బిజేపిలో ఐదుగురు పంజాబ్ కీలక కాంగ్రెస్ నేతలు 

ఇప్పటికే పంజాబ్ లో అధికారం కొల్పోయిన కాంగ్రెస్ కు ఇప్పుడు వరుస షాక్ లు తగులుతున్నాయి. మాజీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు  సునీల్ జాఖ‌డ్ గత నెలలో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరగా, మరో ఐదుగురు కీలకమైన నేతలు ఇప్పుడు పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. 

పంజాబ్ మాజీ మంత్రులు గురుప్రీత్ సింగ్ కంగ‌ర్‌, బ‌ల్బీర్ సింగ్ సంధూ, రాజ్ కుమార్ వెర్కా, సుంద‌ర్ శ్యామ్ అరోరా, మాజీ ఎమ్మెల్యే కేవ‌ల్ సింగ్ ధిల్లాన్ కాంగ్రెస్ ను వీడి శ‌నివారం బీజేపీలో చేరారు. చండీగఢ్‌లోని పార్టీ కార్యాలయంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సమక్షంలో వీరంతా బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు.

మొహాలీ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బల్బీర్ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిగా పనిచేయగా, రాంపుర ఫుల్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గుర్‌ప్రీత్ కంగర్ రెవెన్యూ మంత్రిగా ఉన్నారు. ఇక మజా ప్రాంతానికి చెందిన వెర్కా గత ప్రభుత్వంలో సామాజిక న్యాయ, మైనారిటీల మంత్రిగా ఉన్నారు.  

హోషియార్‌పూర్ మాజీ ఎమ్మెల్యే సుందర్ శామ్ అరోరా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ మంత్రిగా పనిచేశారు. కాగా ఈ ఎడాది జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నలుగురు నేతలు ఓడిపోయారు. అటు కాంగ్రెస్‌ పార్టీకి ఇలాంటి కీలకమైన నేతలు ఉద్వాసన పలకడం ఆ పార్టీ అగ్ర నాయ‌క‌త్వానికి ఆందోళ‌న క‌లిగిస్తోంది. కాగా, శిరోమణి అకాలీదళ్ మాజీ నేత రంజిందర్ సింగ్ శిరసా కూడా బీజేపీలో చేరారు. 

 అమిత్ షాను కలిసిన  మూసేవాలా తల్లిదండ్రులు 

ఇలా ఉండగా, ఇటీవల దారుణ హత్యకు గురైన పంజాబీ సింగర్ సిధు మూసేవాలా తల్లిదండ్రులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. శనివారం ఉదయం చండీగఢ్ కు వచ్చిన అమిత్ షాతో వారు విమానాశ్రయంలో భేటీ అయ్యారు. తమ కుమారుడి హత్యపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని వారు కోరారు. 

ఈ సందర్భంగా మూసేవాలా గురించి వివరిస్తూ ఆయన తండ్రి భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు. రెండు చేతులు జోడించి ఎలాగైనా తమకు న్యాయం చేయాలని అమిత్ షాను కోరారు. తమ కుమారుడికి ఆప్ ప్రభుత్వం భద్రతను ఉపసంహరించిన 24 గంటల్లోపే ఈ హత్య జరిగిందని గుర్తు చేశారు.

కాగా, కొన్ని రోజుల క్రితం సిధు మూసేవాలా తల్లిదండ్రులను కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ పరామర్శించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసే అవకాశాన్ని కల్పించాలని ఆ సందర్భంగా మూసేవాలా తల్లిదండ్రులు షెఖావత్ కు విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన షెఖావత్ ఈనెల 4న (శనివారం) చండీగఢ్ కు అమిత్ షా వస్తున్నారని, అప్పుడు కలిసేందుకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే అమిత్ షా ను వారు కలిసే ఏర్పాటు చేశారు.