ప్రతీ మసీదులో శివలింగం గురించి వెతకడం ఎందుకు?

దేశంలో పలు మసీదుల మాడుగులలో హిందూ దేవతా విగ్రహాలు ఉన్నట్లు ఆందోళనలు వ్యక్తం అవుతున్న సమయంలో ప్రతి మసీదులో శివలింగం గురించి వెతకడం ఎందుకు అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘచాలకే డా. మోహన్ భగవత్ ప్రశ్నించారు.  నాగపూర్ లో గురువారం సాయంత్రం జరిగిన ఆర్ఎస్ఎస్ తృతీయ శిక్షావర్గ్ ముగింపు కార్యక్రమంలో ప్రసంగిస్తూ  వివాదాన్ని ఎందుకు పెంచాలి? సమిష్టి నిర్ణయంతో జ్ఞానవాపి వివాదానికి  ముగింపు పలకవచ్చు కదా! అని సూచించారు. 
 
‘‘కొన్ని ప్రాంతాల పట్ల ప్రత్యేక భక్తిని కలిగి ఉంటాం. వాటి గురించి ప్రత్యేకంగా మాట్లాడతాం కూడా.  కానీ, ప్రతిరోజూ కొత్త విషయంతో వివాదం రాజేయడం ఎందుకు?..  జ్ఞానవాపి విషయంలో మనకు భక్తి ఉండొచ్చు. అలాగని ప్రతీ మసీదుల్లో శివలింగం వెతకడం ఎంత వరకు సమంజసం?” అని హిందూ సంఘాలను ఆయన ప్రశ్నించారు. 
 
 జ్ఞానవాపి అంశం ఈనాటిది కాదని, ఇప్పుడున్న హిందువులో, ముస్లింలో దానిని సృష్టించింది కాదని ఆయన స్పష్టం చేశారు. ఆ సమయానికి అది అలా జరిగిపోయింది. స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న భారతీయుల స్థైర్యాన్ని దెబ్బతీయడం కోసం దేవాలయాలను ధ్వంసం చేశారని, ఆ విధంగా వేలాది దేవాలయాలను ధ్వంసం చేసారని డా. భగవత్ గుర్తు చేశారు. అయితే విశ్వాసాల రీత్యా ముఖ్యమైన కొన్ని దేవాలయాల పునరుద్ధరణ గురించిన అంశాలను ఇప్పుడు లేవనెత్తుతున్నారని ఆయన చెప్పారు. 
 అలాగని ముస్లింలు అందరినీ అలా చూడాల్సిన అవసరం లేదని  ఆర్ఎస్ఎస్  అధినేత తేల్చి చెప్పారు. మసీదులలో జరిగేది కూడా ఒక రకమైన ప్రార్థన అని చెబుతూ  ఇప్పుడున్న ముస్లింలలో కొందరి పూర్వీకులు కూడా హిందువులే అని తెలిపారు. సమిష్టిగా సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయాలబు సూచించారు.  అందుకు ఒక మార్గం కనిపెట్టాలని,  కుదరనప్పుడు కోర్టులకు చేరాలి. అక్కడ ఎలాంటి నిర్ణయం ఇచ్చినా అంగీకరించి తీరాలి అని స్పష్టం చేశారు.

ఆర్ఎస్ఎస్ ఏ మత  ప్రార్థనా విధానాలకు కూడా వ్యతిరేకం కాదని డా. భగవత్ స్పష్టం చేశారు. అందరినీ అంగీకరిస్తుందని,  అందరినీ పవిత్రంగానే భావిస్తుందని చెబుతూ మతాలకతీతంగా మనమంతా మన పూర్వీకుల వారసులమే అని గుర్తించాలని సూచించారు. 

జ్ఞాన్‌వాపి సమస్యపై ఎటువంటి ఉద్యమాన్ని ప్రారంభించేందుకు ఆర్‌ఎస్‌ఎస్ అనుకూలంగా లేదని ఆయన ప్రకటించారు.  నవంబర్ 9, 2019న అయోధ్యపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత, సంఘ్ మధుర, కాశీ ఉద్యమాలకు దూరంగా ఉండి, “వ్యక్తి నిర్మాణంపై దృష్టి పెట్టాలని సూచించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

“ఈ విషయంపై నేను చెప్పాలి అనుకున్నది నవంబర్ 9న చెప్పాను. చారిత్రక కారణాల వల్ల, కాలావసరాల వల్ల మన స్వభావానికి విరుద్ధంగా రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నాం. ఆ పని పూర్తి చేశాం. మరే ఇతర ఉద్యమాన్ని ప్రారంభించాలనుకోవడం లేదు” అని ఆర్ఎస్ఎస్ అధినేత స్పష్టం చేశారు.