బాలికపై సామూహిక అత్యాచారంలో ఎంఐఎం ఎమ్యెల్యే కొడుకు!

 
హైదరాబాద్‌లోని 17 ఏళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థినిపై శనివారం రాత్రి పబ్‌లో పరిచయమైన కనీసం నలుగురు మైనర్ అబ్బాయిలు కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నేరానికి పాల్పడిన ఐదుగురిలో ఒకరు ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు కాగా, మరొకరు మైనార్టీ కమీషన్ చైర్మన్ కుమారుడని ఆరోపణలు వచ్చాయని బీజేపీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి కె.కృష్ణసాగర్ రావు పేర్కొన్నారు
గత నెల 28న జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబరు 36లోని అమినీషియా పబ్‌లో జరిగిన పార్టీకి వెళ్లింది. కొద్దిసేపు ఉండి పబ్‌ నుంచి బయటకు వచ్చింది. బాలిక పబ్‌ నుంచి బయటకు రాగానే కొందరు యువకులు ఆమెను బెంజ్‌ కారులో  ఎక్కించుకున్నారు. అక్కడి నుంచి బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 14లోని కాన్సు బేకరీ వద్దకు వెళ్లడం.. కొద్ది సేపటి తరువాత ఇన్నోవా కారులో పబ్‌కు రావడం అనుమానాలకు తావిస్తోంది. ఆమె వెళ్తున్న బెంజ్‌ కారులో పాతబస్తీకి చెందిన ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడని సీసీ కెమెరాల ద్వారా తెలుస్తోంది.
ఇంటికి వెళ్లిన బాలిక మెడపై గాట్లు ఉండడం గమనించిన తండ్రి.. ఆమెతో ఉన్న యువకులు అసభ్యంగా ప్రవర్తించారని జూబ్లీహిల్స్‌ పోలీసులకు  ఫిర్యాదు చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదు చేసిన రెండు రోజుల తర్వాత పోలీసులు ఆమెపై అత్యాచారం జరిగిందని ధృవీకరించారు. నిందితులను గుర్తించి, వారిలో ఒకరికి చెందిన కారును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.  అయితే తండ్రి ఫిర్యాదుపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు రాజకీయ వత్తిడులే కారణమని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. 
మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనను కృష్ణసాగర్ రావు తీవ్రంగా ఖండించారు.  బాధితురాలి తల్లిదండ్రులు క్రిమినల్ ఫిర్యాదు చేసినప్పటికీ, నేరస్థుల కారును స్వాధీనం చేసుకున్నప్పటికీ హైదరాబాద్ పోలీసులు ఇంతవరకు నిందితులను అరెస్టు చేయలేదని ఆయన ధ్వజమెత్తారు.
ఈ కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడి ప్రమేయం ఉన్నందున పోలీసులు నెమ్మదిగా చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు.
 కేసులో అరెస్టులు చేసేందుకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ లేదా సీఎం కేసీఆర్ క్లియరెన్స్ కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారా? అని బీజేపీ నేత విస్మయం వ్యక్తం చేశారు.

డే లైట్ హ్యాకింగ్‌లు, మతాంతర హత్యలు, అత్యాచారాల వంటి భయంకరమైన నేరాల పరంపర తెలంగాణకు చెడ్డపేరు తీసుకొస్తున్నట్లు ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చట్టం పట్ల భయం ఉన్నట్లు లేదని దుయ్యబట్టారు. 

తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు రోజురోజుకూ క్షీణిస్తోందని బీజేపీ భావిస్తోందని చెబుతూ సీఎం కేసీఆర్ తన గాఢ నిద్ర నుంచి మేల్కొని సరైన రీతిలో వ్యవహరించాలని కృష్ణసాగర్ రావు డిమాండ్ చేశారు. ఈ కేసులోని మొత్తం ఐదుగురు నిందితులను వెంటనే అరెస్టు చేసి వారికి న్యాయం చేయాలని బీజేపీ డిమాండ్ చేశారు.

కాగా, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పుట్టినరోజు పార్టీకి హాజరయ్యేందుకు ఆ బాలిక స్నేహితురాలుతో కలసి పబ్‌కు వెళ్ళింది. పబ్‌లో, స్నేహితులైన మైనర్‌ల బృందం ఆమెను ఇంటి వద్ద  వదులుతామని చెప్పి కారులో ఎక్కించుకున్నారు. నిందితులు మొదట బేకరీకి వెళ్లి, స్నాక్స్ కొనుగోలు చేసి, ఏకాంత ప్రదేశానికి వెళ్లి అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. 

 
తరువాత రాత్రి, వారు ఆమెను తిరిగి పబ్ వద్ద వదిలివేసి, వేగంగా వెళ్లిపోయారని పోలీసులు చెప్పారు.  మంగళవారం ఫిర్యాదు చేసిన బాలిక తండ్రి, మద్యం లేని పార్టీ కావడంతో తన కుమార్తెను పబ్‌కు వెళ్లనివ్వమని చెప్పారు. చేతులకు గాయాలైన బాలిక  కిందపడిపోవడంతో గాయాలయ్యాయని ప్రాథమికంగా చెప్పింది.
ఆమె మెడ వెనుక గాయాలను గమనించి, మహిళా పోలీసు అధికారులు ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాతే ఆమె తనపై అత్యాచారం జరిగినట్లు వెల్లడించింది. వైద్య పరీక్షల్లో అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారని, బాలిక షాక్‌కు గురై తీవ్రంగా గాయపడిందని పోలీసులు తెలిపారు. పబ్ పరిసరాల్లోని కనీసం ఆరు సీసీటీవీ కెమెరాల నుంచి వీడియో ఫుటేజీని స్వాధీనం చేసుకున్న పోలీసులు కారు డ్రైవర్‌ను ప్రశ్నిస్తున్నారు.