లిక్కర్‌ పాలసీ నిందితుల జాబితాలో ఆప్‌

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీకి చిక్కులు తప్పేలాల లేవు. ఇప్పటికే ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రితో సహా పలువురు నాయకులు అరెస్టయిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పార్టీని సైతం నిందితుల జాబితాలో ఈడీ చేర్చబోతున్నది. ఈ విషయాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మంగళవారం ఢిల్లీ హైకోర్టుకు వెల్లడించింది.  
 
నిందితుల జాబితాలో ఆప్‌ పార్టీని చేర్చితే, చరిత్రలో తొలిసారిగా ఓ జాతీయ పార్టీ పేరును నిందితులుగా ప్రస్తావించినట్లవుతుంది. మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా బెయిల్‌ పిటిషన్‌ను ఈడీ వ్యతిరేకించింది.  ఈ సందర్భంగా ఈడీ తరఫున న్యాయవాది మాట్లాడుతూ తదుపరి ఛార్జ్‌షీట్‌లో ఆప్‌ పార్టీని సైతం సహ నిందితుడిగా చేర్చబోతున్నట్లు తెలిపారు. 
 
ఈ కేసులో అభియోగాలను నమోదు చేసే ప్రక్రియను జాప్యం చేసేందుకు నిందితులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అయితే, సిసోడియా తరఫున సీనియర్‌ న్యాయవాది దయన్‌ కృష్ణన్‌ వాదనలు వినిపించారు. కేసు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం లేదని, కేసుల విచారణ ఇంకా కొనసాగుతుందని, అరెస్టులు కొనసాగుతున్నా ఏమాత్రం పురోగతి లేదనిపేర్కొన్నారు. 
 
విచారణ కూడా తుది దశకు చేరలేదని గుర్తు చేశారు. సిసోడియా విచారణను ఆలస్యం చేస్తున్నారన్న వాదనలను ఆయన తప్పుపట్టారు. విచారణను ఈడీ ఆలస్యం చేస్తుందని ఆయన ఆరోపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి దీనిపై నిర్ణయాన్ని ప్రస్తుతానికి రిజర్వ్ చేశారు. ఆప్‌ను నిందితురాలిగా చేర్చడం గురించి సుప్రీం కోర్టు నిరుడు అక్టోబర్‌లో ప్రస్తావించింది. ఈడీ  వాదనల ప్రకారం మద్యం పాలసీ కేసులో ఆప్ ముడుపులు అందుకున్నట్లయితే రాజకీయ పార్టీని ఎందుకు నిందితురాలిగా ప్రస్తావించడంలేదని సుప్రీం కోర్టు దర్యాప్తు సంస్థను అడిగింది.‘మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ)కు సంబంధించినంత వరకు మీ మొత్తం కేసు ఒక రాజకీయ పార్టీకి ప్రయోజనాలు అందాయి. ఆ రాజకీయ పార్టీని ఇప్పటికీ నిందితురాలిగా, కక్షిదారుగా చేర్చలేదు. దానికి మీరు ఎలా సమాధానం ఇస్తారు? మీ వాదన ప్రకారం రాజకీయ పార్టీ లబ్ధిదారు’ అని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎస్‌వి భట్లితో కూడిన ధర్మాసనం పేర్కొన్నది. 

అయితే, తమ ప్రశ్న ‘ఏ రాజకీయ పార్టీని ఇరికించడానికి కాదు’ అని, ‘కేవలం ఒక న్యాయపరమైన ప్రశ్న’ అని ఆ మరునాడు కోర్టు స్పష్టం చేసింది. అయితే, మద్యం పాలసీ కేసులో రూ.100కోట్లు ముడుపులను ఆమ్‌ ఆద్మీ పార్టీ 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వినియోగించిందని ఈడీ ఆరోపించింది. ఆప్ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌తో సహా పార్టీ కీలక నేతలు ముగ్గురు ఈ కేసులో ఇప్పటికే జైలుకు వెళ్లిన విషయం విదితమే.