కొడుకుకు సీఎం సీటు కోసం కేసీఆర్ జాతీయ పార్టీ!

ముఖ్యమంత్రి పదవికి ఒక వంక కొడుకు కేటీఆర్ నుండి ఒత్తిడి వస్తూ ఉండడంతో ఆ పదవిని కొడుకు కోసం ఖాళీ చేయక తప్పని పరిస్థితులు నెలకొనడంతో జాతీయ స్థాయి రాజకీయాలపై దృష్టి సారిస్తున్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు జాతీయ రాజకీయాలలో వహించే పాత్ర గురించి మాత్రం ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడినట్లు స్పష్టం అవుతుంది. 
 
తొలుత కాంగ్రెస్, బీజేపీ పార్టీలు లేని కూటమి ఏర్పాటు చేసి, సారధ్యం వహించాలని అనుకుంటే, అందుకు ఎవ్వరూ కలసివచ్చే వారు కనబడటం లేదు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుండి ఆయనకు ప్రధానంగా అడ్డంకి ఎదురవుతుంది. కాంగ్రెస్ తో ఏమాత్రం చేతులు కలిపినట్లు వెల్లడైన తెలంగాణాలో తమ పార్టీ ఉనికికే ముప్పు కాగలదని వెనకడుగు వేస్తున్నారు. 
 
మరోవంక కలిస్తే పలకరింపులు తప్పా మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ ఉపప్రధాని శరద్ పవర్ వంటి వారు సహితం కలసివచ్చే సూచనలు కనిపించడం లేదు. 2004 ఎన్నికలలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం, 2014 ఎన్నికలలో కాంగ్రెస్ తో తన పార్టీని విలీనం చేస్తామని, ఆ పార్టీని ఓడించి తెలంగాణాలో అధికారం చేపట్టడంతో  అరవింద్ కేజ్రీవాల్ వంటి వారు నమ్మి రాజకీయంగా చేతలు కలపలేక పోతున్నారు. 
 
ఇక శివసేన, డీఎంకే, జేఎంఎం వంటి పార్టీలు కాంగ్రెస్ తో కలసి అధికారం పంచుకొంటూ ఉండడంతో కేసీఆర్ తో కలసి రాజకీయంగా ప్రయాణం చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రపతి ఎన్నికలలో ఉమ్మడి అభ్యర్థి ఎంపిక విషయంలో తానే చక్రం తిప్పాలని వేసిన ఎత్తుగడలు ఫలించలేదు. ఈ లోగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చొరవ తీసుకొని, అన్ని పక్షాలతో స్వయంగా మాట్లాడుతూ ఉండడంతో కేసీఆర్ ను పట్టించుకునేవారు కనబడటం లేదు. 
 
దేవెగౌడ, శరద్ పవర్ వంటి పేర్లను తెరపైకి తెచ్చే ప్రయత్నం చేసినా, కేసీఆర్ ను నమ్ముకొని రాష్ట్రపతి ఎన్నికలలో పోటీకి వారెవ్వరూ ఆసక్తి చూపలేదు. మరోవంక, రాష్ట్రంలో బిజెపి ఎదుగుతూ ఉండటం, ఇప్పటి వరకు కొంతమేరకు ఉదాసీనంగా చూసీచూడనట్లు వ్యవహరించిన కేంద్ర ప్రభుత్వం సునిశితంగా తన ప్రభుత్వ వ్యవహారాలపై కనీయడంతో కేసీఆర్ అప్రమత్తం కావలసి వచ్చింది. 
 
ఈ పరిణామాలపై శుక్రవారం అందుబాటులో ఉన్న మంత్రులు, పార్టీ ఎంపీలతో సుదీర్ఘంగా చర్చలు జరిపిన కేసీఆర్ ఓ నిర్దిష్టమైన నిర్ణయానికి రాలేకపోయిన్నట్లు తెలుస్తున్నది. చివరకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరుతో ఓ జాతీయ రాజకీయ పార్టీని లేదా వేదికను ఏర్పాటు చేయాలనీ ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. టిడిపి, వైసీపీ, టిఎంసి వంటి పార్టీలు ఆ విధంగానే తమను జాతీయ పార్టీలుగా ప్రకటించుకొని, జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని ప్రయత్నం చేసి ముందడుగు వేయలేకపోవడం తెలిసింది. 
 
తెలంగాణాలో అన్ని సీట్లను గెల్చుకొన్నా 17 సీట్లకు మించి లోక్ సభలో పొందలేని కేసీఆర్ జాతీయ రాజకీయాలలో చూపించగల ప్రభావం గురించి ఎవ్వరు పెద్ద సీరియస్ గా తీసుకోవడం లేదు. అందుకనే గత నెలలో ఢిల్లీలో అర్ధాంతరంగా తన పర్యటనను ముగించుకొని హైదరాబాద్ కు తిరిగి రావలసి వచ్చింది. ఆ తర్వాత మహారాష్ట్ర, బెంగాల్, బీహార్ లలో పర్యటనకు వెళ్ళబోతున్నట్లు సంకేతాలు ఇచ్చినా వెళ్ళాక పోవడం గమనార్హం. 
 
జాతీయ రాజకీయాలలో భూమిక కోసం 2019 ఎన్నికల ముందు కాలం నుండి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అవేమి ఎటువంటి ఫలితాలు ఇవ్వలేక పోతున్నాయి. దేశంలో కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని, దానితో మరో జాతీయ పార్టీకి అవకాశం ఉన్నదనే వాదనలను మమతా వంటి వారు చేసికూడ ఎటువంటి ప్రభావం చూపలేక పోతున్నారు. 
 
రాష్ట్రంలో తన ప్రభుత్వంపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను కేంద్రంలోని మోదీ ప్రభుత్వపై వేలెత్తి చూపడం ద్వారా దృష్టి మళ్లించాలని ప్రయత్నాలు సహితం నిష్ప్రయోజనం అని పలు సందర్భాలలో స్పష్టమైనది. మరోవంక జాతీయ రాజకీయాల పేరుతో ముఖ్యమంత్రి పదవిని కొడుకుకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తే సొంత పార్టీలోనే తిరుగుబాటు ఎదురయ్యే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 
 
ఈ సందర్భంగా ఎటువంటి అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోవడానికి బిజెపి సిద్ధంగా ఉంది. ఈ పరిణామాలు సహజంగానే కేసీఆర్ కు పెను సవాళ్లు విసురుతున్నాయి.