మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో జరిగిన రెడ్ల సింహగర్జనలో గందరగోళం నెలకొంది. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతుండగా కొందరు సభికులు అడ్డుకున్నారు. తన ప్రసంగంలో పదే పదే సీఎం కేసీఆర్‌ను, టీఆర్‌ఎ్‌సను పొగుడుతూ మాట్లాడటంపై మండిపడ్డారు. మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇందుకు ఆగ్రహించిన మంత్రి.. మధ్యలోనే వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా ఆయన వాహనంపై కుర్చీలు, వాటర్ బాటిళ్లతో దాడి చేశారు. దీంతో సభలో ఉద్రిక్తత నెలకొంది. తొలుత మల్లారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ఏకరవు పెట్టారు.
అయితే రూ.5 వేల కోట్లతో ఏర్పాటు చేస్తానన్న రెడ్డి కార్పొరేషన్ ఏమైందని సభికులు ఆయనను ప్రశ్నించారు. ఇందుకు మంత్రి సమాధానమిస్తూ.. సీఎం కేసీఆర్ అన్ని కులాలకు కార్పొరేషన్లు, భవనాలు ఇస్తున్నారని, దళితులకు దళిత బంధు ఇస్తున్నారని చెప్పారు. అయితే ఇక్కడ ఇవన్నీ ఎందుకంటూ మంత్రి ప్రసంగానికి పలువురు అడ్డుతగిలారు.
దీంతో ‘‘మా ప్రభుత్వం చేసిన పనులను చెప్పుకోవద్దా..’’ అని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. మళ్లీ కేసీఆర్‌పై ప్రశంసలు మొదలుపెట్టారు. దీనిపై సభికులు మరింత ఆగ్రహంతో ఊగిపోయారు. కుర్చీలు, చెప్పులు పైకెత్తి నిరసన తెలిపారు. దళితబంధు గురించి ఇక్కడెందుకు అంటూ జేఏసీ నాయకులు వేదికపైనే మంత్రిని చుట్టుముట్టి ప్రశ్నించారు.
పరిస్థితిని గమనించిన పోలీసులు రంగంలోకి దిగి మంత్రిని అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయ్నతం చేశారు. మంత్రి వేదిక దిగుతుండగా.. పలువురు అక్కడికి దూసుకువచ్చి మల్లారెడ్డి డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేశారు. మంత్రి వాహనం వెంట పరుగులు తీస్తూ వాటర్ బాటిళ్లు, కుర్చీలు విసిరారు. ఎట్టకేలకు పోలీసులు భారీ భద్రత నడుమ మంత్రిని అతికష్టమ్మీద అక్కడి నుంచి పంపించేశారు.
అంతకుముందు రెడ్ల జేఏసీ సింహగర్జన మహాసభలో వక్తలు.. రూ.5 వేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసే దాకా ఆందోళనను తీవ్రం చేయాలని పిలుపునిచ్చారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్.. మూడున్నరేళ్లుగా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదంతా రేవంత్ రెడ్డి కుట్ర
ఇలా ఉండగా, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కావాలనే తనపై దాడి చేసేందుకు కుట్ర చేశారని మంత్రి మల్లారెడ్డి సోమవారం ఉదయం ఆరోపించారు. అవకాశం కోసం ఎదురుచూసి రెడ్డి సింహ గర్జన సభలో రెడ్డిల ముసుగులో గూండాలను పంపించి తనను చంపేందుకు పధకం వేశారని ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గత ఎనిమిదేళ్లుగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, అతని టార్చర్ తట్టుకోలేక ఎన్నో నిద్రలేని రాత్రిళ్లు గడిపానని ఆవేదన వ్యక్తం చేశారు.
తనపై దాడి చేసిన వారిని ఎవరినీ వదిలి పెట్టనని మల్లారెడ్డి స్పష్టం చేశారు. తనపై జరిగిన దాడికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. కుట్రలు, కుతంత్రాలు చేస్తున్న రేవంత్ రెడ్డి కావాలనే రెడ్డి సభకు గూండాలను పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి కుట్రలు, నేరాలన్నీ బయటకు తీసి జైల్లో పెడుతామని హెచ్చరించారు.
More Stories
అరుంధతి నగర్ లో ఇళ్ల కూల్చివేతపై ఈటెల ఆగ్రహం
ఆరు నెలల్లో ఏపీకి కేంద్రం రూ 3 లక్షల కోట్ల సాయం
జగన్ ప్యాలస్ లపై ఆరా తీసిన అమిత్ షా