తెలంగాణకు సేవలు చేస్తూ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నా

‘నేను ఈ రాష్ట్రానికి సేవలు చేస్తూ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నాను. కానీ బాధపడడం లేదు. నా సేవలను తెలంగాణ ప్రజలకు అందిస్తూనే ఉంటాను’ అని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, తమిళిసై పుట్టినరోజు సందర్భంగా గురువారం రాజ్‌భవన్‌ అధికారులు రెండు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
తొలుత గవర్నర్‌ తమిళిసైతో కేక్‌ కట్‌ చేయించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అదే సమయంలో ఆమెకు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ, ఇతర రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర మంత్రులు, నేతలు స్వయంగా ఫోన్‌ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
గవర్నర్‌ తమిళిసైకి సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ లేఖను రాజ్‌భవన్‌కు పంపించారు. ప్రజలకు మరింత కాలం సేవ చేసేందుకు భగవంతుడు ఆమెకు ఆశీస్సులు ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. 
 ఎవరు ఆపినా.. తెలంగాణ ప్రజలను కలుస్తానని, కలుస్తూనే ఉంటానని ఆమె స్పష్టం చేశారు. తాను ఈ రాష్ట్రానికి గవర్నర్‌ను మాత్రమే కాదని, ప్రజల సహోదరిని అని తమిళిసై చెప్పారు. ‘నేను ఎవరు ఆపినా… ఆగను కలుస్తాను.. కలుస్తూనే ఉంటాను’అని స్పష్టం చేశారు.
 
ఈ సందర్భంగా తెలంగాణకు చెందిన పలువురు కళాకారులను గవర్నర్‌ సన్మానించారు. అనంతరం ఆమె పూర్తిగా తెలుగులో మాట్లాడారు. ‘అందరికీ నమస్కారం.. ఈ రాష్ట్రం నాది. నేను ఈ రాష్ట్రానికి గవర్నర్‌ను మాత్రమే కాదు. ఈ రాష్ట్రానికి సహోదరిని’అని ప్రసంగం ప్రారంభించారు.
‘రాష్ట్రపతి, ప్రధాని నాకు ఈ రాష్ట్రానికి సేవ చేయడానికి గొప్ప అవకాశం ఇచ్చారు. నేను కూడా ఆ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేస్తున్నాను. రాజ్‌భవన్‌ తరపున చాలా కార్యక్రమాలు చేపట్టాము” అంటూ ఆమె వివరించారు.
 రాజ్‌భవన్‌ స్కూల్‌లో భోజన కార్యక్రమం చేపట్టి, కరోనా కాలంలో నిరి్వరామంగా పర్యవేక్షించాం. భద్రాచలం, ఆదిలాబాద్‌లలో ఆదివాసీ ప్రజలతో సహపంక్తి భోజనం చేసి పౌష్టికాహార కిట్‌లను పంపిణీ చేశాం. పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించాం అని ఆమె వివరించారు. ఎందరో త్యాగశీలుల ఫలితమే నేటి స్వేచ్ఛ తెలంగాణ అని, తెలగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని సంబరంగా జరుపుకుంటున్నామని ఆమె  పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రైస్‌బకెట్‌ చాలెంజ్‌ విసిరిన మంజులతా కళానిధి, తెలుగు సాహిత్యానికి కృషి చేస్తున్న షేక్‌ బడే సాహెబ్‌, వికలాంగుల హక్కుల కార్యకర్త సీహెచ్‌ హిమజ తదితరులను గవర్నర్‌ ప్రత్యేకంగా సత్కరించారు.