రాహుల్‌ను 3 గంటలు ప్రశ్నించిన ఈడీ

నేషనల్ హెరాల్డ్మనీలాండరింగ్‌ కేసులో కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ సోమవారంనాడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరయ్యారు. సుమారు 3 గంటల సేపు విచారణ సాగింది. రాహుల్ గాంధీ స్టేట్‌మెంట్‌ను ఈడీ రికార్డు చేసింది. ఈడీ విచారణలో రాహుల్‌పై పలు ప్రశ్నల వర్షం కురిపించింది.
 
 అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ సంస్థలో మీ హోదా ఏమిటి? యంగ్ ఇండియన్ సంస్థతో మీ సంబంధం ఏమిటి? మీ  పేరుతో ఆ సంస్థలో షేర్లు ఎందుకు ఉన్నాయి? యంగ్ ఇండియన్ సంస్థకు కాంగ్రెస్ నుంచి రుణాలు ఎందుకు ఇచ్చారని ఈడీ ప్రశ్నించింది.
విచారణ సందర్భగా రాహుల్ గాంధీ తరఫున న్యాయవాదులను అనుమతించ లేదు. సుమారు 3 గంటల సేపు విచారణ సాగిన అనంతరం రాహుల్ లంచ్ కోసం ఈడీ కార్యాలయం విడిచిపెట్టారు.
తిరిగి విచారణకు హాజరవుతారు. అక్కడి నుంచి నేరుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లి, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలుసుకునేందుకు గంగారామ్ ఆసుపత్రికి వెళ్లారు. రాహుల్‌ గాంధీ సోమవారం ఉదయం సోదరి ప్రియాంక గాంధీతో కలిసి కాంగ్రెస్‌ కేంద్ర కార్యాలయంకు చేరుకొని, అక్కడి నుండి ఈడీ  కార్యాలయానికి వెళ్లారు.
ఇదే కేసులో  కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కూడా ఇడి సమన్లు ఇచ్చింది.  అయితే ఆమె కరోనా బారినపడటంతో ఆదివారం ఢిల్లీలోని సర్‌ గంగారామ్‌ ఆసుపత్రిలో చేరారు. దీంతో నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఆమె ఈ నెల 23న విచారణకు హాజరుకావాల్సి ఉంది.
 
ఇలా ఉండగా, రాహుల్ కు సంఘీభావంగా పెద్దఎత్తున కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు ఢిల్లీలోని ఎఐసిసి ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్‌, చత్తీస్‌ఘర్‌ సిఎం భూపేష్‌ బఘేల్‌, దిగ్విజయ్  సింగ్‌, పి. చిదంబరం, జైరాం రమేష్‌, సచిన్‌ పైలెట్‌, ముకుల్‌ వాస్నిక్‌, గౌరవ్‌ గొగోయ్, రాజీవ్‌ శుక్లా తదితరులు చేరుకున్నారు. 
 
ఎఐసిసి ప్రధాన కార్యాలయం నుండి వీరంతా ర్యాలీగా ఇడి కార్యాలయానికి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. మరికొంతమందిని ఎఐసిసి కార్యాలయంలోనే నిర్బంధించారు. నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ప్రియాంక, ఇతర కార్యకర్తలు రోడ్లపై బైఠాయించారు. రాహుల్‌ విచారణనిమిత్తం ఇడి కార్యాలయానికి చేరుకున్నారు. 
 
శాంతి భద్రతల రిత్యా కాంగ్రెస్‌ మార్చ్‌కు అనుమతి ఇవ్వడం కుదరదని ఢిల్లీ పోలీసులు ఆదివారం నాడే  కాంగ్రెస్‌కు స్పష్టం చేశారు. అలాగే ఇడి కార్యాలయం ముందు 144 సెక్షన్‌ విధించారు. అయితే ర్యాలీ నిర్వహించి తీరుతామని నేతలు స్పష్టం చేయడంతో పార్టీ నేతలను అదుపులోకి తీసుకుని బస్సుల్లోకి ఎక్కించారు.