వచ్చే పదేళ్లలో భారత్ కు దిక్సూచి కానున్న ఉత్తర ప్రదేశ్

సంస్కరణ, పనితీరు, పరివర్తన అనే మంత్రాలతో భారతదేశం పురోగమించిందని చెబుతూ వచ్చే పదేళ్లలో భారతదేశానికి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఒక దిక్సూచి అవుతుందని, చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భరోసా వ్యక్తం చేశారు. 

లక్నోలో యూపీ పెట్టుబడుదారుల సదస్సులో సుమారు రూ. 80 వేల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు జరిగాయని, ఇదొక రికార్డు అని కొనియాడారు.  లక్నోలో జరుగుతున్న మూడవ యూపీ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను ప్రధాన మంత్రి ప్రారంభిస్తూ ఈ పెట్టుబడుల ఫలితంగా యువత ఎక్కవ ప్రయోజనం పొందుతారనే ఆశాభావం వ్యక్తం చేశారు. 

 తమ ప్రభుత్వం ఇటీవలే 8 సంవత్సరాల పాలన పూర్తి చేసుకోవడం జరిగిందని గుర్తు చేశారు. సంస్కరణలు, పనితీరు.. ఇతర వాటిని అమలు పరుస్తూ  పురోగించడం జరిగిందని పేర్కొన్నారు. సమన్వయంతో చేసుకుంటూ సులభంగా వ్యాపారం చేయడంపై దృష్టి కేంద్రీకరించామని తెలిపారు. 

ఈ సందర్భంగా, వ్యవసాయం, ఐటీ, రక్షణ సహా విభిన్న రంగాల్లో రూ.80,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఉత్తరప్రదేశ్ యువత సామర్థ్యం, ​​అంకితభావం, కృషి,  అవగాహనపై తమ విశ్వాసాన్ని చూపినందుకు పెట్టుబడిదారులకు ప్రధాన మంత్రి ధన్యవాదాలు తెలిపారు. పారిశ్రామికవేత్తలు కూడా కాశీని సందర్శించాలని కోరారు.

“కాశీ ప్రతినిధిగా, నా కాశీని సందర్శించమని నేను మిమ్మల్ని కోరుతున్నాను. కాశీ, దాని పురాతన వైభవంతో పాటు దానికదే కొత్త రూపంగా ఉద్భవించగలదనే వాస్తవం ఉత్తరప్రదేశ్ సామర్థ్యాలకు సజీవ ఉదాహరణ” అని ఆయన పేర్కొన్నారు.

ఈ సదస్సులో ఆమోదం తెలిపిన ప్రతిపాదనలు ఉత్తరప్రదేశ్‌లో కొత్త అవకాశాలను సృష్టిస్తాయని , ఉత్తరప్రదేశ్ అభివృద్ధి కథలో పెరుగుతున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయని ప్రధాన మంత్రి చెప్పారు.  “ప్రపంచం నేడు వెతుకుతున్న విశ్వసనీయమైన భాగస్వామి  పారామితులను తీర్చగల శక్తి మన ప్రజాస్వామ్య భారతదేశానికి మాత్రమే ఉంది. ఈ రోజు ప్రపంచం భారతదేశ సామర్థ్యాన్ని చూస్తోంది అలాగే భారతదేశ పనితీరును మెచ్చుకుంటుంది” అని  ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు. 

జి20 ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత వేగంగా దేశం అభివృద్ధి చెందిందని, గ్లోబల్ రిటైల్ ఇండెక్స్ లో దేశం రెండో స్థానంలో ఉందని ప్రధాని వెల్లడించారు. భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఇంధన వినియోగదారు దేశం అని ప్రధాని గుర్తు చేశారు.  గత సంవత్సరం, ప్రపంచంలోని 100 కంటే ఎక్కువ దేశాల నుండి రికార్డు స్థాయిలో $84 బిలియన్ల ఎఫ్‌డిఐ వచ్చిందని చెప్పారు. 

గత ఆర్థిక సంవత్సరంలో 417 బిలియన్ డాలర్లు అంటే రూ  30 లక్షల కోట్ల విలువైన వస్తువులను ఎగుమతి చేయడం ద్వారా భారతదేశం కొత్త రికార్డు సృష్టించిందని ప్రధాని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి  యోగి ఆదిత్య నాథ్, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

ఆదానీ రూ 70,000 కోట్ల పెట్టుబడులు 

ఉత్తరప్రదేశ్‌లో రూ.70 వేల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్టు అదానీ గ్రూపుల అధినేత గౌతమ్ అదానీ వెల్లడించారు. ఈ పెట్టుబడులతో యూపీలో దాదాపు 30 వేల ఉద్యోగాల కల్పన జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 

ఇప్పటికే రూ.11 వేల కోట్లు ట్రాన్స్‌మిషన్, గ్రీన్ ఎనర్జీ, వాటర్, అగ్రి-లాజిస్టిక్స్‌తోపాటు తమ డేటా సెంటర్ వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేశామని తెలిపారు. రోడ్డు, రవాణా మౌలికసౌకర్యాలపై మరో రూ.24 వేల కోట్లు, మల్టీమోడల్ లాజిస్టిక్స్‌తోపాటు రక్షణరంగంలో రూ.35 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నామని అదానీ వివరించారు.

కాన్పూర్‌లో దక్షిణాసియాలోనే అతిపెద్ద అమ్మోనియం కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉన్నామని ప్రకటించారు. యూపీ డిఫెన్స్ కారిడార్‌లో ఇదే అతిపెద్ద ప్రైవేటు సెక్టార్ పెట్టుబడి అవుతుందని అదానీ పేర్కొన్నారు