జమ్మూలో పాకిస్థానీ డ్రోన్ కూల్చివేత

పాకిస్థాన్ నుంచి భారత దేశంలో ప్రవేశించబోతున్న ఓ డ్రోన్‌ను ఆదివారం ఉదయం జమ్మూ-కశ్మీరులోని కథువా జిల్లా, హీరానగర్ సెక్టర్‌, అంతర్జాతీయ సరిహద్దుల్లో కూల్చేసినట్లు పోలీసులు తెలిపారు. టల్లి హరియా చక్ ప్రాంతంలో దీనిని కూల్చేసినట్లు తెలిపారు. 
 
భారత్‌లో అక్రమంగా చొరబడేందుకు పాకిస్థాన్ ఉగ్రవాదులు ఈ మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారని భావిస్తున్నారు.  అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ ముఖేశ్ సింగ్ మాట్లాడుతూ, కథువా జిల్లాలోని రాజ్‌బాగ్ పోలీసు స్టేషన్ పరిధిలో టల్లి హరియా చక్ ప్రాంతంలో డ్రోన్ సంచరిస్తున్నట్లు సెర్చ్ పార్టీ గుర్తించిందని చెప్పారు.
సరిహద్దుల ఆవలి నుంచి (పాకిస్థాన్ నుంచి) వస్తున్న ఈ డ్రోన్‌ను కూల్చేసినట్లు చెప్పారు. ఈ ప్రాంతంలో ప్రతి రోజూ ఉదయం పోలీసు సెర్చ్ పార్టీ విధులను నిర్వహిస్తుందని తెలిపారు. ఈ డ్రోన్‌లో బాంబులు, ఆయుధాలు ఉన్నాయేమో తెలుసుకునేందుకు బాంబు డిస్పోజల్ నిపుణులు పరీక్షిస్తున్నారని తెలిపారు.  దీనిలో మూడు ప్యాకెట్లు ఉన్నట్లు గమనించామని పేర్కొన్నారు.
ఇదిలావుండగా, ఈ డ్రోన్‌లో ఏడు మాగ్నెటిక్ బాంబులు, ఏడు అండర్ బ్యారెల్ గ్రెనేడ్ లాంఛర్ గ్రెనేడ్లు ఉన్నట్లు తెలుస్తోంది.  జూన్ 30 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమవుతుంది. అమర్‌నాథ్‌ యాత్రను లక్ష్యంగా చేసుకునేందుకు ఈ పేలుడు పదార్థాలను తెచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
జమ్మూ-కశ్మీరులో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతుండటం, వివిధ ఉగ్రవాద సంస్థలు హెచ్చరికలు జారీ చేస్తుండటంతో భక్తులకు భద్రత కల్పించి, ఈ యాత్రను విజయవంతం చేయడం ప్రభుత్వానికి కత్తి మీద సాము వంటిది. దేశంలో కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2020, 2021లలో ఈ యాత్ర జరగలేదు.