ఉత్తరాఖండ్ లో బిజెపి, కేరళలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు

కేరళలోని త్రిక్కకర శాసన సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార పక్షానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ స్థానం నుంచి  కాంగ్రెస్ అభ్యర్థిని ఉమా థామస్ విజయం సాధించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే పీటీ థామస్ మరణించడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. ఉత్తరాఖండ్‌లోని చంపావత్, ఒడిశాలోని బ్రజరాజ్ నగర్, కేరళలోని త్రిక్కకర శాసన సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు మంగళవారం జరిగాయి.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి చంపావత్ నుంచి భారీ మెజారిటీతో గెలిచారు. ఆయన తన సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 55 వేలకు పైగా ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.  ఫిబ్రవరిలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో ధామి ఖటిమా నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఓడిపోయారు. ఆయన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలంటే ఆరు నెలల్లోగా శాసన సభ్యునిగా ఎన్నికవడం తప్పనిసరి. ఇది రాజ్యాంగ పరమైన అవసరం. 
 
తాజాగా ఆయన విజయం సాధించడంతో ఆయన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడానికి రాజ్యాంగ పరమైన ఇబ్బందులు తలెత్తబోవు. ఈ సందర్భంగా .ధామికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. చంపావత్ మంచి రికార్డు విజయం సాధించినందుకు అభినందనలు తెలియచేస్తున్నట్లు, ఉత్తరాఖండ్ అభివృద్ధికి మరింత కష్టపడి పని చేస్తారని ఆశిస్తున్నట్లు ట్వీట్ లో మోదీ  తెలిపారు.

అలాగే బీజేపీపై విశ్వాసం ఉంచినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. బీజేపీ పార్టీ విజయానికి కృషి చేసిన నేతలు, కార్యకర్తలను అభినందిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. ప్రజలకు సీఎం ధామి కృతజ్ఞతలు తెలిపారు. ఓట్ల ద్వారా తనపై కురిపించిన ప్రేమ, ఆశీర్వాదాలకు కృతజ్ఞుడినని ట్వీట్ లో తెలిపారు. 

కేరళలోని త్రిక్కకరలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిపక్ష కాంగ్రెస్ అభ్యర్థిని ఉమా థామస్ ఈ ఉప ఎన్నికలో విజయం సాధించారు. ఆమెకు తన సమీప ప్రత్యర్థి, వామపక్షాల అభ్యర్థి జో జోసఫ్‌‌పై దాదాపు 25 వేల ఓట్ల ఆధిక్యత లభించింది. 
 
కాగా, ఒడిశాలోని బ్రజ్‌రాజ్ నగర్‌ శాసన సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో 11 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అయితే ప్రధానంగా బీజేడీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ జరిగింది. ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే మరణించడంతో ఆయన సతీమణి అలక మహంతిని అధికార పార్టీ బీజేడీ ఎన్నికల బరిలో  నిలిపింది. అలక మహంతి ఓట్ల లెక్కింపు ప్రారంభంలో ఆధిక్యత కనబరిచారు.