మహారాష్ట్ర, హర్యానాలో ఆగిన రాజ్యసభ ఫలితాలు!

నాలుగు రాష్ట్రాల్లో 16 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం జరిగిన ఎన్నికల్లో కర్ణాటక, రాజస్థాన్‌లలోని నాలుగేసి స్థానాల ఫలితాలు (మొత్తం 8) మాత్రమే వెలువడ్డాయి. ఇందులో కాంగ్రెస్‌, బీజేపీలకు చెరో నాలుగు స్థానాలు దక్కాయి. మహారాష్ట్రలో ఆరు, హరియాణాలో రెండు స్థానాలకు ఎన్నికలు ముగిసినా.. అక్కడ ఓట్ల లెక్కింపు జరగలేదు.
మహారాష్ట్రలో ఉద్ధవ్‌ ఠాక్రే సారథ్యంలోని మహారాష్ట్ర వికాస్‌ ఆఘాడీ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. ఎన్‌సీపీ నేతలు, ఆ రాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌, మాజీ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు బాంబే హైకోర్టు నిరాకరించింది. అక్రమాస్తులు, మామూళ్ల వసూలు, మాఫియాతో సంబంధాలు తదితర ఆరోపణలపై ప్రస్తుతం వీరు జైల్లో ఉన్నారు.
మరోవైపు… మహారాష్ట్ర, హరియాణాల్లో కొందరు కాంగ్రెస్‌ సభ్యులు తాము ఓటేసిన బ్యాలెట్లను బహిరంగంగా ప్రదర్శించారని.. ఆ ఓట్లను చెల్లనివిగా ప్రకటించాలని ఎన్నికల కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు చేసింది. దీంతో ఆ రాష్ట్రాల్లో కౌంటింగ్‌ నిలిపివేశారు.
కాగా… కర్ణాటక నుంచి బీజేపీ తరఫున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, నటుడు జగ్గేశ్‌; బీజేపీ ఎమ్మెల్సీ, పారిశ్రామికవేత్త లెహర్‌సింగ్‌ సిరోయా, కాంగ్రెస్‌ తరఫున కేంద్ర మాజీ జైరాం రమేశ్‌ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇక్కడ బలం లేకున్నా మరో స్థానానికి కాంగ్రెస్‌, జేడీఎస్‌ వేర్వేరుగా అభ్యర్థులను బరిలోకి దించాయి.
ఈ రెండు పార్టీల పోరుతో బీజేపీ రాజకీయ లబ్ధి పొందింది. మరో స్థానం బోన్‌సగా దానికి దక్కింది. పైగా జేడీఎస్‌ ఎమ్మెల్యే కె.శ్రీనివాసగౌడ కాంగ్రె్‌సకు ఓటేశారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ తరఫున సీనియర్‌ నేతలు రణదీప్‌ సుర్జేవాలా, ముకుల్‌ వాస్నిక్‌, ప్రమోద్‌ తివారీ విజయం సాధించినట్లు ఆ రాష్ట్ర సీఎం అశోక్‌ గహ్లోత్‌ తెలిపారు.
బీజేపీ అభ్యర్థి ఘనశ్యామ్‌ తివారీ కూడా తాను గెలిచినట్లు తెలిపారు. ఇక్కడ బీజేపీ మద్దతుతో జీ గ్రూప్‌ మీడియా సంస్థల చైర్మన్‌ సుభాష్‌ చంద్ర స్వతంత్రుడిగా బరిలోకి దిగి ఓడిపోయారు.
నాలుగు రాష్ట్రాలు,  16 రాజ్యసభ  స్థానాల కోసం శుక్రవారం జరిగిన  ఓటింగ్‌ లో ఉత్కంఠత చోటుచేసుకొంది. సాయంత్రం ఐదు గంటల నుంచే కౌంటింగ్‌ మొదలు కావాల్సి ఉన్నప్పటికీ ఎన్నికల కమీషన్ కు పలు అభ్యంతరాలు, ఫిర్యాదుల నడుమ ప్రతి రాష్ట్రంలో కూడా  ఓట్ల లెక్కింపులో తీవ్ర జాప్యం జరిగింది.
మొత్తం స్థానాల్లో ఏకగ్రీవం 41 స్థానాలు కాగా, ఎన్డీయే 17, యూపీఏ 10, ఇతరులు 14 ఏకగ్రీవంగా దక్కించుకున్నారు.  కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ తో స్వతంత్ర అభ్యర్థిని నిలబెట్టి గెలిపించేందుకు  కృషిచేసిన బిజెపికి చేదు అనుభవం  ఎదురైనది.  ఇద్దరు బిజెపి సభ్యులు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. బిజెపి బలపరచిన జీ మీడియా అధినేత సుభాష్‌ చంద్ర క్రాస్ ఓటింగ్ పై నమ్మకం పెట్టుకొని  ఓటమి పాలయ్యారు.
 
రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రమోద్ తివారీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేసినందుకు గాను రాజస్థాన్ ఎమ్మెల్యే శోభారాణి కుష్వాహను బీజేపీ నుంచి సస్పెండ్ చేశారు.శోభారాణి కుష్వాహాను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసింది. ఆమెకు 7 రోజుల సమయం ఇచ్చారు. 
 
శోభారాణి విప్‌కు వ్యతిరేకంగా ఎందుకు ఓటు వేసిందో స్పష్టం చేయాల్సిన సమయం వచ్చిందని బీజేపీ ప్రతిపక్ష నాయకుడు గులాబ్ చంద్ కటారియా వ్యాఖ్యానించారు.క్రాస్ ఓటింగ్ విషయం పార్టీ హైకమాండ్‌కు చేరిందని బీజేపీ రాజస్థాన్ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పూనా తెలిపారు.