దేశమంతా గుర్తుండే విధంగా అల్లూరి 125వ జయంతి ఉత్సవాలు

అల్లూరి సీతారామరాజు చరిత్రపుటల్లో ఉండి చాలా మందికి తెలియని వ్యక్తి అని పేర్కొంటూ అటువంటి వ్యక్తి గురించి దేశంలో అందరికీ తెలిసే విధంగా ఆయన 125వ జయంతి ఉత్సవాలు నిర్వహించాలనేది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  సంకల్పమని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌ రెడ్డి  తెలిపారు. 
 
దేశ స్వాతంత్య్రం కోసం చాలామంది ఉద్యమాలు చేశారని, కానీ పోరాటం చేసి, బలిదానమైనవారు కొందరేనని, వారిలో అల్లూరి సీతారామరాజు ఒకరని గుర్తు చేశారు. ఆయన పేరు వింటేనే, ఆయన చరిత్ర తెలుసుకుంటేనే మనకు ఒళ్లు పులకరిస్తుందని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జయంతి అనేది ఒక భీమవరంలోనే కాదని, అన్ని ప్రాంతాలతోపాటు ఢిల్లీలోని విజ్ఞాన‌భవన్‌లో జరపాలనేది తన ఆకాంక్ష అని ఆయన చెప్పారు. 
 
భీమవరంలోని అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కళా కేంద్రంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు నిర్వహణ, ప్రధానమంత్రి రాక ఏర్పాట్లు పై ఆదివారం కేంద్ర మంత్రి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జూలై 4న ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చి, అక్కడి నుంచి డిఫెన్స్ హెలికాప్టర్‌లో భీమవరం వస్తారని తెలిపారు.
 
అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు నిర్వహణకు ఉత్సవ కమిటీ ని ఏర్పాటు చేసి, దేశంలో ప్రజలందరికీ గుర్తుండిపోయే విధంగా జయంతి వేడుకలను నిర్వహించాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.
 
అల్లూరి సీతారామరాజు పుట్టిన, చదువుకున్న , సంచరించిన,, నివసించిన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని ఆయన తెలిపారు. సీతారామరాజు జయంతి ఉత్సవాలు ఢిల్లీలోని విజ్ఞానభవన్‌లో కూడా పెద్ద ఎత్తున నిర్వహించనున్నామని కేంద్ర మంత్రి వెల్లడించారు. 
 
ఈ కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ప్రముఖులను ఆహ్వానించామని కిషన్ రెడ్డి  తెలిపారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు పనులు వెంటనే మొదలు పెట్టాలని అధికారులకు ఆయన సూచించారు. .భీమవరం లో నిర్వహించే కార్యక్రమానికి అన్ని జిల్లాల నుండి ప్రజాప్రతినిధులు వివిధ కమిటీల ఏర్పాటు లో భాగస్వాములు కావాలని కోరారు. 
 
విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు మ్యూజియం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రూ. 35 కోట్లు మంజూరు చేసిందని కేంద్ర మంత్రి చెప్పారు. ఉత్సవాలు ముగింపు నాటికి దీన్ని పూర్తిచేసుకుని ప్రారంభించాలని లక్ష్యంగా ఉందని పేర్కొన్నారు. అల్లూరి పోరాటాల గురించి అందరికి తెలియజేయాలని ఆయనసూచించారు. అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు నిర్వహణకు అందరూ కలిసి రావాలని పిలుపిచ్చారు.