నయనతార దంపతులపై టిటిడి ఆగ్రహం

పెళ్లితో దాంపత్య జీవితంలో అడుగుపెట్టిన కొన్ని గంటల్లోనే నటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్‌లు వివాదంలో చిక్కుకున్నారు. గురువారం ఉదయం చెన్నై సమీపంలోని మహాబలిపురం వడనెమ్మేలిలోని షెరటాన్‌ గ్రాండ్‌ హౌటల్‌లో నయనతార, విఘ్నేశ్‌ల వివాహం జరిగింది. 
 
అనంతరం కొత్త జంట వెంకటేశ్వరుడి ఆశీర్వాదం కోసం తిరుమలకు వెళ్లారు. దర్శనానంతరం నయన-విఘ్నేశ్‌ దంపతుల ఫొటో షూట్‌ జరిగింది. అయితే నూతన దంపతులు తిరుమల మాడ విధుల్లోకి చెప్పులు ధరించి వచ్చారు. తిరుమల పరిసరాలను టిటిడి, భక్తులు పవిత్రంగా భావిస్తారు. 
 
అలాంటి పవిత్ర స్థలంలోకి నయనతార, విఘ్నేశ్‌లు చెప్పులు ధరించి వెళ్లడంపై భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీన్ని భద్రతా వైఫల్యంగా పరిగణించిన టిటిడి నయనతార, విగేశ్‌ జంటపై, అలాగే ఫోటో షూట్‌ చేసిన వారిపై కేసు పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామని పేర్కొంది.
 
దర్శనాంతరం ఈ జంట తిరుమ‌ల కొండ‌పై శ్రీవారి ఆల‌యం చుట్టూ ఉన్న మాడ‌ వీధుల్లో తిరిగిన  సంద‌ర్భంగా విఘ్నేశ్ చెప్పులు విడిచి న‌డిచినా.. న‌య‌న‌తార మాత్రం చెప్పుల‌తోనే మాడ‌ వీధుల్లో తిరిగింది. అంతేకాకుండా శ్రీవారి ఆల‌యం ప్ర‌ధాన ద్వారానికి అత్యంత స‌మీపంలోనే వారు ఫొటోషూట్‌లో పాల్గొన్నారు.
 
ఇలా తిరుమ‌ల ప‌విత్ర‌త‌కు న‌య‌న‌తార దంప‌తులు భంగం క‌లిగించేలా వ్య‌వ‌హ‌రించి భక్తులు మనోభావాలు దెబ్బతిసేలా ప్రవర్తించారు. దీంతో ఈ నయనతార దంపతుల తీరుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి. ఇక ఈ వ్య‌వహారంపై తిరుమ‌ల తిరుపతి దేవ‌స్థానం (టీటీడీ) ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. 
 
న‌య‌న‌తార చెప్పుల‌తోనే మాడ వీధుల్లో సంచ‌రించ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని వ్యాఖ్యానించింది. తిరుమ‌ల ప‌విత్ర‌తకు భంగం క‌లిగేలా వ్య‌వ‌హ‌రించిన న‌య‌న‌తార దంప‌తుల‌కు నోటీసులు ఇచ్చినట్లు టీటీడీ పీవీఎస్వో నరసింహ కిషోర్‌ తెలిపారు. అంతేకాదు నయనతార దంపతులతో ఫోన్లో మాట్లాడామని, భక్తుల మనోభావాలు దెబ్బతిసినందుకు నయనతార క్షమాపణలు చెప్పారన్నారు. తెలియక చేసిన తప్పుకు మన్నించమని నయనతార-విఘ్నేశ్‌లు కోరినట్లు ఆయన పేర్కొన్నారు.
 ఫోటోషూట్‌కు అనుమతించిన సిబ్బందితో పాటు నయనతార పాదరక్షలు ధరించి రావడంతో శ్రీవారి సేవకుల వైఫల్యంగా పరిగనిస్తున్నామని, సిబ్బందిపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
అయితే దీనిపై టీటీడీ ఈఓ, చైర్మన్‌తో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. నోటీసులపై నయనతార దంపతలు స్పందించిన అనంతరం ఏం చేయాలనేది నిర్ణయిస్తామని చెప్పారు. ఇక చివరగా సాంప్రదాయాలు ఉన్నత వ్యక్తులే పాటించాలని ఆయన స్పష్టం చేశారు.