సల్మాన్​ఖాన్​, పంజాబ్ సీఎం మాన్ లకు బెదిరింపులు

సల్మాన్​ఖాన్​, పంజాబ్ సీఎం మాన్ లకు బెదిరింపులు
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, అతడి తండ్రి సలీమ్ ఖాన్ ని చంపేస్తామని కొందరు దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. పంజాబ్ సింగర్ సిద్ధూకి పట్టిన గతే మీకు కూడా పడుతుందని ఓ లేఖను పంపించారు. ఈ లేఖతో అప్రమత్తమైన సల్మాన్బాం ద్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. 
 
కాగా, సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ రోజూ ఉదయాన్నే వాకింగ్ కి వెళ్తారు. ఆ సమయంలో ఒక  చోట  బ్రేక్ తీసుకుంటారు. సలీమ్ ఎక్కడైతే బ్రేక్ తీసుకుంటారో అక్కడే ఓ బెంచ్ మీద ఈ బెదిరింపు లేఖ దొరికింది. అందులో మూస్ వాలాను చంపినట్లే చంపేస్తామని రాసి ఉంది. ఈ కేసుపై దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఎంక్వయిరీ చేయడం మొదలుపెట్టారు.
 
బెదిరింపు లేఖను ఎవరు పెట్టి ఉంటారని..? స్థానికులను విచారణ చేస్తున్నారు. మరోపక్క సల్మాన్ ఖాన్ కి, అతడి తండ్రికి భద్రతను  పెంచారు. కొన్ని రోజుల క్రితం పంజాబ్ సింగర్ సిద్ధూ మూస్ వాలాను తన సొంత విలేజ్ లో చంపేశారు. బిష్ణోయ్ గ్రూప్ సిద్ధూని చంపినట్లుగా వెల్లడించింది. ఇప్పుడు వారే సల్మాన్ ని కూడా బెదిరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 
 
గతంలో కూడా సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. కృష్ణ జింకను దైవంగా భావించే లారెన్స్ బిష్ణోయ్.. కృష్ణజింకల వేట కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సల్మాన్‌ను చంపేస్తామని కోర్టు ఆవరణలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు. బిష్ణోయ్ ముఠా.. సల్మాన్ హత్యకు ప్లాన్ చేశారని, పోలీసులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారని చెబుతుంటారు.
పంజాబ్ సీఎంకు తీవ్ర బెదిరింపులు 
 
మరోవంక, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగ్‌వంత్‌ సింగ్‌ మాన్‌కు సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎ్‌ఫజే) సంస్థ నుంచి తీవ్ర బెదిరింపులు ఎదురయ్యాయి. ‘‘స్వర్ణ దేవాలయం నుంచి బలగాలను ఉపసంహరించాలి. ఖలిస్థానీ అనుకూల శక్తులకు వ్యతిరేకంగా నడుచు కోవడం ఆపేయాలి. లేకపోతే మాజీ సీఎం బియాంత్‌ సింగ్‌కు పట్టిన గతే మీకూ పడుతుంది. మా హెచ్చరికలను బేఖాతరు చేస్తే జరిగే పరిణామాలకు సిద్ధంగా ఉండాలి’’ అని ఎస్‌ఎ్‌ఫజే చీఫ్‌ గుర్‌పత్వంత్‌ పన్నూ ఒక వీడియోలో బెదిరించారు. 
 
అలాగే ఖలిస్థానీ రెఫరెండంపై ఓటింగ్‌ తేదీని సోమవారం అకల్‌ తఖ్త్‌ వద్ద ప్రకటిస్తామని ఆయన తెలిపారు. 1995 ఆగస్టులో నాటి పంజాబ్‌ సీఎం బియాంత్‌ సింగ్‌ కారుబాంబు దాడిలో హత్యకు గురయ్యారు. కాగా, సీఎం భగ్‌వంత్‌ ఆదివారం అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. ప్రార్థనల తర్వాత అకల్‌ తఖ్త్‌ జతీందర్‌ వాసానికి వెళ్లి సమావేశమయ్యారు. మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.