గ్యాంగ్ రేప్ ఫోటోలు, వీడియో విడుదల చేసిన బిజెపి ఎమ్యెల్యే 

తెలంగాణలో తీవ్ర కలకలం రేపుతున్న రాజధాని నడిరోడ్డుపై జరిగిన మైనర్‌ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనకు సంబంధించి ఫొటోలు, వీడియోలను బీజేపీ ఎమ్మెల్యే ఎన్  రఘనందనరావు విడుదల చేశారు.

“రెడ్  కలర్ మెరిసిడెస్ బెంజ్‌ కారులో ఎంఐఎం ఎమ్మెల్యే  కొడుకు ఉన్నాడు. నేను చూపిస్తున్న ఈ ఫోటోలో ఉన్నది ఎమ్మెల్యే కొడుకు అవునో కాదో పోలీసులు చెప్పాలి..?” అంటూ సవాల్ చేశారు. “ఈ  ఘటనలో ఎమ్మెల్యే కొడుకు లేదని  పోలీస్ అధికారులు ఎలా చెప్తారు..?. కోర్టు మాత్రమే చెప్పగలదు. జడ్జిమెంట్ ఇచ్చే అధికారం ఐపీఎస్ అధికారికి ఎక్కడిది..?” అంటూ ప్రశ్నించారు.

తన దగ్గరున్న సాక్ష్యాలను డీజీపీకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నానని చెబుతూ విచారణ పారదర్శకంగా చేయాలని డీసీపీ జోయల్ డేవిస్‌ను రఘునందన్ రావు కోరారు.  ఈ కేసును సీబీఐతో విచారణ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఒక వేళ ఇది జరగకుంటే తానే స్వయంగా సుప్రీంకోర్టకు వెళ్తానని ఆయన స్పష్టం చేశారు. సెట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సీజేఐ ఎన్వీ రమణకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

గ్యాంగ్ రేప్ చేసిన వారిని ఎందుకు రహస్యంగా దాస్తున్నారని మండిపడ్డారు. నిర్భయ కేసులో మైనర్ల పేర్లు బయటకు వస్తున్నాయని చెబుతూ మరి నిందితుల ఫోటోలు ఎందుకు చూపించడంలేదని ఆయన ప్రశ్నించారు. అసలు ఈ కేసులో నిందితులు మైనారా.. మేజరా.. అన్నది ప్రశ్న కాదని స్పష్టం చేశారు. పోలీసులు నిందుతులను బహిరంగంగా అరెస్టు చేసినట్లు ఎక్కడా రాలేదని గుర్తు చేశారు.

అవసరమైతే టీఆర్ఎస్ వాళ్లును రిమాండ్ చేస్తారు కానీ ఎంఐఎంను ఎందుకు చేయరు? అంటూ కేసీఆర్ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. ఈ కేసులో నిందితులెవరో తెలుసుకోవాలనుకుంటున్నామని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.

“రెడ్ కలర్ మెర్సిడెస్ బెజ్ కారులో ఈ ఘటన జరిగింది. కానీ పోలీసులు ఇన్నొవాలో ఉన్నవారిని అరెస్టు చేశారు. ఈ కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు, హోంమంత్రి మనవడు ఉన్నారు. రెడ్ కల్లర్ బెంజ్ కారులో ఏం జరిగిందో మా దగ్గర వీడియోలు ఉన్నాయి” అని రఘునందన్ రావు వెల్లడించారు. ఈ కేసులో దోషులను అరెస్టు చేసి శిక్ష విధించేదాక పోరాడుతామని తేల్చి చెప్పారు. 

తప్పు చేసిన వారందరినీ శిక్షించాలని కేటీఆర్ ట్వీట్ చేశాడు. కానీ సొంత పార్టీ వాళ్ళను బొందపెట్టి, కేటీఆర్ ప్రతిపక్షాలను కాపాడుతున్నాడని బిజెపి ఎమ్యెల్యే ఎద్దేవా చేసారు. పోలీసులు కూడా ఎంఐఎం నేతల పిల్లలను వదిలేసి దర్యాప్తు చేస్తున్నారు?  పోలీసులను కీలు బొమ్మలుగా, రజాకార్ల వారసులు వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బిజెపి నేత ఈ ఫోటోలను విడుదల చేయడంతోరాష్ట్ర పోలీస్ వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. వెంటనే సీనియర్ పోలీస్ అధికారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సమావేశమై అవి ఏవిధంగా లీక్ అయ్యాయో తెలియక తలపట్టు కొంటున్నారు.

సిబిఐ దర్యాప్తుకై కేసీఆర్ కు సంజయ్ లేఖ 

గ్యాంగ్ రేప్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ  సీఎం కేసీఆర్ కు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ లేఖ రాశారు. సంఘటన జరిగి నాలుగు రోజులు కావొస్తున్నా పోలీసుల తీరు అనేక అనుమానాలకు తావిస్తోందని తెలిపారు. అత్యాచార ఘటనలో రాష్ట్ర హోం మంత్రి మనవడు, ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు, వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారుడు, ఇంకా టీఆర్ఎస్ నాయకులు ప్రమేయం ఉన్నట్లు మీడియాలో అనేక వార్తలు వస్తున్నాన్పప్పటికీ  నిందితుల వివరాలు ఇప్పటి వరకు బయటపెట్టకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు.

కాగా, జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ ముట్టడికి జనసేన కార్యకర్తలు యత్నించారు. ఈ కేసులో ప్రధాన నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని జనసేన కార్యకర్తలు ఆరోపించారు. దోషులు ఎంతటివారైనా అరెస్ట్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. రాజకీయ ఒత్తిళ్లతోనే పోలీసులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని జనసేన కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు, అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు.