రాజ్యసభలో మెజారిటీ మార్క్ చేరుకున్న ఎన్డీయే బలం!

రాజ్యసభ ఎన్నికల తాజా ఫలితాలతో ఎగువ సభలో ఎన్‌డీఏ బలం 117కి చేరడంతో బీజేపీలో కదనోత్సాహం రెట్టింపైంది.  ఇప్పుడు జరిగిన రాజ్యసభ 57 ఖాళీ స్థానాల భర్తీకి జరిగిన ఎన్నికలలో అసెంబ్లీల్లో సంఖ్యాబలం ప్రకారం బిజెపి కేవలం 20 స్థానాలను గెల్చుకోవచ్చునని ఆశించింది. అయితే 22 సీట్లు తెచ్చుకుంది. 
 
తాము మద్దతు ఇచ్చిన ఓ ఇండిపెండెంట్ హర్యానాలో గెలిచేలా చేసుకుంది. ప్రతిపక్ష శిబిరంలోని అసంతృప్తులు, ఏ పార్టీకి చెందని లెజిస్లేటర్లను తన వైపు మల్చుకునే దిశలో బిజెపి విజయం సాధించింది. క్రాస్ ఓటింగ్‌కు అవసరం అయిన కసరత్తులలో తమ ఆధిక్యతను బిజెపి ఎన్నికల నిర్వాహకులు రుజువు చేసుకున్నారు.
 
245 మంది సభ్యుల సభలో 233 మంది రాష్ట్రాల శాసనసభల ద్వారా ఎన్నికవుతారు. వీరికి మాత్రమే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసే హక్కుంది. రాష్ట్రపతి నామినేట్‌ చేసే మిగతా 12 మంది ఓటువేయడానికి వీల్లేదు. 57 స్థానాలకు ఇటీవల ద్వైవార్షిక ఎన్నికలు జరుగగా  వాటిలో తనకున్న 24 స్థానాలను బీజేపీ నిలబెట్టుకోలేదని,  20 మాత్రమే వస్తాయని అంతా భావించారు.
కానీ కర్ణాటక, మహారాష్ట్రలో ఆ పార్టీ రెండు సీట్లు అదనంగా దక్కించుకుని మొత్తంగా 99 స్థానాలు సాధించింది. అలాగే హరియాణాలో బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. యూపీఏకి ఇప్పుడు రాజ్యసభలో 53 మంది సభ్యులున్నారు. టీఎంసీ(13), ఆప్‌(10), వైసీపీ(9), బీజేడీ(9), టీఆర్‌ఎస్‌(7), ఆర్‌జేడీ(6), సీపీఎం(5), సమాజ్‌వాదీ(3), సీపీఐ(2), టీడీపీ (1) సహా ఇతరులకు 71 మంది ఎంపీలున్నారు.
వైసీపీ, బీజేడీ మద్దతుతో తన బలం 135కి చేరుతుందని, ఏకసభ్య పార్టీలు కూడా కొన్ని కలిసొస్తాయని.. ప్రతిపక్షాల్లో ఐకమత్యం లేకపోవడంతో రాష్ట్రపతి ఎన్నికల్లో తేలిగ్గా గెలవగలమని బీజేపీ ఇప్పుడు దృఢవిశ్వాసంతో ఉంది. మహారాష్ట్ర, కర్నాటక, హర్యానాలలో ప్రతిపక్ష పార్టీలలో సఖ్యత లేమి ఇప్పటి ఎన్నికలతో మరింత స్పష్టం అయింది. అయితే, ఏం చేసినా రాజస్థాన్ బిజెపికి కొరకరాని కొయ్య అయింది.
 
ఇతర రాష్ట్రాలలో అదనంగా ఒక్కొటి చొప్పున బోనస్‌గా రెంటు సీట్లు  దక్కించుకున్న బిజెపికి రాజస్థాన్‌లో చుక్కెదురైంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత , సిఎం అశోక్ గెహ్లోట్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి కాకుండా చేశారు. చివరికి బిజెపికి చెందిన ఓ ఎమ్మెల్యే ఓటు కాంగ్రెస్‌కు పడేలా చేయడం ద్వారా మీడియా దిగ్గజం, బిజెపి మద్దతుతో బరిలో నిలిచిన సుభాష్ చంద్రను ఓడించగలిగారు.
 
 అయితే ఇప్పటి ఫలితాలు తమకు బాగా సంతోషాన్ని ఇచ్చాయని బిజెపి సంబర పడుతుంది. ప్రత్యేకించి మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహా వికాస్ అఘాడీ అభ్యర్థులకు షాక్ తగిలించడంలో బిజెపి వ్యూహాలు ఫలించాయి.మహారాష్ట్రలోని మహారాష్ట్ర వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వానికి ఊహించని షాక్‌ తగిలింది. ఆరు స్థానాలకు గాను ప్రతిపక్ష బీజేపీ మూడు సీట్లు కైవసం చేసుకోవడం ఉద్ధవ్‌ ఠాక్రే సారథ్యంలోని శివసేన-ఎన్‌సీపీ-కాంగ్రెస్‌ సంకీర్ణ సర్కారుకు మింగుడుపడని పరిణామమే.
సాధారణంగా ఇలాంటి ఎన్నికల్లో పాలక కూటమికి మద్దతిచ్చే స్వతంత్రులు, చిన్న పార్టీలు.. ఇక్కడ మాత్రం విపక్షంలో ఉన్న బీజేపీకి సహకరించడం విశేషం. మాజీ సీఎం, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్‌ చాణక్యమే దీనికి కారణమని ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ సైతం ప్రశంసించడం గమనార్హం.