మోదీపై ఆరోపణలు చేసిన శ్రీలంక అధికారి రాజీనామా!

శ్రీలంకలో ఎనర్జీ ప్రాజెక్ట్‌ కాంట్రాక్ట్‌ గౌతమ్‌ అదానీ గ్రూప్‌కు అప్పగించడం వెనుక భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒత్తిడి ఉందంటూ విమర్శలు గుప్పించిన అధికారి తన పదవికి రాజీనామా చేశారు. భారత ప్రధాని మోదీ  ఒత్తిడి మేరకు అధ్యక్షుడు గొటబయ రాజపక్సే ఈ పని చేశారని, ఈ నేపథ్యంలో అదానీకి ఈ ప్రాజెక్టుకు అప్పగించారని శ్రీలంక సిలోన్‌ ఎలక్ట్రిసిటీ బోర్డ్‌ (సిఇబి) చైర్మన్‌ ఎంఎంసి ఫెర్డినాండో గత వారం ఆరోపించారు. 
 
ఈ విషయాన్ని తనకు రాజపక్సే చెప్పారంటూ పార్లమెంట్‌ ప్యానల్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కమిటీ (సిఒపిఇ) బహిరంగ విచారణలో పేర్కొన్నారు. శుక్రవారం ఈ ఆరోపణలు చేయగా, తాజాగా ఈ వ్యాఖ్యలను ఫెర్డినాండో ఉపసంహరించుకున్నారు. ఆదివారం ట్విట్టర్‌లో ఈ ఆరోపణలు రాజపక్సే ఖండించిన తర్వాత.. ఈ వ్యాఖ్యలను ఫెర్డినాండో తక్షణమే వెనక్కు తీసుకున్నారు. తాజాగా బహిరంగ క్షమాపణలు చెప్పిన ఆయన, తన ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు.
ఆ అభియోగాలను ఖండిస్తూ అధ్యక్ష కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో ….”మన్నార్‌లో 500 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు ఉంది.  ఈ ప్రాజెక్టుని ఏ వ్యక్తికి లేదా ఏ సంస్థకు ఇవ్వడానికి తాను ఏ సమయంలోనూ ఎవరికీ అధికారం ఇవ్వలేదు” అని స్పష్టం చేశారు.
అయితే ప్రాజెక్ట్‌ల కోసం సంస్థల ఎంపికపై ప్రత్యేక శ్రద్ధ ఉంటుందని, ఇది శ్రీలంక ప్రభుత్వంచే పారదర్శకంగా, జవాబుదారీ వ్యవస్థకు అనుగుణంగా నిర్వహించబడుతుందని అధ్యక్షుడు రాజపక్స కార్యాలయం వెల్లడి చేసింది.  ఆ తర్వాత ఫెర్డినాండో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడమే కాకుండా క్షమాపణలు చెప్పారు.
ఆనుకోని ఒత్తిళ్లు, భావోద్వేగాలు కారణంగా భారత ప్రధాని పేరు చెప్పాల్సి వచ్చిందని వివరణ కూడా ఇచ్చారు. తాజాగా తన పదవికి కూడా రాజీనామా చేశారు.  అదానీ గ్రూప్‌ డిసెంబర్‌లో మన్నార్‌, పూనేరిన్‌లలో రెండు విద్యుత్‌ ప్రాజెక్ట్‌ కాంట్రాక్ట్‌లను దక్కించుకుంది. ఆ సందర్భంగా గౌతమ్‌ అదానీ శ్రీలంక సందర్శించడమే కాకుండా రాజపక్సతో సమావేశం గురించి ట్విట్టర్‌లో ట్వీట్‌ కూడా చేశారు.