కేసులు పెరుగుతున్నా నాలుగో వేవ్ అవకాశాలు తక్కువే 

దేశంలో గానీ, రాష్ట్రంలో గాని నాలుగో వేవ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్) డాక్టర్ జి.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. అయితే,  కరోనా వైరస్ ఇంకా పూర్తిగా కనుమరుగు కాలేదని, మనతో పాటే ఉందని, పూర్తిగా నిర్ములన అయ్యేందుకు ఇంకా సమయం పడుతుందని హెచ్చరించారు. 

ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు అతి స్వల్పంగానే ఉండే అవకాశం ఉందని పేర్కొంటూ  వ్యాక్సినేషన్ కవరేజీ దాదాపు 100 శాతం పూర్తి కావడం వల్ల ఎక్కువ మందిలో ఇమ్యూనిటీ తీసుకు రాగలిగామని చెప్పారు. మే నెల నుంచి ఇప్పటివరకు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ 2 కేసులే దాదాపు 65 శాతం నమోదయ్యాయని, గత రెండు రోజుల నుంచి బీఏ 4, బీఏ 5 వేరియంట్లకు సంబంధించిన కేసులు పెరుగుదల చూస్తున్నామని తెలిపారు. 

ఈ ఒమిక్రాన్ సబ్ వేరియంట్లతో నాలుగో  వేవ్ వచ్చే అవకాశం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొన్ని రోజులుగా కరోనా  కేసులు పెరుగుతున్నాయని చెబుతూ ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ బయటకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని డీహెచ్ సూచించారు. రాష్ట్రంలో గత వారం 355 కేసులు నమోదు కాగా, ఈ వారం 555 కేసులు నమోదయ్యాయని తెలిపారు. దాదాపు 56 శాతం పైగా కేసులు పెరిగాయని చెప్పారు.

దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 36 వేలకు పైగా ఉండగా,  తెలంగాణలో 811 మంది యాక్టివ్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. మూడో  వేవ్ ఒమిక్రాన్ కేసులు భారీగా వచ్చిన తర్వాత తగ్గుముఖం పట్టి,మళ్లీ గత రెండు వారాలుగా కొత్త కేసుల పెరుగుదలను చూస్తున్నామని తెలిపారు. తెలంగాణలో 811 క్రియాశీల కేసులు ఉంటే .. ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరికలు మాత్రం కేవలం రెండు మూడు మాత్రమే ఉన్నాయని తెలిపారు.

గత రెండు నెలల నుంచి మరణాలు కూడా సున్నాగానే కొనసాగుతున్నాయని చెప్పారు. గత మూడు రోజుల నుంచి 100కు పైగా కేసులు వస్తున్నాయని, రెండున్నర నెలల తర్వాత మళ్లీ ఈ స్థాయిలో కేసులు రావడం చూస్తున్నామని డీహెచ్ వివరించారు. పాండమిక్‌గా మొదలైన ఈ మహమ్మారి .. ప్రస్తుతం ఎండమిక్ స్టేజిలో కొనసాగుతోందని చెప్పారు. ఈ డిసెంబర్ నాటికి లేదా వచ్చే ఏడాది మధ్య కల్లా పూర్తిగా ఎండమిక్ స్థాయికి చేరే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వెంటనే కరోనా  నిర్ధారణ పరీక్షలు చేయించాలని సూచించారు. ఇప్పుడు మాత్రం ఇంకో ఆర్నెళ్ల పాటు ఇలాంటి కేసుల పెరుగుదల అప్పుడప్పుడూ చూస్తుంటామని చెప్పారు. ఇలా కేసులు పెరగడాన్ని చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కాకపోతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పారు.

బహిరంగ ప్రదేశాలు, ప్రజారవాణాలో ప్రయాణించేటప్పుడు మాస్క్ పెట్టుకోవడం మరిచిపోవద్దని హెచ్చరించారు. వర్షాకాలం పూ సీజన్ కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులకు మీ నుంచి వైరస్ వ్యాప్తి చెందకుండా చూసుకోవాలని పేర్కొన్నారు.

పిల్లలకు వ్యాక్సినేషన్ వేయించడం అత్యంత అవసరమని డీహెచ్ వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులు వారి పిల్లలకు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. 12 నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులో ఉందని, ఈ వయస్సు పిల్లలకు దాదాపు 90 శాతం మేరకు టీకా ఇచ్చామని తెలిపారు.
ఇప్పటివరకు వ్యాక్సిన్ వేయించని పిల్లలకు తల్లిదండ్రులు విధిగా వ్యాక్సిన్ వేయించాలని పేర్కొన్నారు. త్వరలోనే పాఠశాలలు తెరుచుకోనుండటంతో పాఠశాల యాజమాన్యాలు, తల్లిదండ్రులు పిల్లలందరికీ టీకాలు వేయించేలా తగిన చర్యలు తీసుకోవాలని డీహెచ్ సూచించారు.