నూపుర్ శర్మకు థానె పోలీసులు సమన్లు 

మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెండయిన ఆ పార్టీ ప్రతినిధి నూపుర్ శర్మకు థానె పోలీసులు సమన్లు పంపారు. ఈనెల 22న తమ ముందు హాజరుకావాలంటూ ముంబ్రా పోలీసులు మెయిల్, పోస్ట్ ద్వారా సమన్లు పంపారు. ముంబ్రా పోలీస్ స్టేషన్‌లోనే కాకుండా ముంబై పైధోని పోలీస్ స్టేషన్‌లోనూ నుపుర్‌పై కేసు నమోదయింది.

మరోవైపు, తనను చంపుతామని  బెదరింపు కాల్స్ వస్తున్నాయని నుపుర్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉగ్ర సంస్థ ఎంజీహెచ్‌ తాజాగా ఆమెకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.  ముహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల చేసినందుకుగానూ బేషరతుగా ప్రపంచానికి క్షమాపణ చెప్పాలని ఒక బెదిరింపు ప్రకటన విడుదల చేసింది ఆ ఉగ్ర సంస్థ.

‘‘నూపుర్‌ శర్మ తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలి. మొత్తం ప్రపంచానికి క్షమాపణలు చెప్పాలి. లేకుంటే.. ప్రవక్తను అగౌరవపరిచినందుకు ఏం చేయాలో అది చేస్తాం’’ అంటూ  టెలిగ్రామ్‌లో ఒక ప్రకటన విడుదల చేసింది ఎంజీహెచ్‌.  కశ్మీర్‌లో క్రియాశీలకంగా వ్యవహరించే ఈ ఉగ్రసంస్థ ఈ ఏడాది జనవరిలో ఢిల్లీ ఘాజీపూర్‌ పూల మార్కెట్‌లో ఐఈడీ పేలుడుకు పాల్పడింది.

తనను చంపుతామంటూ బెదరింపు కాల్స్ వస్తున్నాయంటూ నుపర్ శర్మ ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు భద్రత కల్పించారు. కాగా, తన చిరునామాను బహిర్గతం చేయవద్దని మీడియా సంస్థలు, ప్రజలకు నుపుర్ శర్మ ఒక ట్వీట్‌లో విజ్ఞప్తి చేశారు.

బిజెపి దిద్దుబాటు చర్యలు 

మరోవంక, బీజేపీ  దిద్దుబాటు చర్యలకు దిగింది. నూపుర్‌ శర్మ వ్యాఖ్యల వ్యవహారం లాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. ఇక నుంచి ఆచితూచి వ్యవహరించాలని ఆదేశించింది. బీజేపీ అధికార ప్రతినిధులు, ప్యానెలిస్టులు మాత్రమే టీవీ డిబేట్లలలో పాల్గొనాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. వాళ్లను ఎంపిక చేసి పంపించే బాధ్యతను మీడియా సెల్‌కు అప్పజెప్పింది. 

అంతేకాదు టీవీ డిబేట్లను వెళ్లే ప్రతినిధులు ఎవరైనా సరే.. మతపరమైన చర్చ జరపకూడదని తాజా ఆదేశాల్లో స్పష్టం చేసింది. ‘‘నిగ్రహ భాష ఉపయోగించండి. ఉద్రేకంగా మాట్లాడొద్దు. ఆందోళన చెందొద్దు. ఎవరి ప్రోద్బలంతో కూడా పార్టీ భావజాలాన్ని, సిద్ధాంతాలను ఉల్లంఘించవద్దు’’ అని స్పష్టం చేసింది. 

అంతేకాదు పార్టీ లైన్‌కు అనుకూలంగా నడుచుకోవాలని, డిబేట్‌లకు వెళ్లే ముందు అంశంపై పూర్తిస్థాయి పరిజ్ఞానంతోనే ముందుకు వెళ్లాలని సూచించింది. టీవీ డిబేట్‌లో పాల్గొనే ప్రతినిధులు పార్టీ ఎజెండా నుంచి పక్కదారి పట్టకూడదని,  ఎవరు రెచ్చగొట్టినా ఉచ్చులో పడి వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించింది.