం ప్రకారమే ఈ దాడులు జరిగిన్నట్లు పోలీసులు గుర్తించారు.
 రైల్వే స్టేషన్‌లో ఆందోళనకారులపై ఆర్ పిఎఫ్ బలగాలు కాల్పులు జరపడంతో ఒకరు మృతి చెందారు. ప్లాట్‌ఫాం నంబర్ వన్‌పై యువకుడు మరణించారు. ఆర్ పిఎఫ్ బలగాల కాల్పుల్లో పలువురు ఆందోళనకారులు తీవ్రంగా గాయపడ్డారు. కాళ్లు, చేతులు, వీపు సహా ఇతర భాగాల్లోకి బుల్లెట్లు తగలడంతో 20 మంది వరకు గాయపడినట్టు సమాచారం.
గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన ఆందోళనకారులను ఆస్పత్రులకు తరలిస్తున్నారు. దీంతో సికింద్రాబాద్ స్టేషన్‌వైపు వచ్చే రైళ్లను పూర్తిగా రద్దుచేశారు. 300 ప్యాసింజర్ రైళ్లు రద్దయ్యాయి. మరో 44 ఎంఎంటీఎస్‌ సర్వీసులను నిలిపివేశారు. ముందస్తు చర్యగా  నగరంలో మెట్రో రైళ్లను కూడా నిలిపివేశారు.
బస్సులపై ఆర్మీ అభ్యర్థులు రాళ్లు రువ్వారు. రెండు బోగీలకు నిప్పంటించారు. మొదటి మూడు ఫ్లాట్‌ఫాంలలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ మూడు ఫ్లాట్‌ఫాంలను పూర్తిగా ధ్వంసం చేశారు. హౌరా ఎక్స్‌ప్రెస్‌, ఈస్ట్‌ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ సహా మూడు రైళ్లకు ఆందోళనకారులు నిప్పంటించారు. మొత్తానికి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ రణరంగంగా మారింది.
అగ్నిపథ్‌ను రద్దు చేసి ఆర్మీ పరీక్షను యథావిధిగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆర్మీ అభ్యర్థులు వేల సంఖ్యలో ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన రైల్వే స్టేషన్‌ వద్దనున్న బస్టాండ్‌కు చేరుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు.
వెంటనే అక్కడున్న ఆందోళనకారులంతా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పరుగులు తీసి అక్కడ నిలిచి ఉన్న రైళ్లపై విద్యార్థులు రాళ్లు రవ్వారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. అధికారులు రైళ్లన్నింటినీ నిలిపివేశారు.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు యత్నించారు. ఆర్మీ అభ్యర్థులు పట్టాల మధ్యలో నిప్పుపెట్టారు. వేలాది మందిగా ఉన్న యువకులను పోలీసులు నియంత్రించలేక పోయారు. రైళ్ల అద్దాలను ధ్వంసం చేస్తుంటడంతో ఏమీ చేయలేక పోలీసులు చూస్తూ ఉండిపోయారు.
కిషన్ రెడ్డికి అమిత్ షా ఫోన్ 
సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్ లో జ‌రిగిన విధ్వంసం పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా  కేంద్ర మంత్రి,  సికింద్రాబాద్ ఎంపీ కిష‌న్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడారు. హింసకు దారి తీసిన పరిస్థితులపై ఆరా తీసినట్టు సమాచారం. ఇప్పటి వ‌ర‌కు ఉత్తరాది రాష్ట్రాలకు పరిమితం అయిన ఆందోళనలు క్రమంగా దక్షిణాదికి చేరడంతో కేంద్ర హోం శాఖ అప్రమత్తమైంది.
వీటికి చెక్ పెట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చూస్తోంది. ఇప్పటికే అగ్నిపథ్ పథకంపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు అమిత్ షా సహా పలువురు కేంద్రం మంత్రులు మీడియా, సోషల్ మీడియాలో ప్రకటనలు చేస్తున్నారు. సికింద్రాబాద్ ఘ‌ట‌న దుర‌దృష్ట‌క‌రమ‌ని జన‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. కాల్పుల్లో మృతిచెందిన యువ‌కుడి కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. గాయ‌ప‌డిన వారికి మెరుగైన వైద్యం అందించాల‌ని కోరారు.