గ్యాంగ్ రేప్ ముందు పబ్ లో ఇంటర్ విద్యార్థుల పార్టీ

రాజకీయ దుమారంకు దారితీస్తున్న జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ లో జరిగిన పార్టీ ఇంటర్ విద్యార్థులకు వీడ్కోలు పలకడం కోసం జరిగిన్నట్లు పోలీస్ దర్యాప్తులు వెల్లడైన్నట్లు తెలుస్తున్నది. ఓ కార్పొరేట్ స్కూల్ పార్టీ కోసమే ఈ పబ్‌ను బుక్ చేసుకున్నట్టు తెలుస్తోంది. 150 మంది విద్యార్థుల  కోసం ఈ ప‌బ్ బుక్ చేసినట్లుగా ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.
నిషాన్, అయాన్, ఆదిత్య అనే వ్యక్తులు పార్టీ కోసం బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం వారు రూ.2 లక్షలు కూడా చెల్లించినట్టు సమాచారం. వీరంతా ఇంట‌ర్ రెండో సంవత్సర విద్యార్థులు  అని తెలుస్తోంది.   మే 28న మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పబ్‌లో పార్టీ జరిగినట్లు సమాచారం. పబ్‌లో ఇంటర్ విద్యార్థుల  పార్టీ నిర్వహణ ఏమిటని  విద్యార్ధుల తల్లిదండ్రులతో పాటు, పలువురు  మండిపడుతున్నారు.
హైదరాబాద్ నగరంలో పబ్ ల నిర్వహణ ఎంత విచ్చలవిడిగా సాగుతుందో ఈ విషయం వెల్లడి చేస్తుంది. ఇక ఈ గ్యాంగ్ రేప్   కేసులో అయిదుగురు నిందితులను  గుర్తించగా, ముగ్గురు శ‌నివారం సాయంత్రం కోర్టులో జూబ్లీ హిల్స్ పోలీసులు హాజరుపరిచారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు, ఒక మేజర్‌ కాగా.. ఇద్దరు మైనర్లను జువైనల్‌ హోమ్‌కు తరలించారు. వీరిలో ఒకరు వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ కుమారుడు. మరో మైనర్‌ నెల్లూరు పారిపోతుండగా పట్టుకున్నారు.
నిందితుడు మాలిక్‌కు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ను కోర్టు విధించింది. ఐదో నిందితుడైన మైనర్‌ను సంగారెడ్డి ప్రజా ప్రతినిధి కుమారుడిగా పోలీసులు గుర్తించారు. అతడిని శనివారం రాత్రి అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
ఆరో నిందితుడిగా ఎమ్యెల్యే కుమారుడు!
 
కాగా, కేసులో హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడి పేరు ప్రముఖంగా వినిపించింది. తొలుత.. సీసీ ఫుటేజీ పరిశీలన ద్వారా అతడికి సంబంధం లేదని పోలీసులు తేల్చి చెప్పారు. బాలికతో అతడు కూడా పబ్‌ నుంచి బేకరీకి వెళ్లాడు. తిరిగి వచ్చినప్పుడు మాత్రం ఇన్నోవా వాహనం ఇవ్వలేదు. దీంతో అతడి పాత్ర నిర్ధారణ కాలేదని పశ్చిమ మండలం డీసీపీ జోయల్‌ డేవిస్‌ శుక్రవారం ప్రకటించారు. 
 
అయితే,  బాలికతో కలిసి ఎమ్మెల్యే కుమారుడు బెంజ్‌ కారులో ప్రయాణిస్తున్న చిత్రాలను  బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు మీడియాకు విడుదల చేయడంతో పోలీసులకు దిక్కుతోచలేదు. ఎమ్మెల్యే కుమారుడు స్పష్టంగా కనిపిస్తున్నా ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు. 
 
ఆ వీడియోను చూసిన పోలీసులు మైనర్‌ అయిన ఎమ్మెల్యే కుమారుడి పేరును ఎ-6 గా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చక తప్పడం లేదు. 
ఈ నేపథ్యంలో బాధితురాలి వద్ద పోలీసులు మరోసారి వాగ్మూలం తీసుకోనున్నారు. ఈ ప్రక్రియ అనంతరం ఎమ్మెల్యే కుమారుడి పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చుతారని చెబుతున్నారు. బాధితురాలి వాగ్మూలాన్ని సెక్షన్‌ 164 కింద జడ్జి ఎదుట రికార్డు చేయడానికి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి బాలికపై జరిగిన అఘాయిత్యానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను బహిర్గతం చేయడంతో ఇంటెలీజెన్స్‌ వర్గాలు ఉలిక్కి పడ్డాయి. కేసు ప్రాధాన్యత నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి ఆనవాళ్ళు బహిర్గతం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏకంగా కారులో బాలికపై యువకులు జరిపిన అఘాయిత్యానికి సంబంధించిన పుటేజీ వెలిక్కి రావడం పట్ల అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
 
అత్యంత పకడ్బంధీగా కేసు దర్యాప్తు జరుగుతున్న తరుణంలో ఏకంగా కారులో అమ్మాయిపై జరిపిన లైంగిక దాడికి సంబంధించిన పుటేజీ ఎలా బహిర్గతమైందన్న అంశంపై కలవర పడుతున్నారు.  ఇంటెలిజెన్స్‌లోని కొంతమంది ఈ పుటేజీని ఎమ్మెల్యేకు చేరవేశారన్న అనుమానాలను అధికారులు వ్యక్తం చేశారు. అందుకనే వీడియో లీకేజీలపై అంతర్గత విచారణ జరపాలని నిర్ణయించిన్నట్లు తెలిసింది. 
మరోవైపు నిందితుల వినియోగించిన ఇన్నోవా ఆచూకీ లభ్యం కావడంతో క్లూస్ టీం నిపుణులతో ఆధారాలు సేక‌రిస్తోంది. కాగా, ఈ కేసుకు సంబంధించి డీజీపీ మహేందర్ రెడ్డిని బీజేపీ నేతలు కలిసి బాలికపై అత్యాచారం కేసును సీబీఐకి బదిలీ చేయాలని వినతిపత్రం సమర్పించారు.