జిహెచ్ఎంసి వేధింపులపై గణేష్ విగ్రహ తయారీదారుల ర్యాలీ

తమపై జిహెచ్ఎంసి అధికారుల వేధింపులు ఆపాలని అంటూ గణేష్ విగ్రహ తయారీదారులు నిరసన వ్యక్తం చేశారు. జిహెచ్ఎంసి  హయత్ నగర్ లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహా తయారీదారుల సమావేశాన్ని వారు బహిష్కరించారు.
 అనంతరం విగ్రహ  యారీదారులు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి  ఆధ్వర్యంలో హయత్ నగర్ లోని కర్నాటి గార్డెన్ నుండి హయత్ నగర్ పోలీస్ స్టేషన్ వరకూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు ఎం రామరాజు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శి రావినూతల శశిధర్, ఎల్.బి.నగర్ అసెంబ్లీ కో–కన్వీనర్లు ఎం. వెంకన్న, కె శ్రీధర్ రెడ్డిలతో పాటు పెద్ద ఎత్తున విగ్రహ తయారీదారులు పాల్గొన్నారు .
 
 ఈసందర్భంగా  శశిధర్ మాట్లాడుతూ గణేష్ విగ్రహా తయారీదారులపై జిహెచ్ఎంసి వేధింపులకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. కార్పొరేషన్  అధికారులు చట్ట ప్రకారం పనిచేస్తున్నారా ? లేదంటే ఎఐఎంఐఎం ఆదేశాల ప్రకారం పని చేస్తున్నారా? అని ప్రశ్నించారు. 
 
హిందూ వ్యతిరేక ఎజెండాలో భాగంగానే భాగ్యనగర్ లో ఘనంగా నిర్వహించే గణేష్ ఉత్సవాలను ఆపాలని కొన్ని హిందూ వ్యతిరేక శక్తులు కుట్రలు పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు.  వీటిని సమాజం తిప్పికొడుతుందని స్పష్టం చేశ రు. రాష్ట్ర హైకోర్టు ముందు జిహెచ్ఎంసి అధికారులు ఉద్దేశపూర్వకంగానే వాస్తవాలు వెల్లడించలేదని విమర్శించారు. 
 
ఇప్పటికైనా తగు న్యాయపరమైన చర్యలు చేపట్టి భాగ్యనగర్ ప్రతిష్టను కాపాడాలని, హిందువులను రెచ్చగొట్టే చర్యలను అధికారులు మానుకోవాలని  డిమాండ్ చేశారు. పోలీసులను అడ్డంపెట్టుకొని గణేష్ విగ్రహ తయారీదారులను బెదిరించే చర్యలు  అధికారులు నిలుపుదల చేయకపోతే  ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తుందని హెచ్చరించారు.