క్రికెట్ నుండి మిథాలీరాజ్ నిష్క్రమణ

భారత మహిళా జట్టు సీనియర్ క్రికెటర్ మిథాలీరాజ్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేసింది.  అంతర్జాతీయ క్రికెట్‌కు ఆమె వీడ్కోలు పలికారు. తాను అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నానని ట్విట్టర్ వేదికగా బుధవారం మిథాలీ ప్రకటించింది. మిథాలీ రెండు దశాబ్దాలకు పైగా భారత క్రికెట్ కు సేవలందించారు. ఈ సందర్భంగా భారత క్రికెట్‌ నియంత్రణ మండలి, కార్యదర్శి జై షాకు మిథాలీ అందించిన సేవలకు గాను ధన్యవాదాలు తెలిపారు.

క్రికెటర్‌గా సుదీర్ఘ ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. జీవితంలో రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టాలనుకుంటున్నానని చెబుతూ అప్పుడు కూడా ఇలాగే తనపై ప్రేమను కురిపిస్తూ అండగా నిలవాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు.

 ‘‘ఇండియా జెర్సీ వేసుకుని దేశానికి ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. నా ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. 23 ఏళ్లుగా ప్రతి సవాలును ఎదుర్కొంటూ జీవితాన్ని ఆస్వాదిస్తూ వచ్చాను. ప్రతి సవాల్ నుంచి గొప్ప అనుభవం గడించాను. ప్రతి ప్రయాణం లాగే ఇది కూడా ఏదో ఒకరోజు ముగించాల్సిందే కదా!” అంటూ ఆమె ట్వీట్ చేశారు.

“ఈరోజు నేను అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నాను. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నాను. మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారి నా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి జట్టును గెలిపించాలని భావించేదానిని. ఇప్పుడిక ఆటకు వీడ్కోలు పలికే సమయం వచ్చింది. ఎంతో మంది ప్రతిభావంతులైన యువ క్రికెటర్లు రావాలి. భారత మహిళా క్రికెట్‌ భవిష్యత్తు దేదీప్యమానంగా వెలిగిపోవాలి’’ అంటూ మిథాలీ భావోద్వేగ నోట్‌ షేర్‌ చేశారు.

2019లో టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మిథాలీ తాజాగా వన్డే, టెస్టులకు కూడా గుడ్‌ బై చెప్పారు. 1999లో అరంగ్రేటం చేసిన మిథాలీ రాజ్‌ భారత మహిళా జట్టు కెప్టెన్‌గా ఎదిగారు. 232 వన్డేల్లో 7805 పరుగులు సాధించారు. భారత్‌ తరఫున 12 టెస్టులు, 89 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడారు. 

12 టెస్టుల్లో మిథాలీరాజ్‌ 699 పరుగులు చేసింది. ఇక 232 వన్డేల్లో మిథాలీరాజ్‌ 7805 పరుగులు సాధించింది. వన్డేల్లో ఇన్ని పరుగుల మైలురాయిని అధిగమించిన ఏకైక మహిళా క్రికెటర్‌ మిథాలీనే కావడం విశేషమని చెప్పుకోవచ్చు. 89 టీ-20ల్లో ఈమె 2364 పరుగులు చేసింది.

తొమ్మిదేళ్ల వయసులోనే క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఈమె ప్రపంచ మహిళల క్రికెట్‌లో తన సత్తా ఏంటో చూపించింది. తన 23 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో అద్భుతాలు సాధించింది. అయితే 2017లోనే రిటైర్మెంట్ తీసుకోవాలని మిథాలీ భావించిందని, మనసు మార్చుకుని కెరీర్‌ను కంటిన్యూ చేసినట్లు ఆమె తల్లి చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

క్రికెటర్‌గా తన ప్రయాణం ముగిసినా ఆటలో ఏదో విధంగా భాగస్వామ్యం అవుతానంటూ భవిష్యత్‌ ప్రణాళికల గురించి సంకేతం  ఇచ్చారు. భారత మహిళా క్రికెట్‌కు సేవలు అందించడంలో తన వంతు పాత్ర పోషిస్తానని ఆమె పేర్కొన్నారు. తనకు అండగా నిలిచి ఆదరాభిమానాలు చూపిన అభిమానులకు ఆమె  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.