
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా భరోసా వ్యక్తం చేశారు. బిజెపి అధికారంలోకి వచ్చాక తెలంగాణ విమోచనా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు.
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలో జరిపిన తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలలో అమిత్ షా ముఖ్యఅతిధిగా హాజరయి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ అప్పుడప్పుడు వాస్తవాలు చెప్పాలని చురకలు అంటించారు.
తెలంగాణ ఏర్పాటు కోసం ఏళ్లుగా ఉద్యమం జరిగిందని చెబుతూ 2004 నుంచి 2014 వరకు తెలంగాణ డిమాండ్‌ను కాంగ్రెస్ పట్టించుకోలేదని, 2014 ఎన్నికల కోసమే తెలంగాణను హడావిడిగా ప్రకటించారని అమిత్ షా ఆరోపించారు. అన్ని రాష్ట్రాల అభివృద్ధికి మోదీ సర్కార్ కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. తెలంగాణపై ఏనాడూ సవతి తల్లి ప్రేమ చూపించలేదని పేర్కొన్నారు.
2014-15 నుండి 2021-22ల మధ్య తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ 2.52 లక్షల కోట్ల మేరకు వ్యయం చేసిన్నట్లు ఈ సందర్భంగా అమిత్ షా వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చిన నిధుల వివరాలు చదువుతూ పొతే వచ్చే ఎన్నికల ఫలితాలు కూడా ప్రకటించే సమయం వస్తుందని ఆయన చెప్పారు.
వివిధ కార్యక్రమాల కింద కేంద్రం తెలంగాణకు నిధులు సమకూరుస్తున్నదని చెబుతూ తెలంగాణ అభివృద్ధి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడూ ఆసక్తి చూపుతూ ఉంటారని అమిత్ షా స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుండి తమకు ఈ విషయంలో ఆశించిన విధంగా సహకారం లభించడంలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు.
ఏ ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చినా గౌరవిస్తామని చెబుతూరాష్ట్రాల అభివృద్ధితో దేశం పురోగమిస్తుందని తాము నమ్ముతామని షా తేల్చి చెప్పారు. అజాదీ కా అమృత్ మహోత్సవ్ అనేది బీజేపీ కార్యక్రమం కాదని, దేశ స్వాతంత్రం కోసమే పాటు పడి, అమరులైన వారిని స్మరించుకుని వారికీ నివాళులు అర్పించడం కోసమే ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో మంత్రులు జి కిషన్ రెడ్డి, అర్జున్ రామ్ మేఘ్వాల్, మీనాక్షి లేఖి, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు
More Stories
అక్కినేని నాగేశ్వరరావుకు ప్రధాని మోదీ ఘన నివాళి
ప్రైవేటు ఆస్తుల్ని నిషేధిత జాబితాలో చేర్చే అధికారం
హైదరాబాద్ లో పురుషాంగం పునఃసృష్టి