ఒకటి, రెండు రోజుల్లో రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్

భారత రాష్ట్రపతి ఎన్నికల నిర్వహణకు భారత ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తున్నది. ఒకటి, రెండు రోజులలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. జులై 25వ తేదీతో ప్రస్తుత  రాష్గ్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ప‌ద‌వీ కాలం ముగియనుంది.  ఈ నేపథ్యంలో ఆ లోగా రాష్ట్రపతి ఎన్నిక పూర్తి కావలసి ఉంది.
రాష్ట్రపతి ఎన్నికల కోసం ఈసారి 776 మంది ఎంపీలు, 4120 ఎమ్మెల్యేలు ఓటు వేయ‌నున్నారు. మొత్తం ఓట్ల విలువ 10,98,903గా ఉండబోతుండగా.. అందులో  ఎంపీ ఓటు విలువ 708గా ఉంది. అత్య‌ధికంగా యూపీ ఎమ్మెల్యే ఓటు విలువ 208గా ఉండనుంది.
తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి బిజెపికి నాలుగైదు శాతం ఓట్లు తక్కువగా ఉన్నప్పటికీ కొన్ని కాంగ్రెసేతర రాజకీయ పార్టీల మద్దతుతో తమ అభ్యర్థిని సునాయాణంగా గెలిపించుకునే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఓడిశాలోని బిజెడి, ఆంధ్ర ప్రదేశ్ లోని వైసిపి వంటి పార్టీల మద్దతు లభించే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ నాయకులు ఆయా పార్టీలను సంప్రదించినట్లు తెలుస్తున్నది.
రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించినా కాగల అభ్యర్థుల పేర్ల గురించి ఎటువంటి సంకేతం ఇవ్వలేదు. ఈ సందర్భంగా పలు పేర్లు మీడియాలో ప్రత్యక్షం అవుతున్నాయి. ప్రస్తుత రాష్ట్రపతికి మరోసారి అవకాశం ఇస్తారా? ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడుకు రాష్ట్రపతిగా అవకాశం ఇస్తారా? అనే విషయం కూడా తెలవలసి ఉంది.
వెంకయ్య నాయుడు పదవి కాలం సహితం ఆగష్టులో పూర్తి కానున్నది. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సహితం బిజెపి సిద్దపడుతున్నది. రాష్ట్రపతి ఎన్నికలలో ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థిని నిలబెట్టాలని గత ఏడాది కాలంగా సమాలోచనలు జరుగుతున్నా ఎటువంటి నిర్ణయానికి వచ్చిన దాఖలాలు లేవు.
ఈ విషయమై తాజాగా ప్రతిపక్షాల మధ్య ఎటువంటి సంప్రదింపులు ప్రారంభం కాలేదు. కాంగ్రెస్ నిలబెట్టే అభ్యర్ధికి ఆప్, టి ఆర్ ఎస్ వంటి పార్టీల మద్దతు లభించే అవకాశం లేదు. టిఎంసి సహితం కాంగ్రెస్ తో సంబంధం లేని అభ్యర్ధికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది.