ఆన్‌లైన్ బెట్టింగ్ ప్రకటనలపై నిషేధం

ఆన్‌లైన్ బెట్టింగ్‌ను ప్రోత్సహించే ప్రకటనలు వినియోగదారులకు సామాజికంగా, ఆర్థికంగా ముప్పుగా పరిణమిస్తున్నందున ఆ ప్రకటనలకు దూరంగా ఉండాలని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలను కేంద్రం కోరింది. ఈ మేరకు ఆ ప్రకటనలపై నిషేధం విధిస్తూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సోమవారం మార్గదర్శకాలను జారీ చేసింది. 
 
ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్, ఆన్‌లైన్ మీడియాలో పెద్ద సంఖ్యలో ఆన్‌లైన్ బెట్టింగ్ వెబ్‌సైట్స్, ప్లాట్‌ఫాంల గురించిన ప్రకటనలు వెల్లువెత్తుతున్నందున కేంద్ర ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను జారీ చేసింది.  బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌ను దేశం లోని అనేక ప్రాంతాల్లో చట్టవిరుద్ధమైనవిగా పరిగణిస్తారని, వీటిపై ప్రకటనలు ముఖ్యంగా చిన్నారులకు, యువతకు సామాజిక, ఆర్థిక ముప్పుగా పరిణమించాయని ప్రభుత్వం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. 
 
నిషేధించే కార్యకలాపాలను ప్రోత్సహించేలా ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ యాడ్స్ ఉన్నాయని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న ఈ ప్రకటనలు వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019కి విరుద్ధమని వివరించింది.  అలాగే ప్రెస్ కౌన్సిల్ చట్టం 1978కి విరుద్ధంగా ఆన్‌లైన్ బెట్టింగ్ యాడ్స్‌ను ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. ప్రజా ప్రయోజనాలను కాపాడే క్రమంలో ఆన్‌లైన్ బెట్టింగ్ తాజా మార్గదర్శకాలను జారీ చేసినట్టు తెలియజేసింది.
ప్రైవేట్ టీవీ ఛానల్స్‌కు 2020 డిసెంబర్ 4న ఇదే విధంగా మార్గదర్శకాలు జారీ చేశామని, అడ్వర్‌టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎఎస్‌సిఐ) ఆన్‌లైన్ గేమింగ్‌పై విధించిన నిబంధనల ప్రకారం అనుసరించాలని సూచించామని చెప్పింది.
2020 డిసెంబర్ 15 నుంచి ఎఎస్‌సిఐ నిబంధనలు అమలు లోకి వచ్చాయి. ఈ నిబంధనల ప్రకారం 18 ఏళ్ల లోపు వారు ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్‌లో పాల్గొనరాదని, 18 ఏళ్లు పైబడినవారు మాత్రం ఈ గేమింగ్‌కు అర్హులని నిబంధనలు పేర్కొన్నాయి. సంపాదన కోసమో, లేదా ఉద్యోగ ప్రత్యామ్నాయం కోసమో ఈ ఆన్‌లైన్ గేమ్ నిర్వహించరాదని సూచించాయి.