ఐపీఎల్ ట్రోఫీ కోసం నేడే రాజస్థాన్ – గుజరాత్ సమరం

దాదాపు రెండు నెలలుగా క్రికెట్ అభిమానులను కనువిందు చేస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) తుది దశకు చేరుకుంది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య తుది సమరం జరుగనుంది. లీగ్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లే టైటిల్ పోరుకు చేరుకున్నాయి. 
 
తొలి క్వాలిఫయర్‌లో రాజస్థాన్‌ను ఓడించి గుజరాత్ ఫైనల్లో ప్రవేశించింది. మరోవైపు రాజస్థాన్ శుక్రవారం జరిగిన క్వాలిఫయర్2లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును చిత్తుగా ఓడించి తుది పోరుకు అర్హత సాధించింది. ఇక గుజరాత్ ఆడిన తొలి టోర్నీలోనే ఫైనల్‌కు చేరింది. 
 
అంతకుముందు రాజస్థాన్ కూడా ఇలాంటి ఫిట్‌నే సాధించింది. ఐపిఎల్ ఆరంగేట్రంలోనే రాజస్థాన్ ట్రోఫీని సాధించి పెను ప్రకంపనలు సృష్టించింది. తాజాగా రాజస్థాన్ రెండోసారి ఐపిఎల్‌లో ఫైనల్‌కు చేరుకొంది. మరోవైపు గుజరాత్ ఆడిన తొలి సీజన్‌లోనే ఫైనల్‌కు చేరి సత్తా చాటింది. 
 
ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్లోనూ గెలిచి చరిత్ర సృష్టించాలనే పట్టుదలతో గుజరాత్ పోరుకు సిద్ధమైంది. మరోవైపు ఈ సీజన్‌లో అత్యంత నిలకడైన ఆటను కనబరిచిన రాజస్థాన్ కూడా ట్రోఫీనే లక్షంగా పెట్టుకుంది. గుజరాత్‌ను ఓడించి తన ఖాతాలో రెండో ఐపిఎల్ ట్రోఫీని జమ చేసుకోవాలని తహతహలాడుతోంది.

ఇక ఫైనల్లో గుజరాత్ ఆశలన్నీ ఓపెనర్ జోస్ బట్లర్‌పైనే నిలిచాయి. ఈ సీజన్‌లో బట్లర్ ఆకాశమే చెలరేగి పోతున్నాడు. బెంగళూరుతో జరిగిన క్వాలిఫయర్2లో అజేయ శతకంతో అలరించాడు. ఫైనల్లో కూడా అదే జోరును కొనసాగించాలనే లక్షంతో ఉన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన బట్లర్ విజృంభిస్తే గుజరాత్‌కు కష్టాలు ఖాయమనే చెప్పాలి. 
 
ఇక మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్, కెప్టెన్ సంజు శాంసన్, హెట్‌మెయిర్, అశ్విన్, రియాన్ పరాగ్ వంటి మ్యాచ్ విన్నర్ బ్యాటర్లు జట్టులో ఉన్నారు. అంతేగాక ప్రసిద్ధ్ కృష్ణ, మెక్‌కాయ్, అశ్విన్, చాహల్, బౌల్ట్‌లతో బౌలింగ్ విభాగం కూడా చాలా పటిష్టంగా ఉంది. 
మరోవైపు తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్ చేతిలో ఎదురైన ఓటమికి ఈసారి బదులు తీర్చుకోవాలనే పట్టుదలతో కూడా రాజస్థాన్ ఉంది. అదే జరిగితే రాజస్థాన్ ఖాతాలో మరో ఐపిఎల్ ట్రోఫీ చేరడం ఖాయం.

మరోవైపు కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్‌లో అంచనాలకు మించి రాణించిందనే చెప్పాలి. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచి సత్తా చాటిన హార్ధిక్ సేన తొలి క్వాలిఫయర్‌లో సునాయాసంగా గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో గుజరాత్ సమతూకంగా కనిపిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు గుజరాత్‌లో కొదవలేదు. 
 
కెప్టెన్ హార్దిక్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్‌లు కూడా నిలకడగా రాణిసతున్నారు. డేవిడ్ మిల్లర్ విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగి పోతున్నాడు. ప్రతి మ్యాచ్‌లోనూ జట్టుకు అండగా నిలుస్తున్నాడు. ఈసారి కూడా జట్టు అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది. ఇక షమి, రషీద్, జోసెఫ్, హార్దిక్ తదితరులతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. ఇరు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో ఫైనల్ సమరం హోరాహోరీగా సాగడం ఖాయం.