హైకోర్టు జడ్జిలపై పిఎఫ్‌ఐ నేత వివాదాస్పద వాఖ్యలు

హైకోర్టు న్యాయమూర్తులపై కేరళ పాపులర్‌ ఫ్రంట్‌ (పిఎఫ్‌ఐ) నేత యాహియా తంగల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారంతా కాషాయ వాదులేనని (బిజెపి) వ్యాఖ్యానించారు. అలప్పుజలో జరిగిన ఒక ర్యాలీలో తంగల్‌ మాట్లాడుతూ ఈ వాఖ్యలు చేశారు. 
 
“అలప్పుజా ర్యాలీలో నినాదాలు విని హైకోర్టు జడ్జీలు షాక్‌ అవుతున్నారు. ఎందుకంటే వారంతా కాషాయవాదులు. మా నినాదాలు వారిని ఆగ్రహానికి గురిచేస్తున్నాయి” అంటూ పేర్కొన్నారు. ఈ ర్యాలీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 
 
హిందువులు మరణిస్తే అంత్యక్రియలపుడు బియ్యం వినియోగిస్తారని, క్రిస్టియన్స్‌ మరణిస్తే అగరొత్తులు వినియోగిస్తారని ఒక బాలుడు పేర్కొనడం ఆ వీడియోలో కనిపిస్తోంది. మీరు మర్యాదగా జీవిస్తే మా దేశంలో స్వేచ్ఛగా జీవించవచ్చని, మీరు మర్యాదగా జీవించకపోతే మాకు స్వేచ్ఛను తీసుకోవడం తెలుసని అంటూ బెదిరింపు మాట్లాడు మాట్లాడాడు. 
 
మంగళవారం అలప్పుజలో పిఎఫ్‌ఐ ఒక ర్యాలీని నిర్వహించింది. ఈ సందర్భంగా పిఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు సిపి. మొహ్మద్‌ బషీర్‌ మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్‌ ఉగ్రవాదంపై తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పిఎఫ్‌ఐపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
అలప్పుజ ర్యాలీలో రెచ్చగొట్టేలా నినాదాలు చేసిన పిఎఫ్‌ఐ నేతలపై తగిన చర్యలు తీసుకోవాలంటూ కేరళ హైకోర్టు పోలీసులను ఆదేశించింది.