ప్రతిపక్ష శిబిరంలో మమతా వేరే కుంపటి!

రాజ్యసభ ఎన్నికలలో తాము అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు గెల్చుకొని మంచి ఉషారులో ఉన్న బీజేపీ రాష్ట్రపతి ఎన్నికలలో సహితం తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి అవసరమైన బలం సమకూర్చుకున్నామన్న ధీమాతో ఉంది. అయితే ప్రతిపక్ష శిబిరంలో మాత్రం ఉమ్మడి అభ్యర్థిని  నిలబెట్టి, బిజెపికి గట్టి పోటీ ఇవ్వడంపై కన్నా తమ తమ ఆధిక్యతను నిరూపించుకొనే ధోరణి వెల్లడి అవుతుంది.
ఒక వంక కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పలువురు ప్రతిపక్ష నేతలతో ఫోన్ లో మాట్లాడి ఉమ్మడి అభ్యర్థి గురించిన సమాలోచనలు ప్రారంభించగా, మరోవంక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా వ్యూహరచన చేసేందుకు 15న ఢిల్లీలో భేటీ అవుదామంటూ ఆహ్వానిస్తూ   22 విపక్ష పార్టీలకు  లేఖలు రాశారు. ‘‘కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్బులో మధ్యాహ్నం మూడింటికి జరిగే సమావేశంలో హాజరవుదాం’’ అని కోరారు.
మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, జార్ఖండ్, పంజాబ్‌ ముఖ్యమంత్రులు, పలు పార్టీల అధినేతలతో పాటు  సోనియాగాంధీకి కూడా ఆమె ఆహ్వానం పంపడం విశేషం
అదే రోజు రాష్ట్ర పతి అభ్యర్థి విషయమై సోనియా గాంధీ యుపిఎ, వామపక్షాలు చెందిన సీనియర్ నేతలతో సమావేశం ఏర్పాటు చేయడం గమనార్హం. రాష్ట్రపతి ఎన్నిక పట్ల కన్నా ప్రతిపక్షాలకు ఎవ్వరు సారధ్యం వహించాలన్న విషయమై ప్రతిపక్ష నాయకులు ఎత్తుగడలు ఉద్దేశిస్తున్నట్లు స్పష్టం అవుతున్నది.
మమత తలపెట్టిన భేటీ వ్యతిరేక ఫలితాలకే దారి తీస్తుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. జూన్‌ 15వ తేదీనే సోనియాగాంధీ, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్, తమిళనాడు సీఎం స్టాలిన్‌ తదితరులు సమావేశమవుతున్నారని గుర్తు చేశారు.
‘‘మమత కూడా అదే రోజు సమావేశం పెట్టడం సరికాదు. ఆమె ఏకపక్ష నిర్ణయం విపక్షాల ఐక్యతకు భంగకరం’’ అని విమర్శించారు .  ‘‘2017లోనూ రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఇలాంటి ప్రయత్నాలే చేశారు. చివరికేమైందో అందరికీ తెలుసు’’ అని బెంగాల్‌ బీజేపీ నేత సమిక్‌ భట్టాచార్య మమతా భేటీపై ఎద్దేవా చేశారు.
ఇలా ఉండగా, రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి అంటూ గత నెలలో హడావుడి చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఎన్నికల షెడ్యూల్ ప్రకటన అనంతరం నోరు మెదపడం లేదు. ఒక వంక జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం, మరోవంక సోనియా -మమతా పోటీపడి రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఓ విధంగా `బల ప్రదర్శన’కు దిగడంతో కేసీఆర్ ప్రేక్షకపాత్ర వహించక తప్పని పరిస్థితి నెలకొంది. 
 
కాంగ్రెస్ సహితం ఈ విషయంలో కేసీఆర్ ను సంప్రదింపబోతున్నట్లు సంకేతం ఇచ్చింది. ఢిల్లీ సమావేశంపై మమతా స్వయంగా ఆయనను ఆహ్వానించింది. ఎటువైపు మొగ్గు చూపుతారో చూడవలసి ఉంది. 
 
కాగా,  ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు, బీఎస్పీ నాయకురాలు మాయావతి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీలకు మమతా లేఖలు పంపలేదు. వీరి మద్దతుపై కాంగ్రెస్ సహితం ఎటువంటి ఆశలు పెట్టుకున్నట్లు లేదు.