అమ‌ర్‌నాథ్ యాత్ర‌కు భద్రత కట్టుదిట్టం

కాశ్మీర్ లో జరిగిన వరుస హత్యల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ హత్యలను నివారించేందుకు కట్టుదిట్టమైన చర్యలు ఒక వంక చేబడుతూ, మరోవంక ఈ నెల 30 నుండి ప్రారంభం కానున్న  అమరనాథ్ యాత్రకు భద్రతను పటిష్ట పరిచారు. స్వయంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా గత పక్షం రోజులలో రెండు సార్లు ఈ విషయమై అత్యున్నతస్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి సమీక్ష జరిపారు.

శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ  సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే, జమ్ము కశ్మీర్‌ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్, ఆర్‌ అండ్‌ ఏడబ్ల్యూ చీఫ్‌ సమంత్‌ సమంత్‌ గోయల్‌ హాజరయ్యారు. కశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితులు, పౌరుల భద్రత, ఉగ్రవాదుల దాడులను ఎదుర్కొనేందుకు అమలు చేసే వ్యూహాలపై సమీక్షించారు.

లోయలో కొందరు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అల్లకల్లోలం స్రుష్టించాలని చూస్తున్నా జూన్ 30వ తేదీ నుంచి ఆగ‌స్టు 11వ తేదీ వ‌ర‌కు అమ‌ర్‌నాథ్ యాత్ర‌ను షెడ్యూల్ ప్ర‌కారం నిర్వ‌హించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు ఈ ప్రాంతంలో భద్రతను పెంచనున్నట్లు తెలిపారు.

దీంతో టార్గెట్ చేసి జరుపుతున్న హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్న ఘ‌ట‌న‌ల‌ను నిరోధించవ‌చ్చని భావిస్తున్నారు. అమర్ నాథ్ యాత్రను ఎలాగైనా అడ్డుకోవాలని పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు ఈ హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే పండిట్ల‌పై దాడులు జ‌రుగుతున్న‌ట్లు వారంటున్నారు.

ఇలా  ఉండగా, లక్షిత హత్యలు పెరుగుతున్న నేపథ్యంలో 177 మంది కశ్మీరీ పండిట్ ఉపాధ్యాయులను బదిలీ చేస్తూ   జమ్మూకశ్మీర్ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీనగర్‌లో పనిచేస్తున్న 177 మంది కశ్మీరీ పండిట్ ఉపాధ్యాయులను లోయ నుంచి ప్రభుత్వం బదిలీ చేసింది. బదిలీ చేయడంతో కశ్మీరీ పండిట్ ఉపాధ్యాయులు ఊపిరిపీల్చుకున్నారు. 

ప్రజలెవరూ భయాందోన చెందాల్సిన అవసరం లేదని, అమ‌ర్‌నాథ్ యాత్ర నిర్వహించడంలో వెన‌క్కి త‌గ్గేదిలేద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు స్ప‌ష్టం చేశాయి. కట్టుదిట్టమైన భద్రత నడుమ యాత్రను కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది ఇప్ప‌టికే 2.5 ల‌క్ష‌ల మంది యాత్రికులు ఆ యాత్ర‌కు నమోదు చేసుకున్నారు.

కరోనా కారణంగా రెండేళ్లుగా యాత్ర జరగక పోవడం, అంతకు ముందు ఏడాది ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో యాత్రను అర్ధాంతరంగా ముగించి వేయడంతో ఈ సంవత్సరం భారీ స్పందన కనిపిస్తుంది. ఉగ్రవాద చర్యలకు భయపడి క‌శ్మీర్ పండిట్ల‌ను జ‌మ్మూకు త‌ర‌లించేది లేద‌ని ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.

1990 త‌ర‌హా లాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌నివ్వ‌మ‌ని, కానీ పండిట్ల‌ను లోయ‌లోనే సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం చెప్పింది. ఇటీవల జరిగిన దాడులను నిరసిస్తూ ఉద్యోగులు ఆందోళనలను నిర్వహిస్తున్నారు. కశ్మీర్‌ నుంచి తమను జమ్మూకు బదిలీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

గత నెలలో కాశ్మీర్ లోయలోని 350 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, కాశ్మీరీ పండిట్లందరూ మనోజ్ సిన్హాకు రాజీనామాలు సమర్పించారు.    దాదాపు ఆరు వేల మంది హిందూ ఉద్యోగులను ఇప్ప‌టికే మ‌రో ప్రాంతానికి త‌ర‌లించారు. అయితే పర్యటికులు పెద్ద సంఖ్యలో లోయకు వస్తుండటం గమనార్హం.   ఈ ఏడాది జ‌న‌వ‌రి నుంచి మే వ‌ర‌కు క‌శ్మీర్‌కు 10 ల‌క్ష‌ల మంది పర్యటికులు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.