బంగారం స్మగ్గ్లింగ్ దర్యాప్తు అడ్డుకుంటున్న విజయన్ … బిజెపి

కేరళ బంగారం స్మగ్లింగ్ కేసులో ఇటీవల వెల్లడైన విషయాలు కేరళ  ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన కుటుంబంపై తీవ్రమైన అనుమానాలు కలిగిస్తుండగా,  అత్యంత తీవ్రమైన ఈ కుంభకోణంపై దర్యాప్తును సిఎం అడ్డుకున్నారని బిజెపి ఆరోపించింది.

కేరళలో ప్రతిపక్ష పార్టీలు తన రాజీనామాను కోరుతూ నిరసనలు చేస్తుండడంతో, తిరువనంతపురంలోని యుఎఇ కాన్సులేట్ నుండి 2016లో  దౌత్యవేత్త సహాయంతో కరెన్సీని దేశం నుండి తరలించినట్లు కేసులో కీలక నిందితురాలు స్వప్న సురేష్ కోర్ట్ లో ఆరోపించినప్పటి నుండి ముఖ్యమంత్రిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

2020లో కుంభకోణం బహిర్గతం అయిన వెంటనే, విజయన్ ప్రధాని నరేంద్ర మోదీకి ఈ కేసు “తీవ్రమైన చిక్కులు” కలిగి ఉందని లేఖ రాశారని బిజెపి సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గుర్తు చేశారు. ఈ కుంభకోణంపై కేంద్రం విచారణ జరిపించాలని విజయన్ డిమాండ్ చేశారని చెప్పారు. 

 
ఈ సందర్భంగా ఈ కేసుకు సంబంధించి  “ప్రతి లింక్‌ను విప్పుటకు” తన ప్రభుత్వ సహాయాన్ని కూడా అందించగలదని హామీ ఇచ్చారని తెలిపారు. “కానీ ఇప్పుడు అతను కేసు దర్యాప్తులో నైపుణ్యం ఉన్న కేంద్ర ఏజెన్సీలను అడ్డుకోవడానికి రాష్ట్ర పోలీసులను ఉపయోగిస్తున్నారు” అని చంద్రశేఖర్ ఆరోపించారు.
 
దర్యాప్తు స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా జరిగే విధంగా సహకరించి ముఖ్యమంత్రి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని కేంద్ర మంత్రి వి మురళీధరన్ హితవు చెప్పారు. అయితే, తనపై వస్తున్న ఆరోపణలను విజయన్ కొట్టిపారేస్తూ, అవన్నీ “ప్రచారం” మాత్రమే అని పేర్కొనడం గమనార్హం.